కుటుంబంలో అతివ పాత్ర అనన్య సామాన్యం. మారుతున్న కాలమాన పరిస్థితుల్లో తనను తాను మార్చుకుంటూ ఏ పాత్రలోనైనా ఇమిడిపోగలనని, ఎటువంటి సవాలునైనా స్వీకరించగలనని నిరూపించుకుంటోంది. ఒక ఉమ్మడి కుటుంబం.. అన్యోన్యంగా ఉండే ఆరుగురు అక్కాచెల్లెళ్ళు. వివిధ కారణాలతో వేర్వేరు ప్రాంతాల్లో విభిన్న రంగాల్లో స్థిరపడతారు. ఉరుకుల పరుగుల యాంత్రిక జీవితంలో కనీసం పలకరించుకోవడం కూడా కష్టం.
సహజంగానే అక్కాచెల్లెళ్ళలనగానే అందరిలోనూ ఉండే మూతి విరుపులు, ముక్కోపాలు, అసూయ, రాగ ద్వేషాలు వారిలోనూ ఉంటాయి. అందరూ నలభై ఏళ్ళు పైబడినవారే. వీరందర్నీ కలిపేది మంగళగౌరీ వ్రతం. (తెలుగు ఇళ్ళలో జరుపుకునే అట్లతద్దుల లాంటిది).
ఈ వ్రతం పోటీల్లో విజేతలకు 25 లక్షల బహుమతి. ఆర్ధిక అవసరం ఒకరిది అయితే, వయసు ఒక అంకె మాత్రమే అని నిరూపించడానికి మరొకరు, భర్త మీద ఆధార పడ కూడదనే పట్టుదల ఇంకొకరిది, గడప దాటినంత మాత్రాన కట్టుబాట్లను కాదన్నట్టు కాదని నిరూపించాలని వేరొకరు, భర్త కాదన్నంత మాత్రాన జీవితం అయిపోలేదని ఇలా ఆరుగురు సోదరీమణులు, వారి పిల్లల హృదయ స్పందన బైపన్ బరి దేవా (toughnees of women) పేరుతో చిన్న చిత్రంగా తెరకెక్కిన మరాఠీ చిత్రం ప్రజాదరణతో కాసుల వర్షం కురిపించింది. రోహిణి హట్టంగడి, వందనా గుప్తే, సుకన్య కులకర్ణి, శిల్పా నవల్కర్, సుచిత్ర బాండేకర్, దీపా పరబ్ నటించారు…
Ads
ఒక కార్పొరేట్ ఆఫీస్ లో ఉన్నత ఉద్యోగిగా రిటైరైన ఒక సోదరి పెళ్ళైన తన కూతురి ఇంటికి వచ్చి, ఆమె తనకన్నా అత్తగారికి ఎక్కువ గౌరవ, మర్యాదలు ఇవ్వడాన్ని ఆ తల్లి తట్టుకోలేకపోతుంది. ముత్తయిదువ కాదన్న వంకతో తనను కాదని వియ్యపురాలితో కలిసి మంగళ గౌరీ వ్రతం పోటీల్లో కూతురు పాల్గొనడాన్ని ఆ తల్లి హృదయం సహించలేకపోతుంది. అప్పుడు మంగళ గౌరీ వ్రతం పోటీల్లో చిన్నప్పుడు తమ అక్కాచెల్లెళ్ళు ఉత్సాహంగా నృత్యాలు చేసింది కళ్ళముందు మెదుల్తుంది. అలా ఒక్కొక్క సోదర్ని కలవాలని, కలపాలనే ప్రయత్నంలో వారి జీవితాల్లో అనుభవాలు ఒక్కొక్కటిగా మనకు కనిపిస్తాయి.
ఒక సోదరికి ఇంటి గడప దాటనివ్వని రోగిష్టి, ఛాందసవాద మామ వేధింపులు. మరో ఇంట ఆడంబరాలకు ఖర్చు చేసి, ఇల్లాలి గురించి పట్టించుకోని భర్త, ఈఎంఐ చెల్లింపులు, వాయిదాలు కట్టలేక తీవ్ర ఒత్తిడి. మరో సోదరికి భర్త వేరే మహిళ మోజులో పడి విడాకులు ఇమ్మని పోరు, ఆత్మన్యూనతతో బాధపడుతూ విదేశాల్లో ఉండే కొడుకుతో గాని, భర్తతో గాని మనసు విప్పి మాట్లాడలేని నిస్సహాయత, ఒకరకమైన నిర్లిప్తత, తోడబుట్టిన చెల్లెలితో మాట్లాడాలంటే అహం…(రోహిణి హట్టంగడి అద్వితీయ నటన ప్రదర్శించింది.)
ఆధునిక మహిళలు ఆఫీసులు, ఇళ్ళల్లో ఎదుర్కొంటున్న తీవ్ర ఒత్తిళ్ళు, అవమానాలు, పిల్లలు పుట్టకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, భర్తల ఆడంబరాలు, ఎచ్చులు అన్ని మనకు ఈ సినిమాలో కనిపిస్తాయి. దర్శకుడు కేదార్ శిందే మధ్య తరగతి నుంచి ఉన్నత తరగతి వరకు, గృహిణి అయినా కార్పోరేట్ ఉద్యోగి అయినా మహిళలలో సహజంగా ఉండే మమతానురాగాలు, పట్టుదల, ఓర్పు, సహనం వంటివి ఎప్పుడు ఎలా బయటకు వస్తాయో తన పాత్రల్లో అద్భుతంగా తెరకెక్కించాడు.
జంధ్యాల, బాలచందర్ వంటి దర్శకులు మహిళల మీద తీసిన సినిమాలు చూసిన మనకు ఈ సినిమా కచ్చితంగా వైవిధ్యంగా కనిపిస్తుంది. (డిస్నీహాట్ స్టార్ లో..) హిందీ, మరాఠీ భాషల్లో అందుబాటులో ఉంది. సబ్ టైటిళ్లు ఉన్నాయి కాబట్టి చూసేయొచ్చు….) [ By హరగోపాల రాజు… 8008551187 ]
Share this Article