ఒక కొత్త సినిమా వచ్చిందంటే బొచ్చెడు రివ్యూలు… పత్రికల్లో, టీవీల్లో, సైట్లలో, యూట్యూబ్‌లో, సోషల్ మీడియా ప్లాట్‌ఫారాల్లో… ఇప్పుడు సినిమాల ప్రమోషన్‌లో భాగంగా ఫేక్ సోషల్ ఖాతాలు, కేవలం ప్రమోషన్ కోసమే పుట్టుకొచ్చిన చానెళ్లు, సైట్ల ద్వారా సినిమా మొదటి ఆట పూర్తిగాక ముందు నుంచే డప్పు రివ్యూలు రాయిస్తున్నారు… యాడ్స్ కోసం మీడియా, ఫ్యాన్స్‌కు కోపమొస్తుందనే భయంతో మెయిన్ స్ట్రీమ్ టీవీలు కూడా పెద్దగా విమర్శనాత్మక దృష్టితో వెళ్లవు…
కథ చెప్పొద్దు… ట్విస్టులు చెప్పొద్దు… క్లైమాక్స్ అసలే చెప్పొద్దు… అది అనైతికం, నీతిబాహ్యం… ఇక మిగిలింది ఏమిటి..? వాడెలా నటించాడు, ఈమె ఏం చేసింది..? ఎడిటింగ్ ఎలా ఉంది..? సంగీతం బాగుందా..? ఇవి పైపైన రాసేసి, మమ అనిపించేస్తున్నారు… నిజం చెప్పాలంటే తెలుగులో మంచి సమీక్షకులు తక్కువ… ప్రత్యేకించి నిష్పక్షపాతంగా, లోతుగా చేసే విశ్లేషణలు కనిపించడం లేదు… పొరపాటున సినిమా హిట్టయిందంటే చాలు, ఇక దాని జోలికే పోవడం లేదెవ్వరూ…
డబ్బులు బాగా వసూలు చేశాయి కాబట్టి ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, అఖండ, పుష్ప, కశ్మీర్ ఫైల్స్, గంగూబాయ్ తదితర సినిమాల మీద నిశిత సమీక్షలే కనిపించకుండా పోయాయ్… డబ్బుల వసూళ్ల అంకెలే ప్రామాణికమా..? ఇక తప్పులన్నీ కొట్టుకుపోవాలా..? ప్రతి హిట్ సినిమాలో ఎన్ని తప్పులు..? ఎన్నిచోెట్ల మెదడురాహిత్యాలు… ఎన్ని భావచౌర్యాలు… చివరకు సీన్లకుసీన్లే కాపీ కొట్టే దర్శకబ్రహ్మలు… ఇదంతా ఎందుకు అంటే..? ఆంధ్రజ్యోతి సైటులో సీతారామం సినిమాపై ఓ చిన్న రివ్యూ కనిపించింది… బాగుంది… దాన్ని ఓసారి సంక్షిప్తంగా చెప్పుకుందాం…
Ads
తెలుగు సినిమా ప్రేక్షకులు చాలా ఉదారస్వభావులని, కథ… కథనాలలో(storyline) పొరపాట్లు, లోపాలు ఉండటమే కాదు, అసలు మూలాల్లో అవకతవకలు ఉన్నా కూడా ఉపేక్షించి, క్షమించి సినిమాను సూపర్ హిట్ చేస్తారనడానికి తాజా ఉదాహరణ – ఈ శుక్రవారం విడుదలైన ‘సీతారామం’ (Sita Ramam) సినిమా.
ఈ సినిమాకి మూలాధారం కథానాయకుడు లెఫ్ట్‌నెంట్ రామ్ (దుల్కర్ సల్మాన్- Dulquer Salmaan)- కథానాయిక సీతామాహాలక్ష్మి (మృణాల్ ఠాకుర్ – Mrunal Thakur) కి రాసిన ఉత్తరం. పాకిస్థాన్ జైలులో మగ్గుతున్న రామ్ – తను ప్రాణంగా ప్రేమించే సీతకి కచ్చితంగా చేరాలని తపించి రాసుకున్న ఉత్తరం. 1964లో అతను రాసిన ఆ లేఖ, అనేకానేక మలుపుల తర్వాత 20 ఏళ్లకి ఆమెని చేరుతుంది.
అయితే, కచ్చితంగా ఉత్తరం ఆమెకి చేరాలని అతను తపించి ఉంటే, నిజంగానే సంకల్పించి ఉంటే, దాని కవర్ మీద ఆ అడ్రస్ రాయడంలో అర్థం లేదు. తాను రాసిన చిరునామాలో సీత ఉండదని ఆపాటికే అతనికి తెలుసు. తెలిసి తెలిసీ అంత నిష్పూచీగా, నిర్లక్ష్యంగా ఎందుకు ఉన్నాడు? ఆ ఉత్తరం పదే పదే పాకిస్థాన్‌కి తిరిగిరావడం వల్ల ఆ ఉత్తరాన్ని బట్వాడా చేసే బాధ్యత అఫ్రిన్ (రష్మిక మందణ్ణ – Rashmika Mandanna) తీసుకోవల్సి వస్తుంది.
నిర్వేదంలో, నిస్పృహలో, అంతులేని నిరాశలో, వాటితోపాటు ఎంతో ఆశతో కూడా ఆ ఉత్తరాన్ని రాసిన రామం, అది సీతకు ఎలాగైనా చేర్చాలని తహతహలాడిపోయుంటాడు (ఉండాలి). తన శ్రేయోభిలాషి తారీఖ్ ద్వారా సీతకు చేర్చే ప్రయత్నాన్ని రామం సిన్సియర్ గా చేస్తే, కవర్ మీద కరెక్ట్ అడ్రస్ రాసేవాడు కదా. తాను రాసిన చిరునామాలో సీత లేదని, ఆ అడ్రస్ లో ఆమె గురించి ఎవ్వరూ చెప్పలేరని కూడా తెలిసి కూడా ఆ తప్పుడు చిరునామానే ఎందుకు రాశాడు?
1964లో తాను రాసిన ఉత్తరం 20 ఏళ్ల పాటు దిక్కూమొక్కూ లేకుండా తిరుగుతూ, మళ్లీ మళ్ళీ తారీఖ్ కే చేరి, ఆయన వారసురాలు ఆఫ్రిన్ అత్యయిక అనివార్య సాహస యాత్ర కారణంగా సీతకి చేరుతుందని కథక – దర్శకుడు హను రాఘవపూడికి(Hanu Raghavapudi) తెలిసుండొచ్చేమో గానీ, రామం అనే భారత లెఫ్టినెంట్ కి తెలిసే అవకాశం లేదు కదా.
– కాబట్టి, బుద్ధిగా ఆ ఉత్తరం మీద కరెక్ట్ అడ్రెస్ రాస్తే, అతని సీతకి అదే 1964లోనే అంది ఉండేది కదా (అయితే- సినిమా ఉండేది కాదేమో). ‘సీతారామం’ అనే సినిమా నిర్మాణం హను రాఘవపూడికి, తీసిన వైజయంతి / స్వప్న మువీ సంస్థలకీ, తెర ముందు/ వెనక ఉన్నవారికీ, చివరికి చూసే ప్రేక్షకులకి కూడా అవసరమేమో గానీ, పాకిస్థాన్ జైలులో మగ్గుతున్న రామంకి ఏం అవసరం? ఒకవేళ అవసరం ఉందనుకున్నా, అది తన సీత కంటే కాదేమో కదా!
ఇదొక ఉదాహరణ మాత్రమే… రివ్యూలు కూడా తెలుగు సినిమా కథల్లాగే రొటీన్, ఫార్మాట్ రివ్యూలు అయిపోయాయి… ట్రెయిలర్‌తో ఆసక్తిని పెంచిన సినిమా అనే వాక్యం దగ్గర నుంచి రేటింగుల దాకా… అందరిదీ ఒకే తరహా… ఒకే ఫార్ములా… ఎవరూ బేసిక్ కథలోకి వెళ్లడం లేదు… నిజానికి కథే సినిమాకు హీరో, హీరోయిన్… అది సరిగ్గా లేకపోతే సినిమా ఢమాల్… పోనీ, సినిమా రిలీజ్ అయినప్పుడు కథలో బ్లండర్స్ రాస్తే ఇబ్బంది అనుకుంటే… కనీసం ఓటీటీకి వచ్చే టైమ్‌కైనా… పోనీ, ఓటీటీలో, టీవీల్లో వచ్చేనాటికైనా రాయొచ్చు కదా… రాయరు…
కొందరు మాత్రం ఓటీటీల్లో తాపీగా చూసి, సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటారు… అప్పటికే బయ్యర్ నెత్తి మీద ఎర్రతువ్వాల కప్పుకోవడమో లేక డబ్బులు ఫుల్లుగా కుమ్మేసుకోవడమో జరిగిపోతుంది… పైన రివ్యూతో అందరూ ఏకీభవించాలని ఏమీ లేదు… జస్ట్, ఒక ఉదాహరణ కోసం దాన్ని తీసుకున్నాం… అంతే… ఓ దర్శకుడో, ఓ కథకుడో ఎక్కడైనా పొరపాట్లు చేస్తే ఎత్తిచూపాలని, నిందించాలని కాదు… వేరే దర్శకులకు ఇవి పాఠాలు కావాలి కాబట్టి…! అంతిమంగా అది సినిమా ఇండస్ట్రీకే మంచిది కాబట్టి…!!
Share this Article