Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అసలే వాణిశ్రీ… పైగా చిరంజీవి… విజయశాంతీ ఉండనే ఉంది… ఇంకేం..?!

December 25, 2025 by M S R

.

కొంగు జారితేముంది కొంటె పిల్లోడా, నీ గుండె చిక్కుకుందేమో చూడు పిల్లోడా అంటూ తెలుగు పిల్లోళ్ళందరి గుండెల్ని కాజేసిన వాణిశ్రీ ఎనిమిది సంవత్సరాల విరామం తర్వాత పొగరుబోతు అత్తగా సెకండ్ ఇన్నింగ్సులో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సినిమా ఈ అత్తకు యముడు అమ్మాయికి మొగుడు .

ఆరోజల్లో టాప్ హీరోయిన్లకు ఇచ్చే పారితోషికానికి రెట్టింపు ఇచ్చి అత్త పాత్రకు ఆమెను తీసుకున్నారట .
చిరంజీవి మాంచి ఊపులో ఉన్న పీరియడ్లో తీయబడిన సినిమా ఇది . అప్పటికే రెండు ఇండస్ట్రీ హిట్లు కొట్టి ఉన్న చిరంజీవికి దీటైన అత్త కావాలంటే మామూలు విషయం కాదు కదా ! సినిమాలో ఈ రెండు పాత్రలే నువ్వా నేనా అన్నట్లుగా ఉంటాయి .

Ads

అప్పటికి అత్తగారంటే యస్ వరలక్ష్మే . ముఖ్యంగా 1971 లో వచ్చిన బొమ్మా బొరుసాలో అత్తగారిగా ఆమె అదరగొట్టింది . వాస్తవానికి ఈ చిరంజీవి సినిమా ఆ బొమ్మా బొరుసాకు చాలా దగ్గరగా ఉంటుంది . అందులో రెండో అల్లుడు చలం , పెద్దల్లుడు తమ్ముడు చంద్రమోహన్ ఇద్దరూ అత్తతో పందెం కాస్తారు . పందెం అని ఎవరికీ చెప్పకూడదనే షరతు కూడా ఉంటుంది . అలాంటి షరతే ఈ చిరంజీవి సినిమాలో కూడా ఉంటుంది .‌

కధను వ్రాసిన సత్యానందుకి మస్తిష్కంలో ఎక్కడో ఈ సినిమా ఉండి ఉంటుంది . చిరంజీవి స్టార్‌డమ్‌కు దీటుగా కధను నేసి ఉంటారు . దర్శకుడు కోదండరామిరెడ్డి , నిర్మాత అల్లు అరవింద్ . ఇద్దరూ సినిమా వ్యాపారాన్ని ఔపాసన పట్టిన వారు కావడంతో స్క్రీన్ ప్లేని ప్రేక్షకరంజకంగా తీర్చిదిద్దుకున్నారు .

సినిమాలో చిరంజీవి నటన , కామెడీ టైమింగ్ , కామెడీ డైలాగ్ డెలివరీ బ్రహ్మాండం . తాగి విజయశాంతి వద్దకు వచ్చి “నా ముక్కు మీద వేలుపెట్టి” అనే డైలాగును రకరకాలుగా రిపీట్ చేసే సీన్ ప్రేక్షకులు మరచిపోలేరు . అలాగే వాణిశ్రీతో పోటాపోటీ డైలాగులు . ఇద్దరూ ఇద్దరేగా పోటీ పడి నటించారు .

అలాగే రావు గోపాలరావు , అల్లు రామలింగయ్యలతో కూడా చిరంజీవి కామెడీ డైలాగులు అభిమానులను అలరించాయి . ఈ సినిమా కధ చెప్పాల్సిన అవసరమే లేదు . బహుశా చూడనివారు ఉండరేమో !

vanisri
వారిద్దరి తర్వాత తాంబూలం విజయశాంతిదే . పొగరుబోతు కూతురిగా , హీరోతో ప్రేమలో పడే నాయికగా , పెళ్ళయ్యాక భార్యగా చక్కగా నటించింది . ఇంక పాటల్లో చిరంజీవికి దీటుగా నృత్యించింది . ఇతర ప్రధాన పాత్రల్లో రావు గోపాలరావు , సత్యనారాయణ , అల్లు రామలింగయ్య , గిరిబాబు , సుధాకర్ , అరుణ్ కుమార్ , అన్నపూర్ణ , వరలక్ష్మి , ముచ్చెర్ల అరుణ , సుత్తి వేలు , బ్రహ్మానందం  తదితరులు నటించారు . బ్రహ్మానందం కామెడీ అవసరం లేకుండా చిరంజీవి , అల్లు రామలింగయ్యలు లాగించేసారు .

తెర వెనుక నిపుణుల్లో మొదట చెప్పుకొవలసింది సంగీత దర్శకుడు చక్రవర్తి , నృత్య దర్శకులు తార , సుందరం . వేటూరి వారు , భువనచంద్ర పాటల్ని వ్రాయగా బాలసుబ్రమణ్యం , జానకమ్మ శ్రావ్యంగా పాడారు .
కలలో పెట్టని ముద్దులు పెట్టు , శాంతీ ఓం శాంతీ అరె ఖైదీ , మెరుపులా ఆడతా పిడుగులా రేగుతా , టింగురమ్మ చక్కనమ్మ డ్యూయెట్లు కోదండరామిరెడ్డి బ్రహ్మాండంగా చిత్రీకరించారు .

శాంతీ ఓం శాంతీ పాట జైలు వాతావరణంలోలాగా వినూత్నంగా కంపోజ్ చేసారు . ఈ సినిమాలో ఓ పాట గురించి ప్రత్యేకంగా చెప్పాలి . దిగు దిగు దిగు భామా అంటూ దిగు దిగు దిగు నాగాలాగా ఉంటుంది .

తెలుగులో కనక వర్షం కురిపించిన ఈ సినిమా 14 కేంద్రాలలో వంద రోజులు ఆడింది . వంద రోజుల ఫంక్షన్ రాజమహేంద్రవరంలో జరిగింది . తెలగులో సూపర్ హిట్టయిన ఈ సినిమా తమిళంలో మాప్పిళ్ళై అనే టైటిలుతో తీయబడింది . రజనీకాంత్ , అమల , శ్రీవిద్య ప్రధాన పాత్రల్లో నటించారు . చిరంజీవి రజినీకాంత్ స్నేహితుడిగా ఓ చిన్న పాత్రలో తళుక్కుమంటాడు .

హిందీలో జమైరాజా అనే టైటిలుతో రీమేక్ అయింది . హేమమాలిని , అనిల్ కపూర్ , మాధురీ దీక్షిత్ లీడ్ రోల్సులో నటించారు . తర్వాత ఇదే తమిళ సినిమా ఆంధ్రా అల్లుడు టైటిలుతో డబ్ చేసారు . బెంగాలీ , బంగ్లాదేశీ , మళయాళ భాషల్లో కూడా రీమేక్ అయింది .

సినిమా చూడనివారు ఉండరు . ఒకరూ అరా ఎవరయినా ఉంటే సినిమా యూట్యూబులో ఉంది . చూసేయండి . It’s a fantastic comedy & commercial entertainer . నేను పరిచయం చేస్తున్న 1203 వ సినిమా . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అమెరికాను నమ్మి… చివరకు ఎడ్డిమొహం వేసేది మళ్లీ పాకిస్థానే…
  • సొంత కోతలు, తిక్క కూతలు… పాకిస్థాన్ ప్లేయర్లు ఇక అస్సలు మారరు…
  • సొంతూళ్లో… సొంతింట్లో… వ్రతం, విందు… భేష్ విజయ్ దేవరకొండా…
  • చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌‌ను నమ్మి… ఇరాన్ నిండా మునిగిందా..?!
  • 70 ఏళ్ల మాస్ ముసలమ్మ..! ఈ వయస్సులోనూ రాధిక అదరగొట్టేసింది..!!
  • తమ్మినేనికి అభిశంసన..! సీపీఎం కేంద్ర కమిటీ మండిపాటు..?!
  • ఆ రష్మిక మంధన్నా గురించే కాదు… ఈ రష్మి గౌతమ్ గురించీ ఓసారి చెప్పుకోవాలి…
  • విజయ శాంతిని ఏకంగా ఫైర్ బ్రాండ్ లేడీ అమితాబ్‌ను చేసింది..!
  • రష్మిక మంధన్నా..! తన మూలాల్ని గౌరవించింది… గర్వంగా చెప్పుకుంది…!
  • డెడ్లీ మొసాద్- ఇరాన్ అణు కార్యక్రమంపై విస్తుపోయే ఆపరేషన్లు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions