అబ్బే, సినిమా ఇండస్ట్రీలో… బ్యాక్ గ్రౌండ్, లక్కు, టైమ్, ట్రెండ్, సక్సెస్… ఇవే ప్రధానం… అంతే తప్ప మెరిట్‌కు, సెంటిమెంట్‌కు, ఎమోషన్‌కు పెద్ద విలువ లేదు… ఇదొక దిక్కుమాలిన ఇండస్ట్రీ అంటూ ఎంత సముదాయించుకుంటున్నా సరే, ఒక సంగీత దర్శకుడి బహిరంగ కోరిక కాస్త చివుక్కుమంటూనే ఉంది…
Yanamandra Venkata Subrahmanya Sharma… అలియాస్ మణిశర్మ… వయస్సు 60… పెద్ద స్టార్లు ఒక సినిమా ఇవ్వండబ్బా… ఒకటి డీఎస్పీకి, ఒకటి తమన్‌కు, ఒకటి నాకు… వర్క్‌లో వైవిధ్యం ఉంటుంది, అందరికీ పని ఉంటుంది అని కోరుకున్నాడు… నిజానికి వేడుకున్నాడు అనాలేమో… అంతటి మణిపూసే ఇలా అడుక్కోవడం ఇండస్ట్రీ పోకడల్ని యథాలాపంగా చూసేవాళ్లకు పెద్దగా బాధనిపించదు కానీ… బయట నుంచి చూసేవాళ్లకు హర్టింగే…
ఎప్పుడో 1992లో ప్రయాణం స్టార్ట్ తనది… సంగీత దర్శకుడిగా… తమిళం, తెలుగు… ఒక వెలుగు వెలిగాడు… పెద్ద పెద్ద స్టార్లు, దర్శకులు సైతం ఆయన బాణీల కోసం వెర్రెక్కిపోయినవాళ్లే… ఎన్ని హిట్ పాటలో లెక్క తీయడం కష్టం… అలాంటిది ఎందుకలా అడుక్కోవాల్సి వస్తోంది..? పోనీ, తనలో మెరిట్ లేదా..? పుష్కలం… ఈరోజుకూ టన్నులకు టన్నులుంది… మరెందుకు మనం అనిరుధ్, రెహమాన్, ఇళయరాజా, అజనీష్, బస్రూర్ వంటి దర్శకుల డేట్ల కోసం వెంపర్లాడిపోతున్నాం…
Ads
ఎస్, విలువైన ప్రశ్న… మణిశర్మ మరీ డీఎస్పీ, తమన్‌లకన్నా తీసిపోయాడా..? పెద్ద పెద్ద దర్శకులకు, స్టార్ హీరోలకు ఇప్పుడు మణిశర్మ కానివాడు ఎలా అయ్యాడు..? మరీ తమన్ కాపీ ట్యూన్ల గురించి సైట్లు, ట్యూబ్ చానెళ్లు కథలుకథలుగా ఉదాహరణలతో సహా చెప్పేస్తున్నాయి కదా… ఒరిజినల్ పాటల ఆధారాలతో సహా… ఇక క్రియేటివిటీ ఏముంది… మన్నూమశానం తప్ప… డీఎస్పీ కూడా అంతే కదా, అయితే హిట్, లేదంటే అట్టర్ ఫ్లాప్…
మేకర్స్ పట్టుపడితే ఆది సినిమా వంటి ఒకటీఅరా సందర్భాల్లో నేనూ కాపీ ట్యూన్లకు తలొగ్గాను అని మణిశర్మ నేరుగానే అంగీకరిస్తున్నాడు… నిన్నో మొన్నో ఎక్కడో చెప్పాడు అది… ఈ ట్రోలింగ్ శకంలో చెప్పకుండా ఉండాల్సింది… కానీ అసలు ప్రశ్న మిగిలే ఉంది… మణిశర్మ పరిస్థితి ఏమిటి అని…!! మరీ అవకాశాల్లేక ఏమీ లేడు… 2021లో కూడా 12 సినిమాలు చేశాడు… అందులో ఆచార్య వంటి పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి… కానీ మహేశ్, బన్నీ, జూనియర్, రాంచరణ్, పవన్ వంటి హీరోల చాన్సులు రావడం లేదు… తద్వారా రావల్సినంత థ్రిల్లింగ్ హిట్స్ తనకు రావడం లేదు…
2022లో ఒక్క సినిమా లేదు, 2023లో ఒకే సినిమా… ప్రస్తుతం తన చేతిలో డబుల్ ఇస్మార్ట్, కన్నప్ప… తమిళంలో ఎనిమిదేళ్లుగా ఏ సినిమా లేదు… కన్నడ, హిందీ తనకు పెద్దగా రూట్స్ లేవు… అదీ ఆయన బాధ… ఇదే తమన్, ఇదే డీఎస్పీ తన టీంలో పనిచేసిన వారే… ఇప్పుడు సాక్షాత్తూ వాళ్ల గురువే ‘‘బాబ్బాబు, వాళ్లతోపాటు నాకూ ఓ చాన్సివ్వండబ్బా’’ అని ఇండస్ట్రీ పెద్ద తలకాయలను వేడుకుంటున్నాడు… కొత్తనీరు- పాతనీరు అనుకుని జాలిపడటమేనా… అంతా కాలమహిమ…!!
Share this Article