.
త్రినయని… ఒక టీవీ సీరియల్… జీతెలుగులో వస్తుంది… మరీ ఒక టీవీ సీరియల్ గురించి వార్తా..? అని నొసలు ముడేయకండి…
టీవీలు నడిచేదే సీరియళ్ల మీద ఆధారపడి… రెవిన్యూ, రేటింగ్స్ అన్నీ ఆ లెక్కల్లోనే… ఒక క్రియేటివ్ వర్క్ ఎలా ఉండకూడదో చెప్పడానికి టీవీ సీరియళ్లు ఉదాహరణలు… సవాలక్ష సీరియళ్లకు ఓ పర్‌ఫెక్ట్ ఉదాహరణ త్రినయని సీరియల్…
Ads
ఇప్పుడు విషయం ఏమిటయ్యా అంటే… అది ఇక ముగిస్తారట… అందులో ఓ పనికిమాలిన హీరో కేరక్టర్ ఉంటుంది… దాన్ని పోషించే చందూ గౌడ ఇక ఇదే చివరి రోజు షూటింగ్ అని తన సోషల్ ఖాతాలో ఏదో పోస్టాడట…
ఇది ది గ్రేట్ అన్నపూర్ణా స్టూడియోస్ వారి సీరియల్ కాబట్టి కూడా చెప్పుకుందాం ఓసారి… నిజానికి ఇది జీబంగ్లాలో ప్రసారమైన సీరియల్ ఒరిజినల్‌గా… 2019 మార్చిలో స్టార్టయి జూలై 2020లో ముగిసింది… అంటే 16, 17 నెలల్లో శుభం కార్డు…
కానీ తెలుగులో దాన్ని 2020 మార్చిలో స్టార్ట్ చేస్తే ఇంకా నడుస్తూనే ఉంది… దాదాపు అయిదేళ్లు… అంటే 16 నెలల ఆ బంగ్లా సీరియలే ఓ జీడిపాకం అనుకుంటే… మరి అయిదేళ్లుగా దాన్ని అటు పీకి, ఇటు పీకి, ఏదేదో పెంట చేసేసి ఇక్కడి దాకా లాక్కొచ్చారంటే జీడిపాకం పదానికి మరేదో సూపర్‌లేటివ్ డిగ్రీ పదం కావాలి…
1400 ఎపిసోడ్స్ దాటినట్టు ఎక్కడో చదివినట్టు గుర్తు… క్రూరురాలైన ఓ సవతి అత్త… సతీ త్రినయని కోడలు… వెన్నెముక లేని హీరో… స్వాములు, మంత్రాలు, మాయలు, భవిష్య దర్శనాలు, పాముల స్టంట్లు, చివరకు హీరోయిన్ యమలోకం కూడా వెళ్లొస్తుంది… భర్తను చంపేస్తే శవాన్ని ఒడ్డుకు లాగి బతికిస్తుంది… సాక్షాత్తూ ఆ శ్రీశైలం అమ్మవారే చిన్నపిల్లగా ఆ ఇంట్లో సంచరిస్తుంటుంది… నాటి విఠలాచార్యకు కూడా చేతకాని కథ…
అబ్బో… రచయిత కలం ఎటు తిరిగితే అటు సాగిపోతుంది కథ… దీనికి సూపర్ నేచురల్ జానర్ అని పేరుపెట్టారు… ఇక ఈనెల 25తో ముగుస్తుందని ఓ వార్త… హమ్మయ్య… అభిషేకం అని ఈటీవీలో ఓ సీరియల్ వచ్చేది… మొదట్లో దాసరి దర్శకత్వం… 2008 నుంచి పదమూడేళ్లు సా-గిం-ది… ఎన్ని ఎపిసోడ్లో తెలుసా..? అక్షరాలా నాలుగు వేలు…
ఆ రికార్డు కూడా త్రినయని అధిగమిస్తుందేమో అనిపించింది… ఇప్పటికే త్రినయని మీద వెయ్యి కుట్రలు అమలు చేసి ఉంటుంది సవతి అత్త… చూసీ చూసీ జనానికి చిర్రెక్కింది, రేటింగ్స్ పడిపోయాయి, ఒకప్పుడు జీతెలుగు సీరియల్స్‌లో టాప్… తరువాత టాప్ 30 లిస్టు నుంచి మాయమైంది… తీసుకుపోయి మధ్యాహ్నం స్లాటులో పడేశారు… ఇప్పుడు మరీ రెండు, మూడు రేటింగ్స్… సో, ఇక ఇంకా సాగదీయలేక చేతులెత్తేశారు…
ఈ సీరియల్ తమిళం, మలయాళం, పంజాబీ, మరాఠీలలో కూడా రీమేక్ అయ్యింది… మలయాళంలో కూడా ఏడాదిన్నరలోపే ముగించారు… ఏమాటకామాట తెలుగులో హీరోయిన్‌గా చేసే ఆషికి పడుకోన్ ఓ ఆకర్షణ సీరియల్‌కు… బహుశా హయ్యెస్ట్ పెయిడ్ టీవీ నటి కావచ్చు తెలుగులో…
అత్త పాత్రలో మొదట్లో పవిత్రా జయరాం చేసేది, మంచి నటి… తరువాత యాక్సిడెంటులో చనిపోయాక చైత్ర అని మరొకామెను ప్రవేశపెట్టారు, పర్లేదు… వల్లభ పాత్ర చేసిన సురేష్ పటేల్, హాసిని పాత్ర చేసిన విష్ణుప్రియ కూడా పర్లేదు… ఆ పాత్రలే కాస్త ఆసక్తికరం సీరియల్‌లో… అప్పుడప్పుడూ జయలలిత ఓ పాత్రలో కనిపించేది…
ఆషికి పడుకోన్ తమిళంలో కూడా లీడ్ రోల్ అంగీకరించి, సగం దూరం వచ్చాక కూడా దాన్ని అర్థంతరంగా వదిలేసినట్టు ఓ వార్త చదివినట్టు గుర్తు… ఏమో సినిమాల్లోలాగే టీవీల్లోనూ క్రియేటివ్ డిఫరెన్సెస్ అనే సాకులు ఉంటాయేమో..!!
Share this Article