ఓటీటీలు వచ్చాక థియేటర్లకు వచ్చేవాడు లేడంటూ బయ్యర్లు, ఎగ్జిబిటర్లు ఏడుస్తున్నారు… బాబ్బాబు, బుద్ది తక్కువై టికెట్ల రేట్లు పెంచేశాం గానీ, ఇప్పుడు చెంపలేసుకుని తగ్గించేస్తున్నాం, రండి బాబూ, ప్లీజ్ రండి అని ప్రచారం చేసుకుంటున్నారు నిర్మాతలు… ఐనా సరే, థియేటర్ వెళ్లే ప్రేక్షకుడు జేబులు పలురకాలుగా ఖాళీ అయిపోయి, తెలిసీ ఎందుకొచ్చానురా బాబూ అని ఏడుస్తున్నాడు… టీవీల్లో ప్రసారం చేసినప్పుడు చూడొచ్చులే, అంత గొప్ప కళాఖండాలేమీ రావడం లేదుగా అని తమకుతామే సర్దిచెప్పుకుంటున్నారు…
నిజానికి ఇప్పుడు ఓ విచిత్ర పరిస్థితి… ఫెయిలైన సినిమాలను కూడా ఓటీటీలే ఒకింత ఆదుకుంటున్నయ్… బయ్యర్ల కన్నీళ్లు తుడుస్తున్నయ్… ఎలాగంటే..? ఆచార్య… బిగ్గెస్ట్ డిజాస్టర్ కదా… నైజాం ఏరియాకే 25-30 కోట్లు ఖలాస్… మొత్తం లెక్కేస్తే 65- 70 కోట్ల మేరకు లాస్… అమెజాన్ వాడు మొదట అనుకున్న షెడ్యూల్‌కు రెండు వారాల ముందే దీన్ని ప్రసారం చేస్తాడు… మొదట ఒప్పందం కుదిరినదానికి అదనంగా 17 కోట్లు ఇస్తున్నాడు… ఆ డబ్బును నిర్మాత డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చి వాళ్ల కన్నీళ్లు తుడుస్తున్నాడు… ఏ ఓటీటీలను టాలీవుడ్ పెద్దలు తిట్టేస్తున్నారో చివరకు అవే వాళ్లకు ఊపిరి నిలుపుతున్నాయి…
సర్కారువారి పాట విషయానికొస్తే బయ్యర్లతో జరిగిన బిజినెస్‌కూ, ఇంకా రికవరీ కావల్సిన దానికీ నడుమ దాదాపు 10 కోట్ల గ్యాప్ ఉంది… సో, ఒక వారం ముందే ఓటీటీలో ప్రసారం చేసేలా ఒప్పందం కుదిరింది… దీనికిగాను సదరు ఓటీటీ అదనంగా ఆరేడు కోట్లు ఇస్తోంది… ఎక్కడైతే ఎక్కువ నష్టం వచ్చిందో అక్కడ బయ్యార్లకు ఆ సొమ్ము సర్దుబాటు చేస్తారన్నమాట… తెలుగులో మేజర్, విక్రమ్ బిజినెస్ తక్కువే… వసూళ్లు, ఓటీటీ రైట్స్, ఎట్సెట్రాలు కూడా కలిపితే సేఫ్ ప్రాజెక్టులు అవి… (తెలుగులో…) మేజర్ టికెట్ రేట్లను రీజనబుల్‌గా ఉంచినా, విక్రమ్ మన జేబుల నుంచి బాగానే లాగాడు…
Ads
అంటే సుందరానికి సినిమా కూడా ఫ్లాప్… నిడివి ఎక్కువ, బోరింగ్ ఫస్టాఫ్, గ్రిప్ లేని కథనం, ఇంప్రెసివ్‌గా లేని సంగీతం గట్రా ఎన్ని కారణాలు ఉన్నా సరే… గల్లాపెట్టె సౌండ్ ఎక్కువ, నిండింది తక్కువ… మరీ ఈ రేంజులో సినిమా చతికిలపడుతుందని ఎవరూ అనుకోలేదు… టికెట్ రేట్లు కూడా ఓ కారణమే… నానికి నిజాలు కొన్ని అర్థం కావడం లేదు… వి, టక్ జగదీష్, శ్యామసింగరాయ్, ఇప్పుడు ఈ సినిమా… అసలే సెకండ్ లేయర్ హీరో… ఇప్పుడు ఇంకా పడిపోయింది మార్కెట్…
మళ్లీ ఓటీటీయే దిక్కయింది వీళ్లకు కూడా… చాలా ముందుగానే ఓటీటీలో రిలీజ్ చేసేలా అగ్రిమెంట్ చేసుకుని ఏడెనిమిది కోట్లను అదనంగా సర్దుబాటు చేస్తున్నారు ఓటీటీ వాళ్లు… నెత్తి మీద తువ్వాల వేసుకున్న బయ్యర్లకు కొంత కన్నీటితుడుపు అన్నమాట… విరాటపర్వం సినిమాను కూడా ఓటీటీలు ఎప్పుడో కొన్నాయి, అందులోనే రిలీజ్ చేయాలి… కానీ రానా చాన్నాళ్లుగా థియేటర్లలో లేడు, సో, దీన్ని ముందు థియేటర్లలోనే రిలీజ్ చేద్దామని సురేష్‌బాబు ఒత్తిడి తేవడంతో ఇక థియేటర్ల బాట పట్టింది సినిమా… ఇది కమర్షియల్ సినిమా కాదు, కంటెంట్ ఓరియెంటెడ్… డైరెక్టర్ ఎంత నిజాయితీగా కష్టపడినా సరే, రిలీజు ముందు సాయిపల్లవి అసందర్భ వ్యాఖ్యల ఇష్యూ సినిమా మీద నెగెటివిటీని పరిచింది… సో, టాక్ బాగుంటే వోకే, లేదంటే ఓటీటీలో ముందస్తు బాటే…!!
Share this Article