.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎవరు..? ఆదేశించిన కేసీయారా..? అక్షరాలా అమలు చేసి, స్వప్రయోజనాల కోసం అరాచకానికి తెగబడిన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, ఇతర సిబ్బందా..?
ఫోన్ ట్యాపింగులు చేయించని ప్రభుత్వం లేదు… ఉండదు… కానీ ఆ ట్యాపింగు వ్యవస్థను సెటిల్‌మెంట్లకు, వసూళ్లకు, దందాలకు, చివరకు సినిమా తారల్ని లొంగదీసుకోవడానికి కూడా వాడిన పాపం కేసీయార్‌కు తగిలింది… అదంత తేలికగా మాసిపోయే పాపమూ కాదు…
Ads
వస్తున్న వార్త ప్రకారం… ప్రభాకరరావు అమెరికాకు చికిత్స పేరిట పారిపోయాడు… అక్కడ తలదాచుకున్నాడు… చికాగోలో అడ్డా అట… చాలామంది నేరగాళ్లు దేశం వదిలేసి పారిపోతుంటారు, అదేమీ కొత్త విషయం కాదు గానీ… వెంటనే అమెరికా గ్రీన్ కార్డు ఇవ్వడం ఏమిటి..? అదే అర్థం కాదు…
అంత అర్జెంటుగా గ్రీన్ కార్డు ఇచ్చేందుకు ఏం వెసులుబాట్లు ఉపకరించాయో తెలియదు గానీ… నిన్న వచ్చిన వార్త మరింత విస్మయకరం… ఇండియాలో తనకు రక్షణ లేదని అమెరికా ఆశ్రయం కోరుతున్నాడట… రాజకీయ శరణార్థిగా గుర్తించాలట…
తనేమీ పొలిటిషయన్ కాదు, ఆ కేటగిరీలోకే రాడు… ఐనా సరే ఓ ప్రయత్నం… తనకు కూడా అమెరికా చట్టాల లొసుగులు బాగానే తెలుస్తున్నట్టున్నయ్… ఏమో, ఇచ్చినా ఇస్తుంది అమెరికా… కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో చేయగలిగేది కూడా ఏమీ లేదు… ఇంటర్‌పోల్ నోటీసులు జారీ అయినా సరే, కేంద్రం సహకరిస్తే తప్ప సదరు పెద్ద పోలీసును లాక్కురాలేం…
రాజకీయ కారణాలు లేకపోయినా ఎవరైనా ఏ సీరియస్ నేరం చేసినా సరే, విదేశం శరణార్థిగా ఆశ్రయం ఇవ్వవచ్చా..? అది ఆ దేశం ఇష్టం, మన దేశంతో సంబంధాలను బట్టి ఉంటుంది… లలిత్ మోడీ, విజయ్ మాల్యా తదితరులు ఎంచక్కా బ్రిటన్‌లో ప్రవాస జీవితం గడపడం లేదా..?
ఇక్కడ అదే ప్రశ్న… మన విదేశాంగ శాఖ డీల్ చేస్తే తప్ప సాధ్యం కాదు… నేరగాళ్లు, నిందితుల అప్పగింతకు ఇరుదేశాల నడుమ ఒప్పందాలున్నాయి… కానీ కేంద్ర ప్రభుత్వం పూనుకుంటుందా… అదే సందేహం… ఎందుకీ డౌట్ అంటే..? ఫార్ములా స్కామ్‌లో కేటీయార్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ ఈరోజుకూ అనుమతించడం లేదు… నెల దాటిపోయింది…
అలాంటిది కేసీయార్ స్వయంగా ఇరుక్కునే కేసుకు బీజేపీ సహకరిస్తుందా..? ఏదో లోపాయికారీ అవగాహన బీజేపీ, బీఆర్ఎస్ నడుమ కనిపిస్తోంది… తెలంగాణలో బీజేపీ ప్రయోజనాలకు, ఎదుగుదలకు అది తీవ్ర అడ్డంకి ఐనా సరే, మోడీషా పట్టించుకోవడం లేదు… బీఆర్ఎస్ పట్ల ఏదో సాఫ్ట్ కార్నర్ కనిపిస్తోంది… అదేం వ్యూహమో ఏలినవారికే తెలియాలి…
ఇక్కడేమో కేటీయార్‌ను అరెస్టు చేయలేరా..? దమ్ము లేదా అన్నట్టు మాట్లాడతారు బీజేపీ నేతలు… కానీ ఢిల్లీలో జరిగేది వేరు… మరి ఈ స్థితిలో విదేశాంగ మంత్రి జైశంకర్ పెద్ద పెద్ద అంతర్జాతీయ అంశాలను పక్కన బెట్టి ఈ ప్రభాకరరావుకు పగ్గాలు వేసి లాక్కురావడానికి పూనుకుంటాడా..? అదీ సందేహం..! బీఆర్ఎస్‌కు బీజేపీ భరోసా అనే విమర్శల్లో నిర్హేతుకత ఏముంది ఇక..!!
Share this Article