చార్లెస్ గుడ్ ఇయర్… తన పన్నెండో ఏట బడి మానేశాడు… కనెక్టికట్‌లో ఉండే తన తండ్రి హార్డ్‌వేర్ స్టోర్స్‌లో పనిచేయడం కోసం… 23వ ఏట క్లారిసా బీచర్‌ను పెళ్లి చేసుకున్నాడు… ఓ కొడుకు పుట్టాడు… ఫిలడెల్ఫియాలో మరో హార్డ్‌వేర్ స్టోర్స్ సొంతంగా తెరిచాడు… గుడ్ ఇయర్ మంచి సమర్థుడైన వ్యాపారే… కానీ తనకు కెమిస్ట్రీ, మెటీరియల్ సైన్స్ కొత్త ఆవిష్కరణల మీద ఆసక్తి అధికం… 1820 ప్రాంతంలో తను నేచురల్ రబ్బర్ (ఇండియన్ రబ్బర్) మీద బాగా పరిశోధనలు చేసేవాడు…
తన ప్రయోగాలు ప్రపంచగతిని మార్చాయి కానీ తన బతుకే తనకు పెద్ద చాలెంజింగ్ అయిపోయింది… 1830… అంటే తన 29వ ఏట హెల్త్ ఇష్యూస్ మొదలయ్యాయి… తన ప్రయోగాలకేమో అక్కడిక్కడా అప్పులు తెచ్చాడు… అవేమో సక్సెస్ కావడం లేదు… ఆ సంవత్సరాంతానికి తన బిజినెస్ బాగా దెబ్బతిని, దివాలా తీశాడు… అప్పుల ఊబిలో కూరుకుపోయాడు… అప్పులు ఇచ్చినవాళ్లు జైలుపాలు చేశారు… తన ప్రయోగాల కెరీర్‌కు ఓ చేదు ఆరంభం అది…
తన రబ్బర్ ప్రయోగాల్లో తనకు సవాల్ విసిరింది ఏమిటంటే..? ఆ రబ్బర్ మన్నికగా ఉండేది కాదు, ఉష్ణోగ్రత కాస్త పెరిగినా జిగటగా మారిపోయేది… దీన్ని ఎలా దారికి తీసుకురావాలో అర్థం అయ్యేది కాదు… జైలులోనే కొన్ని కొత్త ప్రయోగాలు ఆరంభించాడు… అనేకానేక ఫెయిల్యూర్ల తరువాత తనకు ఓ కెమికల్ సొల్యూషన్ దొరికింది… రబ్బర్‌ను సల్పర్ ప్లస్ ఇంకొన్ని రసాయనాలతో కలిపి వేడి చేసినప్పుడు తను అనుకున్న రబ్బర్ తయారైంది… దీనికి వల్కనైజేషన్ అని పేరు పెట్టాడు… అప్పటికి చాలాఏళ్లు గడిచాయి… అది 1844…
Ads
వల్కనైజ్‌డ్ రబ్బర్‌కు పేటెంట్ కోసం 1844లోనే (179 ఏళ్ల క్రితం) ప్రయత్నించాడు… కానీ అదీ కష్టమైపోయింది… నాలుగు నెలల తరువాత పేటెంట్ జారీ అయ్యింది… ఆ రబ్బర్‌తో టైర్లు, షూ సోల్స్, గొట్టాలు, ఇతరత్రా అనేక పరికరాలు చేయడం ఈజీ అయిపోయింది… 19 వ శతాబ్దపు ముఖ్యమైన సాంకేతిక ఆవిష్కరణల్లో ఇదీ ఒకటి… దీంతో చార్లెస్ గుడ్ ఇయర్ ఆస్తిపరుడు అయిపోయాడా..? బాగా డబ్బు వచ్చిపడిందా..? లేదు..!!
అవే ఆర్థిక కష్టాలు… ఇతరత్రా ప్రయోగాలు చేసినవాళ్లు గుడ్ ఇయర్‌కు ఇచ్చిన పేటెంట్ మీద వివాదాలు లేవదీశారు… దాంతో తనకు తన ఆవిష్కరణే ఏమాత్రం ప్రాఫిట్ తీసుకురాలేకపోయింది…
ఈలోపు భార్య క్లారిసాకు క్షయ మొదలైంది… అరకొర సంపాదన కాస్తా ఆమె వైద్య ఖర్చులకే సరిపోయేది… చికిత్స కోసం అటూఇటూ తిరగాల్సి వచ్చింది… ఆమె 1848లో 39 ఏళ్ల వయస్సులో మరణించింది… ఆరుగురు పిల్లలు చార్లెస్‌కు మిగిలారు… 4 నుంచి 17 ఏళ్లలోపు పిల్లలు… 54 ఏళ్ల వయస్సులో తన పేటెంట్ రక్షించుకోవడానికి, దాన్నుంచి ఆర్థికలాభం పొందడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు… పోరాడుతున్నాడు… 40 ఏళ్ల మేరీ స్టార్‌ను పెళ్లి చేసుకున్నాడు… (ఆమెకు అంతకుముందు పెళ్లేకాలేదు…) వాళ్లిద్దరికీ మరో ఇద్దరు పిల్లలు… హేపీ మ్యారేజే కానీ అదీ ఎక్కువకాలం తనకు సంతోషాన్ని ఇవ్వలేకపోయింది…
ప్రయోగాల్లో మితిమీరిన రసాయనాల వాడకం తనపై నెగెటివ్ ప్రభావాన్ని చూపింది.,.. 1860లో న్యూయార్క్ సిటీలోని ఓ హోటల్‌లో కుప్పకూలాడు… అప్పటికి తన వయస్సు 59 ఏళ్లు… మరణించేనాటికి తన దగ్గర డబ్బుల్లేవు, పైగా బోలెడు అప్పులు… ఇదంతా జరిగిన 40 ఏళ్ల తరువాత… ఫ్రాంక్ సీబర్లింగ్ ఓహియోలోని అక్రాన్‌లో ‘‘ది గుడ్ ఇయర్ టైర్ అండ్ రబ్బర్ కంపెనీ’’ని స్థాపించాడు… చార్లెస్ గుడ్ ఇయర్‌కు గౌరవసూచకంగా ఆ పేరు… అంతేతప్ప చార్లెస్ గుడ్ ఇయర్‌కు గానీ, ఆయన కుటుంబానికి గానీ ఆ కంపెనీతో ఏ సంబంధమూ లేదు…
గుడ్ ఇయర్ అచీవ్‌మెంట్స్ మీద శామ్యూల్ ఎలియట్ మారిసన్ అనే చరిత్రకారుడు ఇలా రాశాడు… ‘‘గుడ్ ఇయర్ చేసిన వల్కనైజేషన్ డిస్కవరీ సైన్స్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించి అతి పెద్ద ఇంట్రస్టింగ్… ఈ ఆవిష్కరణకు తను జీవితమంతా అప్పులు, అనారోగ్యంతో పోరాడాల్సి వచ్చింది… తను విత్తు నాటి చెట్టు నుంచి తను కాయలు కోసుకోలేదు… తన జీవితాన్ని డాలర్లు, సెంట్లలో చెప్పుకోలేం… తను విత్తనం నాటిన చెట్టు కాయలు ఎవరికీ ఉపయోగపడకుండా పోతే కదా తను నిజంగా బాధపడేది…’’
Share this Article