‘గల్లా మాధవినో, పిడుగురాళ్ల మాధవినో కాదు, చాకలి మాధవిని, చాకలి ఐలమ్మను!’ అంటున్న గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే నిజంగా గ్రేట్
––––––––––––––––––
‘‘నేను గల్లా మాధవినో, పిడుగురాళ్ల మాధవినో కాదు– చాకలి మాధవిని, చాకలి ఐలమ్మను,’’ అని ఇటీవల ఒక బహిరంగ కార్యక్రమంలో ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ గుంటూరు పశ్చిమ నియోజవర్గం తెలుగుదేశం ఎమ్మెల్యే గల్లా మాధవి. మొన్న అనుకోకుండా ఫేస్‌బుక్ వీడియో సెక్షన్‌ను క్లిక్ చేయగానే– రజక కుటుంబంలో పుట్టిన ఈ 40 ఏళ్ల మాధవి ఆవేశం మేళవించిన ఉత్సాహంతో మాట్లాడుతున్న సంక్షిప్త వీడియో కనపడింది.
మొన్నటి సాధారణ ఎన్నికల్లో చిలకలూరిపేటకు వీడ్కోలు చెప్పి గుంటూరు వెస్ట్ నుంచి విడదల రజని అనే ఓబీసీ (ముదిరాజు?) మాజీ మంత్రి వైఎస్సార్సీపీ తరఫున పోటీకి దిగడంతో ఆమెపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరో బీసీ అభ్యర్ధి గల్లా మాధవిని బరిలోకి దింపారని పత్రికల్లో చదివిన విషయం గుర్తుంది. అంతేకాదు ఆమె బాగా చదువుకుని పైకొచ్చిన రజక కుటుంబంలో పుట్టినాగానీ గల్లా రామచంద్రరావు అనే కమ్మ వ్యక్తిని పెళ్లాడిందని కూడా అప్పటి ఇంగ్లిష్ పత్రికలు సమాచారం ఇచ్చాయి.
Ads
తెలంగాణ నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట సమీపంలోని ఊళ్లో పుట్టి, హైదరాబాద్ మల్కాజిగిరిలో, ఇంకా కర్ణాటకలో చదువుకున్న ముత్రాసి మహిళ (2019 వరకూ ఆమె రజక కుటుంబంలో పుట్టారనే సమాచారం ప్రచారంలో ఉండగా మంత్రిగా ఎంపికైన రోజున తాను ముదిరాజు ఇంట జన్మించానని రజని చెప్పడంతో మీడియాలో ఆ విషయమే ప్రకటించారు) విడదల రజని తర్వాత విడదల కుమారస్వామి అనే ఓసీ కాపు ఐటీ అంట్రప్రెన్యూరును పెళ్లాడిన విషయం కూడా అప్పటికి తెలిసిన విషయమే.
మొదట టీడీపీలో ఉండి చంద్రబాబు నాయుడును రజని ప్రశంసించిన తీరు అద్వితీయం. మళ్లీ గల్లా మాధవి విషయానికి వస్తే ఆమె తండ్రి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్‌లో ఉన్నతాధికారి కావడంతో ఆమె చదువు హైదరాబాద్ షేక్‌పేట్ సహా అనేక ప్రాంతాల్లో జరిగింది. పైన చెప్పినట్టు పెళ్లి కమ్మ కుటుంబంలో పుట్టిన గల్లా రామచంద్రరావు అనే వ్యాపారితో జరిగినాక 2013లో గుంటూరుకు మాధవి కుటుంబం వచ్చేసింది. గుంటూరులో ఆమె సోదరి డాక్టర్. ఆమె కుటుంబం సొంతూరు పొన్నూరు ప్రాంతంలోని ములుకుదురు అని ఈరోజే చదివాను.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే వైఎస్ జగన్ తొలి కేబినెట్లో చేరిన విడదల రజనీ, ఆమెను ఓడించిన గల్లా మాధవి– ఇద్దరూ బాగా చదువుకున్న బీసీ కుటుంబాల్లో పుట్టిన మహిళలే. వారు హైదరాబాదులో చేసిన విద్యాభ్యాసం రాజకీయాల్లో ఎదగడానికి ఉపయోగపడింది. ఇద్దరూ వరుసగా వ్యవసాయం మూల వృత్తిగా ఉన్న కాపు, కమ్మ కుటుంబాల్లో పుట్టినోళ్లను జీవితభాగస్వాములను చేసుకున్నారు.
పెళ్లికాక ముందు తన రజక ఇంటి పేరు పిడుగురాళ్ల అని గల్లా మాధవి ఇప్పుడు ధైర్యంగా చెప్పుకుంటోంది. కాని, తన బీసీ కులం గురించే ఖచ్చితమైన సమాచారం ఇవ్వడానికి వెనకాడే విడదల రజని తాను పుట్టిన కుటుంబం ఇంటి పేరు ఎన్నడూ వెల్లడించలేదు. కాని 2018 సెప్టెంబర్ 10న తెలంగాణ పోరాటయోధురాలు చిట్యాల (చాకలి) ఐలమ్మ (1919–1985) 99వ జయంతి సందర్భంగా విడదల రజని గుంటూరు వైఎస్సార్ కాంగ్రెస్ ఆఫీసులో చాకలి ఐలమ్మ ఫోటో ముందు నిలబడి నివాళులర్పించడమేగాక ఆ చిత్రాన్ని, వార్తను తన ఫేస్‌బుక్ ఖాతాలో పెట్టుకున్నారు.
హైదరాబాద్‌లో చదువుకోవడం వల్ల ఈ ఇద్దరు బీసీ మహిళా పొలిటీషియన్లకు చాకలి ఐలమ్మ గొప్పతనం ఏమిటో తెలిసింది. విడదల రజని తన భర్త జిల్లా గుంటూరులో పోటీచేసినట్టే గల్లా మాధవి తన సొంత జిల్లా గుంటూరు నుంచి ఏపీ అసెంబ్లీకి పోటీచేసి గెలిచారు. అనుకోకుండా ఈ ఇద్దరి మధ్యనే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ స్థానంలో పోటీ జరగడం, మాధవి భారీ మెజారిటీతో విజయం సాధించడం ఆసక్తికర పరిణామం.
గుంటూరు జిల్లాలో సామాజిక మూలాలున్న పిడుగురాళ్ల (గల్లా) మాధవి తన కులానికి చెందిన తెలంగాణ సాయుధపోరాట యోధురాలు చాకలి ఐలమ్మ నేనేనంటూ ఇంతగా మమేకం కావడం ఆంధ్రావాళ్లు గర్వపడాల్సిన విషయం. ఎందుకంటే, తెలంగాణ సాయుధపోరాటంలో ప్రధాన భూమిక నిర్వహించిన కమ్యూనిస్టు పోరాటయోధులు (ఇద్దరూ కోస్తాంధ్ర జిల్లాలు నెల్లూరు, కృష్ణాలో మూలాలున్నోళ్లే) పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు గారి గురించి ప్రస్తుత తెలంగాణ యువతకు దాదాపు తెలియకపోవడం, తెలిసిన తెలంగాణ బుద్ధిజీవుల్లో అనేక మంది (55–60 ఏళ్లు దాటినవాళ్లు) తెలంగాణ ఉద్యమ కాలంలో పొందిన ‘నయా చైతన్యం’తో వారిని తెలంగాణ ద్రోహులు అనే వరకూ వెళ్లి పలచనచేసి మాట్లాడడం జరుగుతున్న రోజులివి.
మరి ఈ తరుణంలో– ఒక కమ్మ రియల్ ఎస్టేట్ వ్యాపారి భార్య అయి ఉండి, టీడీపీ తరఫున గుంటూరు నగరం నుంచి ఎమ్మెల్యే అయ్యాక కూడా తన చాకలి కుటుంబ నేపథ్యం మరవకపోవడమేగాక, తెలంగాణ పోరాట చిహ్నమైన ‘చాకలి ఐలమ్మను నేను’ అని గల్లా మాధవి ప్రకటించుకుంది. ఆమె మాటలు ఆంధ్రా ఓబీసీలు కూడా తెలంగాణ బీసీల మాదిరిగా సామాజిక చైతన్యంతో ముందుకుబోతున్నారనడానికి నిదర్శనం… అదీ అస్థిత్వ స్పృహ…. ( By మెరుగుమాల నాంచారయ్య )
Share this Article