కొన్ని నిజాలు ఇలాగే నిష్ఠురంగానే ఉంటయ్… ఈ బీజేపీ మతతత్వ పార్టీ, అది అంటరాని పార్టీ అని కాంగ్రెస్, కమ్యూనిస్ట్, ఇతర భావసారూప్య పార్టీలు తెగ ముద్రలు వేసేస్తుంటయ్ కదా… ఒంటి మీద బొచ్చెడు సెక్యులర్ బట్టలున్నట్టు కనిపిస్తుంటయ్ కదా… వోకే, బీజేపీ మతఛాందస పార్టీయే… ఈ పార్టీలన్నీ దానికి దూరంగా ఉండి, ఎలాగైనా సరే బీజేపీని ఓడించాలని కంకణాలు కట్టుకున్నయ్… గుడ్… కానీ మరి ఈ నీతులు చెప్పే పార్టీలు మతఛాందస పార్టీలన్నింటితోనూ ఇదే వైఖరి కొనసాగిస్తున్నాయా..? తమ సెక్యులర్ పాతివ్రత్యాన్ని కాపాడుకుంటున్నాయా..? తెలంగాణలో చూస్తున్నాం కదా, బీజేపీని తెగతిట్టిపోసే టీఆర్ఎస్ మజ్లిస్‌తో మాత్రం అంటకాగుతుంది… అధికారికంగా పొత్తు లేకపోవచ్చు, కానీ పక్కా పరస్పర సహకారంతో ఓ కూటమిలాగే..! మరి ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న అయిదు రాష్ట్రాల్లో ఈ సెక్యులర్ పార్టీలు నిజంగా సెక్యులరిజానికి కట్టుబడి ఉన్నయా..? పత్తిత్తుల్లాగే ఉన్నయా..? ఓసారి చూడాలి కదా మరి… ముందుగా పశ్చిమ బెంగాల్ వెళ్దాం…
బెంగాల్లో లెఫ్ట్, కాంగ్రెస్ డిష్యూం డిష్యూం… కానీ బెంగాల్లో మాత్రం దోస్తీ, తమిళనాడులో దోస్తీ… అస్సాంలో దోస్తీ… పుదుచ్చేరిలో కూడా దోస్తీ… ఈ దోస్తీలను పక్కన పెడితే… బెంగాల్లో లెఫ్ట్ 294 సీట్లకు గాను 175 సీట్లలోనే పోటీచేస్తున్నది… అందులో సీపీఎం పెద్దన్న, మరో నాలుగు ఎర్ర పార్టీలు కూడా ఉన్నయ్… ఇక కాంగ్రెస్ 91 సీట్లకు పోటీచేస్తోంది… మిగతా 28 సీట్లను ఐఎస్ఎఫ్ పార్టీకి ఇచ్చింది… ఇది ఓ కొత్త పార్టీ… ఈ ఎన్నికల కోసమే పుట్టినట్టుంది… పక్కా ముస్లిం పార్టీ… ఆ పార్టీ సిద్ధాంతపత్రంలోనే ఇస్లామిక్ వెల్ఫేరిజం, ఇస్లామిక్ డెమోక్రసీ అని రాసుకుంది… అబ్బాస్ సిద్దిఖీ అనే మతాచార్యుడు పెట్టాడు… పెడితే పెట్టాడు, పార్టీ పెట్టుకునే హక్కు ఉంది, పోటీ చేసే హక్కు ఉంది, కానీ ఇదే కాంగ్రెస్, ఇదే లెఫ్ట్ బీజేపీ అనగానే మతమూ మన్నూమశానమూ గుర్తొస్తయ్… మరి ఈ ఐఎస్ఎఫ్తో అధికారిక పొత్తు మాటేమిటి..? అది మత పార్టీ కాదా..? దాంతో కూడితే సెక్యులర్ పాతివ్రత్యానికి ఏమీ భంగపాటు లేదా..?
Ads
- అలా ఒక్కసారి అస్సాం కూడా చూసొద్దాం పదండి… ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ పార్టీలతోనూ, బద్రుద్దీన్ అజ్మల్ పెట్టిన ఎఐయూడీఎఫ్ పార్టీతోనూ పొత్తు పెట్టుకుంది… సరే, ఈ పార్టీ తనకు తాను ముస్లిం పార్టీగా చెప్పుకోదు… సరే, అస్సాం వదిలేసి, కీలకమైన తమిళనాడుకు వెళ్దాం…
- మా తమిళనాడులో ఉన్నట్టే దేశవ్యాప్తంగా ఓ యాంటీ-బీజేపీ కూటమి పెట్టాలని తాజాగా డీఎంకే స్టాలిన్ రాహుల్ గాంధీకి పిలుపునిచ్చాడు కదా… మరి తమిళనాడులో పొత్తుల కథేమిటి..? ఇక్కడ డీఎంకే పార్టీ సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయెన్స్ పేరిట 13 పార్టీలతో ఓ కూటమి పెట్టింది… అందులో కాంగ్రెస్, లెఫ్ట్ ఉన్నయ్ సహజంగానే… ఖాదర్ మొహిద్దీన్ నాయకత్వంలోని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కూడా ఈ కూటమిలో ఉంది… అది కూడా సెక్యులర్ పార్టీ అన్నమాట… పేరులోనే సెక్యులరిజం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది చూశారు కదా… దీని విద్యార్థి అనుబంధ విభాగం పేరు ముస్లిం స్టూడెంట్ ఫెడరేషన్, యూత్ వింగ్ పేరు ముస్లిం యూత్ లీగ్…
- కేరళలో కాంగ్రెస్ కూటమి పేరు యూడీఎఫ్… ఇందులో కూడా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ భాగస్వామి… ఈ పార్టీ తమిళనాడులో లెఫ్ట్‌తో దోస్తీ… కేరళకొచ్చేసరికి వ్యతిరేక కూటమి… సో, ఏతావాతా అర్థమయ్యేది ఏమిటంటే..? మత పార్టీలకు దూరంగా ఉండాలనే తమ పవిత్రమైన సెక్యులర్ సూత్రాలకు ఇవేమీ కట్టుబడవు… ఓచోట దోస్తీ, మరోచోట కుస్తీ… ఎక్కడి ఏది అవసరమో అది చెబుతూ జనం కళ్లకు గంతలు కట్టడమే… దీనికి ఏ పార్టీ మినహాయింపు కాదు… అవకాశవాదమే రాజకీయం మూలసూత్రం కదా…!! (కథనంలో పాతివ్రత్యం అంటే… ఒక విలువకు, ఒక ప్రమాణానికి కట్టుబడి ఉండటం అనే అర్థంలో మాత్రమే చదువుకోగలరని మనవి…)
Share this Article