Early warning to young cartoonists……… కార్టూన్ కబుర్లు – మోహన్
“ఈ బుల్లి పుస్తకం చదవండి. ఒక్క వారంలో మంచి కార్టూనిస్టు కాగలరు. మరో వారం తిరిగేసరికి కార్టూన్ గోల్డెన్ స్టార్ గా వెలుగుతారు. అందరి కళ్లూ మీమీదే. ఆటోగ్రాఫ్ హంటర్స్ అందరూ మీవెంటే. ఎడిటర్లూ, పబ్లిషర్లూ బ్లాంకు చెక్కులు పట్టుకుని మిమ్మల్ని వేటాడతారు. కనకవర్షం, కీర్తివాన,
నవ్వుల హరివిలల్లు”
ఇలా ముందుచెప్తే కింద రాసిందంతా చచ్చినట్టు చదువుతారు కదా అని ఆశ.
అయినా అబద్ధాలెందుకు?
ఉన్నదున్నట్లు చెప్తేపోలా!
ఇందులో మాయామర్మం లేదు.
ఈ పుస్తకం చదివిన తర్వాత ఆర్నెల్లు గడిచినా
మీకు బొమ్మ వేయడం రాకపోవచ్చు.
ఏడాది తిరిగినాక కూడా మీరెవర్నీ నవ్వించలేక బావురుమని ఏడవొచ్చు. చెప్పలేం!
మీరు గీసిన ఎన్టీఆర్ బొమ్మ ఏదైనా పత్రికలో అచ్చు కావచ్చు కూడా! “అది దేవీలాల్ బొమ్మ అని నేనూ, కాదు వీపీ సింగ్ అని నా మిత్రుడూ దెబ్బలాడుకుంటున్నాం. మీరేమంటారు సంపాతక మహాశయా?” అనే లేఖ అదే పత్రికలో చూసినపుడు మీరు తలబాదుకునే గోడ వెతుక్కుంటూ వెళ్లిపోవచ్చు. చెప్పలేం. ముందే చెప్పాగదా.
ఇలా సోది చెప్పడమేనా, కార్టూన్లు చెప్పేదేమన్నా ఉందా.. అని మీరు కసురుకోవచ్చు. బొమ్మలు నేర్చుకోవాలంటే బోరు భరించాలి. ఇది మొదటి లక్షణం. ముందు ఇలాంటి హింస తట్టుకోగలిగితే తర్వాత ఎడిటర్లూ, పబ్లిషర్లూ కళ గురించి ఇచ్చే ఉపన్యాసాలను సునాయాసంగా విని, తట్టుకుని
తల ఊపి, నవ్వలేక చచ్చి, మీ చచ్చుబొమ్మల్ని అచ్చువేయించుకోగలుగుతారు.
రెండో అర్హత : టెన్త్ పోయిందనో, ఇంటర్ పాసయ్యారనో బెంగపడనవసరం లేదు.
డిగ్రీ అయిందీ… ఎద్దులాగా ఇరవయ్యేళ్లు కిందకొచ్చాయనే బాధ వద్దు.
ఇప్పుడైనా మీరు బొమ్మలు మొదలెట్టొచ్చు. కావలసిన పరికరములు : ఒక పెన్సిలూ,
ఒక కాగితం, బుర్రా! బస్, అంతే. పెన్సిలూ కాయితం దగ్గర్లోని ఫాన్సీ షాపులో దొరుకుతాయి.
బుర్ర అమ్మరు. అంటే అది మీ దగ్గరే వుంటుంది (ఉండకపోతే ఉండదేమో). ఉన్న బుర్రను అలాగే జేబులో ఉంచుకోవాలనేం లేదు. పైకి తీయొచ్చు. పెంచుకోవచ్చు. పదును పెట్టొచ్చు. అదెలా అంటే, సింపుల్. బాపూ లాంటి ఆల్ టైమ్ గ్రేట్ ఆర్టిస్ట్ ల బొమ్మలూ, కార్టూన్లూ చూడడం. ఇతర దేశాల పత్రికలూ, పుస్తకాల్లో రకరకాల ఆర్టిస్టులు ఎన్నో రకాలుగా గీసిన గీతల విచిత్రాలను చూసి విస్తుపోవడం. తర్వాత మీ సొంత తరహాలో ఎలా గీయాలో సొంతగానే తెలుసుకోవడం. ఇది క్షణాల్లో అయ్యే పనికాదు. బొమ్మలు గీయడంతో పాటు బతుకంతా ఈ స్టడీ సాగుతూనే వుంటుంది. ఉండాలి. లేకపోతే మీరు ఈరోజున గీసిన గీతలే పదేళ్ల తర్వాత కూడా గీస్తుంటారు. అందుకే దేశదేశాల ఆర్టిస్టులు, కార్టూనిస్టులు, కారికేచరిస్టుల బొమ్మల్ని ఈ పేజీల్లో పరిచయం చేస్తా. నాకు తెలిసిన బుల్లి ప్రపంచాన్ని మీముందు తెరుస్తా. అంతకుమించి మీ చేయిపట్టుకు నేను దిద్దించేదేమీ లేదు (ఆమాటకొస్తే నాకొచ్చిచచ్చిందెంత గనక)! నేనే కాదు పికాసో
గ్రాండ్ ఫాదర్ దిగొచ్చినా మీకు నేర్పేదేం ఉండదు. మీరే నేర్చుకుంటారు. మీరే నేర్చుకోవాలి.
నేర్చుకోవటం ఆషామాషీ వ్యవహారం కాదు. కార్టూన్లు ఫన్నీగా ఉంటాయేమోగానీ కార్టూనింగ్ సరదాగా ఉండదు. ఇది సీరియస్ విషయం.
కుట్టు నేర్చుకోవటం, డ్రాయింగ్ మేస్టరవడం,
ఎమ్సెట్ ఎంట్రెన్స్ రాయటం, ఎంబీఏ చదవడం, బిజినెస్ పెట్టడం లాటివన్నీ ఒక తరహా. సవాలక్ష మంది అలాంటి పనులు చేస్తుంటారు. అలాగే కార్టూనింగ్ ద్వారా కెరీర్ అనుకొని బొమ్మలు మొదలెట్టడం దండగ. ఇందులో కెరీర్ లేదు. డబ్బులూ రావు. సుఖం బొత్తిగా లేదు. “ఫలానా డాక్టర్ గారూ, యాక్టర్ గారూ, ఫలానీ ఇంజనీర్ గారూ, బిగ్ షాట్ గారూ” అని చెప్పుకుంటున్నట్టు
మీ గురించి ఒక్కడుగాక ఒక్కడూ చెప్పుకోడు.
“మా బ్రదర్ ఆర్టిస్ట్” అని మీ సిస్టర్ ఫ్రెండ్ కి చెప్తే “పాపం ఆర్టిస్ట్” అనికూడా ఆ అమ్మాయి అనొచ్చు. కార్టూన్ల మీద వచ్చే (లేక రాని) రెమ్యూనరేషన్ తో మీరు పోగేసే కరెన్సీ కుప్పలేం ఉండవు. కనక మీరు “యమాహా! డమా ఢమాహా” లాంటి బండి మేంటైన్ చేయలేరు. క్రికెట్ ఆడే టైమ్ ఉండడు. (ఓ మూల కూచుని బొమ్మ వెయ్యాలి గదా!) ఇలాటి వాడిని వలచివచ్చే అమ్మాయిలూ ఉండరు. కనక ఎలాంటి స్టేటస్, పవర్, గ్లామర్ లేని ఇలాంటి ఫీల్డులోకి రావాలంటే మీరు బాగా చాతకాని వెర్రివాళ్ళయి ఉండాలి. లేదా కళారాధన పూనిన పూర్తి పిచ్చివాళ్ళై ఉండాలి. పై రెండింటిలో ఏ ఒక్కటయినా వేపకాయంత ఉంటే చాలు. ఇక కార్టూన్ చరిత్ర బొమ్మల్లో చదూకుందురు గాని.
– Mohan, Artist……… ఈ వ్యాసం 1989 జులై 28న మోహన్ రాశాడు. Many more articles to follow…….. – TAADI PRAKASH 9704541559
Share this Article