Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కుడిఎడమల పలు తుపాకుల కాపలా… ఇది సాయుధ రాజశ్యామలం…

July 15, 2023 by M S R

Deeksha – Darpam: “రథ-గజ తురగ-పదాతి సమావృత…పరిజన మండిత లోకనుతే… శాంతి సమావృత హాస్య ముఖే…” అని అమ్మవారిని పూజిస్తాం. రథాలు, ఏనుగులు, గుర్రాలు, కాల్బలం (నేల మీద నడిచే సాయుధ దళాలు) వెంట రాగా రాజ వీధుల్లో ఊరేగే అమ్మవారిని చూస్తే చాలట- మన కష్టాలన్నీ తీరిపోతాయి. మన భయాలన్నీ పటాపంచలవుతాయి. ఇన్ని బలగాలు వెంట ఉన్నాయి కాబట్టి ఆమె “శాంతి సమావృత” అయ్యిందని పొరబడ్డవారు కూడా లేకపోలేదు. ఆ బలగాలతో లోకాలకు రక్షణ ఇవ్వడంలో ఆమె శాంతి పొందుతూ ఉంటుందని అర్థం. అంటే ఆమె దగ్గర ఉన్న సాయుధులు మనల్ను రక్షించడానికే తప్ప…ఆమెను రక్షించడానికి కానే కాదు.

కట్ చేస్తే-
తెలంగాణ తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి రాజశ్యామల యాగం చేశారు. రాజ శ్యామల, చండీ, ప్రత్యంగిరా, బగళాముఖి, మంత్రిణి, దండిని, వారాహి…అన్నీ అమ్మవారి రూపాలే అయినా ఒక్కో రూపం ఒక్కో రాక్షసుడిని చంపడానికి వచ్చినది. ఇప్పుడు రాజకీయ నాయకులందరికీ ఏ పీఠాధిపతులు చెబుతున్నారో కానీ…రాజశ్యామల యాగం చేస్తే రాజకీయంగా ఇక తిరుగు ఉండదనే నమ్మకం బలంగా నాటుకుపోయింది. కోట్లకు కోట్లు ఖర్చు చేసి అందరూ రాజశ్యామల యాగాలే చేస్తున్నారు. రాజశ్యామలలో ఉన్న “రాజ” అన్న మాట రాజు కావడానికి, రాజకీయంగా బలపడడానికి అని అనుకుంటూ సంపన్న రాజకీయ నాయకులందరూ స్థానిక ఓరుగల్లు భద్రకాళి, బాసర సరస్వతి, వర్గల్ చదువులమ్మ, ఏడుపాయల వన దుర్గలను వదిలేసి రాజశ్యామలమ్మను పట్టుకున్నారు.

Ads

శ్రీశైలంలో నాలుగువేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందని అనుకుందాం. దాన్ని నేరుగా మన సెల్ ఫోన్ ఛార్జింగ్ కు పెట్టుకోగలమా? దాన్ని తట్టుకోగల అత్యంత బలమయిన హై టెన్షన్ వైర్ల ద్వారా ప్రసారమై మొదట పెద్ద ట్రాన్స్ ఫార్మర్లకు…ఆ తరువాత 33 కేవీ , 11 కేవీ ట్రాన్స్ ఫార్మర్లకు…చివర మన ఇంట్లో 230 వోల్ట్స్ మాత్రమే ప్లగ్గులో వస్తే…వాడుకోగలం. నాలుగు వేల మెగావాట్ల హై టెన్షన్ వైర్ మన ఇంటికో, ఒంటికో కనెక్ట్ చేస్తే…చిటికెలో కాలి బూడిద కూడా మిగలదు.

అలా అమ్మవారి రాజశ్యామల, చండీ, ప్రత్యంగిరా, బగళాముఖి, మంత్రిణి, దండిని, వారాహి రూపాలు కొన్ని కోట్ల కోట్ల మెగావాట్ల విద్యుత్ శక్తి ఉన్నవి. ఆ రూపాలను తలచుకున్నా…ఆ నామాలను స్మరించుకున్నా చాలు- సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. మరి ఆ రూపాలను ఆవాహన చేసే యాగాలు…వారిని పిలిచి కూర్చోబెట్టే మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు జరిగినప్పుడు- లోకానికి మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? అన్నది ఆగమశాస్త్ర నిపుణులు తేల్చాల్సిన విషయం. ఒకవేళ నిజంగా మంచి జరుగుతుందనుకున్నా…వాటికి పాటించాల్సిన నియమాలు వేరే ఉన్నాయి. యజ్ఞయాగాదులు లోక కల్యాణానికి పనికివచ్చేవే కానీ…వ్యక్తిగతంగా ఒకరి ప్రయోజనానికి ఉద్దేశించినవి కావు.

ఈ కోణంలో-
లోక కల్యాణానికి పైలట్ రోహిత్ రెడ్డి కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి రాజశ్యామల యాగం చేసి…యాగశాలలో సాయుధులు వెంటరాగా…పెదవి మీద నవ్వు పెదవి దాటి రాకుండా అదిమి పట్టి…యాగ దీక్షా కాషాయ వస్త్రాలతో నడిచి వస్తుంటే…రాజశ్యామలమ్మే భయపడి పక్కకు తప్పుకుని ఉంటుంది. అలాంటిది…ఆయనేదో కే జి ఎఫ్ సినిమా బ్యాగ్రౌండ్ తో సోషల్ మీడియాకు రీల్స్ షూటింగ్ చేశారని…అదని…ఇదని…నానా మాటలు అనడం మర్యాదస్తులు చేయాల్సింది కాదు.

…తప్పు. కళ్లు పోతాయి. లెంపలేసుకోండి!

“రథ-గజ తురగ-పదాతి సమావృత…పరిజన మండిత లోకనుతే… శాంతి సమావృత హాస్య ముఖే…” అన్న ఎత్తుగడ మాటతోనే ముగిస్తే- లోకాలను రక్షించడంలో పొందే ఆనందంతో లోకనుత అమ్మ నవ్వుతూ ఉంటుంది. లోకకల్యాణానికి సాయుధ యజ్ఞ దీక్షతో పొందిన, పొందబోయే శాంతితో సాయుధ పరిజన మండిత లోకనుత కాషాయాంబరధారి పెదవి మీద నవ్వు మొగ్గ తొడిగి ఉంటుంది!

లోకాస్సమస్తాసుఖినో భవంతు. సాయుధ జెడ్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు చండీ, ప్రత్యంగిరా, బగళాముఖి, మంత్రిణి, దండిని, వారాహి సహిత రాజశ్యామల ఆర్ముడ్ ఫోర్స్ అనుగ్రహ ప్రాప్తిరస్తు!

-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions