బ్రేకింగ్ న్యూస్ అంటూ పొద్దున్నుంచీ ఓ వాట్సప్ వార్త చక్కర్లు కొడుతోంది… అదేమిటో సంక్షిప్తంగా చదువుదాం ముందుగా… ‘‘ప్రైమ్ 9 న్యూస్ లైసెన్స్ సస్పెండ్ చేయబడింది… చట్టవిరుద్ధమైన వార్తా ప్రసార మాధ్యమాలపై భారీ అణిచివేతలో, సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ హైదరాబాద్ ఆధారిత వార్తా ఛానెల్ ప్రైమ్ 9 న్యూస్ లైసెన్స్‌ను తాత్కాలికంగా రద్దు చేసింది… మరో కంపెనీ అయిన సంహిత బ్రాడ్‌కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 23 గంటల 55 నిమిషాల ఉచిత స్లాట్ ఇవ్వడంతో సహా ప్రసార నిబంధనలను ఛానెల్ తీవ్రంగా ఉల్లంఘించినట్లు కనుగొనబడింది.
నిజానికి ప్రైమ్ 9 న్యూస్ నియంత్రణలో సంహిత బ్రాడ్‌కాస్టింగ్ ఉంది, పేపర్‌పై ఛానెల్‌ని కలిగి ఉన్న రాయుడు విజన్ మీడియా లిమిటెడ్ కేవలం ఒక ఫ్రంట్ మాత్రమే… ప్రైమ్ 9 న్యూస్ యొక్క ట్రేడ్‌మార్క్ కూడా సంహిత బ్రాడ్‌కాస్టింగ్ యాజమాన్యంలో ఉంది.., అయితే MIB దాఖలు చేయడానికి ముందు రాయుడు విజన్ మీడియా ట్రేడ్‌మార్క్ యజమానిగా చూపబడింది…’’ ఇదీ వార్త… దీనికి అదనంగా మరో పోస్ట్ కనిపిస్తోంది… అదేమిటంటే…
‘‘ఎందరో రిపోర్టర్స్ జీవితాల్ని రోడ్డు మీద వేసిన ప్రైమ్ 9 న్యూస్ ఛానెల్… ఇప్పుడు తాజాగా రోడ్డు మీద పడ్డ యాజమాన్యం… లైసెన్స్ రద్దు కావడంతో మూసివేసే దిశగా చానెల్ …..తెలుగు రాష్టాల్లో నిలిచిన పోయిన ప్రసారాలు… చాలా మంది ఉద్యోగుల Pf కట్టని యాజమాన్యం …… మొదటి నుంచి ఇలాగే వ్యవరిస్తున్న యాజమాన్యం …. ఇప్పటికే లైసెన్స్ రద్దు కావడంతో నిలిచిపోయిన అక్రిడేషన్స్ … అక్రిడేషన్ల కోసం లక్షలాది రూపాయలు యాడ్స్ చేసి యజమాన్యానికి జమ చేసిన నియోజవర్గ స్థాయి రిపోర్టర్స్ …. అక్రిడేషిన్స్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న స్ట్రింగర్స్…… దిక్కతోక మథనపడుతున్న సిబ్బంది…’’ ఇదీ ప్రచారం…
ఈ ప్రచారాల నేపథ్యంలో సదరు చానెల్ చైర్మన్ బండి శ్రీనివాస్ రఘువీర్ కూడా ఓ వివరణ, స్పష్టీకరణ జారీచేశాడు… అదేమిటంటే.. ‘రోజురోజుకీ ప్రైమ్9 న్యూస్ చానెల్ బలపడుతోంది. ప్రజాదరణ పెరుగుతోంది. మన ఎదుగుదల చూసి ఓర్వలేక కుట్రలు చేస్తున్నారు. నెంబర్ 1 అని చెప్పుకుంటున్న చానెళ్ళు, విశ్వసనీయతకి మారుపేరని ఊదరగొట్టుకునే పార్టీలు చేతకాని దద్దమ్మల్లా ప్రైమ్9ని దెబ్బకొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈ ఇబ్బందులన్నీ తాత్కాలికమే. త్వరలోనే ఈ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రైమ్9 బలాన్ని దెబ్బతీయలేరు. ప్రైమ్9 న్యూస్ బలంగా ఉంది. మరింత వేగంగా ఇంకా బలపడుతుంది. ఈ ఇబ్బందుల గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఎవరి పని వాళ్ళు చేసుకుందాం. మనందరం ఇలాగే అంకితభావంతో ఎప్పటిలాగే ప్రైమ్9 న్యూస్ చానెల్‌ని మరింత అభివృద్ధి పథంలోకి నడిపిద్దాం…’
ఇక మన వార్తలోకి వెళ్దాం… ఈ చానెల్ లైసెన్సు సంక్షోభంలో పడ్డట్టే… ఎవరిదో చానెల్, ఎవరిదో లోగో, ఎవరో నడిపిస్తుంటారు, లీజుకిస్తుంటారు… ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వాటన్నింటికీ తెరవేస్తూ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది… దీంతో పేపర్ మీద ఉండే కంపెనీల బాగోతాలకు తెరపడుతోంది… పైగా ప్రైమ్9 దగ్గర డబ్బు లేదు, చాన్నాళ్లుగా ఎంఎస్‌వోలకు కూడా డబ్బులు ఇవ్వడం లేదట… స్టాఫ్‌కు కూడా…! దీనికితోడు మాజీ టీవీ9 రవిప్రకాష్ ఈ చానెల్‌పై కన్నేశాడు…
Ads
చానెల్ పేరులో 9 ఉందిగా… అందుకని పాత టీవీ9 పేరు కలిసొస్తుందని అనుకున్నట్టున్నాడు…కానీ తను పెట్టాలనుకున్న ఆర్‌టీవీ మీద రిపబ్లిక్ టీవీ వాడు కేసు పెట్టాడు… దాంతో కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ రాయుడు టీవీ వ్యవహారాలను కూడా తవ్వి, ఈ ప్రైమ్9 చానెల్ లీజులు, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న తీరు పట్టుకుందట… సో, ఆ చానెల్ లైసెన్సు రద్దుతో రవిప్రకాష్ సొంత చానెల్ గ్రహచారం బాగా లేనట్టే లెక్క…
ఒక్కసారి 24‘7 దగ్గర నుంచీ వద్దాం… అది ఆగిపోయింది… తరువాత 99 టీవీ నడిచీ నడవనట్టుగా నడుస్తోంది… ఈమధ్య రాజ్ న్యూస్ స్టాఫ్ జీతాల కోసం ఆఫీసు ముందు బైఠాయించారు… ఇప్పుడు ప్రైమ్9 గతేమిటో చూశాం… చిన్న చానెళ్ల పరిస్థితి ఇదీ… ఈమధ్య జీతెలుగు వాడు యాడ్స్ ఇస్తున్నాడు, న్యూస్ చానెల్ తీసుకొస్తున్నట్టుగా… కానీ అది కేవలం సిటీ కేబుల్‌లో మాత్రమే వస్తుంది, వాళ్ల చానెలే కాబట్టి, అదీ యూట్యూబ్ ద్వారా ఎన్‌రూట్ చేస్తారు… ఎటొచ్చీ ఇక్కడ చెప్పుకునే సంగతేమిటంటే… ఆయా చానెళ్లలో పనిచేసే సిబ్బంది, రిపోర్టర్ల పరిస్థితి, తుమ్మితే ఊడిపోయే చందం… ఎప్పుడు బజారున పడతామో తెలియని దురవస్థ… రిపోర్టర్లే లోకం మీద పడి, యాడ్స్ సేకరించి, చానెల్‌కు డబ్బు కట్టాలి, ప్చ్, జర్నలిజం గతి ఇలా మారిందేమిటి చెప్మా..!! అవును గానీ, ప్రైమ్9 పోతే, ఇక పవన్ కల్యాణ్‌కు వేరే వాయిస్ ఎలా..?!
Share this Article