ఒక ఊళ్లో పట్వారీ, మరో ఊళ్లో మస్కూరి… అంటే అర్థం తెలుసా..? ఒక ఊళ్లో పెత్తనం చెలాయించే విలేజ్ సెక్రెటరీ… మరో ఊళ్లో ఎవరూ పట్టించుకోని విలేజ్ సర్వెంట్… స్థానబలం, అధికారబలం ఎట్సెట్రా… అర్జున్ సర్జా సుదీర్ఘమైన కెరీర్ ఉన్న హీరో… ఇప్పటి కొందరు హీరోలు పుట్టకముందే తను హిట్ల మీద హిట్లు ఇచ్చిన చరిత్ర తనది… ఎవడి జోలికి పోడు…
ఎవరైనా స్టార్ హీరో అడిగితే చిన్న పాత్రయినా సరే పోషిస్తాడు, ఎహె, నేనేంటి అనే ఎచ్చులకు పోడు… అలాంటి అర్జున్ తొలిసారిగా బాధపడుతూ తెలుగు మీడియా ముందుకు వచ్చాడు… విష్వక్‌సేన్ పక్కా అన్ ప్రొఫెషనల్ అని సోదాహరణగా వివరించాడు… అబ్బే, నేను శుద్ధపూసను అని విష్వక్ చెప్పుకున్నాడు… అసలు విష్వక్ అంటేనే అహం… వివాదం… ఫలక్‌నుమాదాస్ నుంచి, ఫ్రాంక్ ప్రమోషన్ వీడియోలు, టీవీ9 స్టూడియోలో రచ్చ, తరువాత అర్జున్ బాధ…
విష్వక్ సోషల్ మీడియాలో, మీడియాలో ఓ సెక్షన్‌ను మెయింటెయిన్ చేయవచ్చుగాక… కానీ జరుగుతున్న వివాదాలు తన పట్ల బాగా నెగెటివిటీ పెంచేశాయి… అలాంటి హీరోకు బాలయ్య సపోర్టుగా నిలవడం చాలామందిని ఆశ్చర్యాన్ని కలిగించింది… ‘దాస్ కా ధమ్కీ’ అనే ఏదో సినిమాను తనే హీరోగా, తనే డైరెక్టరుగా తీసిపారేశాడట కదా… ఆ పోస్టర్ రిలీజుకు బాలయ్య వెళ్లాడు… నిజానికి తను పెద్దగా సినిమా ఫంక్షన్లకు వెళ్లడు… కానీ విష్వక్ అడగ్గానే వెళ్లాడు… ఓ నైతిక మద్దతు…
Ads
మొన్నామధ్య అన్‌స్టాపబుల్‌కు ఎవరూ దొరక్క, జొన్నలగడ్డ సిద్ధూను, ఈ విష్వక్‌ను పిలిచారు కదా… దాంతో బాలయ్యతో సాన్నిహిత్యం పెరిగిందేమో… కానీ ఒక్క క్షణం తను ఎలాంటి హీరోను మోస్తున్నాను అనే సోయి బాలయ్యలో లేకుండా పోయిందా..? పైగా ఆ సినిమా ఏమీ ఒరిజినల్ కాదు… దాదాపు ప్రతి సైటు, ప్రతి యూట్యూబ్ చానెల్ రాసిపారేశాయి… గోపీచందర్ నటించిన ‘గౌతమ్ నందా’ అనే సినిమా కథేనట… కాకపోతే చిన్న చిన్న మార్పులు… అన్నట్టు… ఇది పాన్ ఇండియా సినిమా అట… ఐనా పాన్ ఇండియా అంటే ఇవ్వాళారేపు పెద్ద కథేముంది..? మంచు విష్ణు కూడా మొన్న ఓ సినిమా తీశాడు కదా… ఫలితం చూశాం కదా… సన్నీ లియోని ఉంటేనే జనం పట్టించుకోలేదు…
డబుల్ యాక్షన్… ఓ పేదవాడు… కొన్నికోట్లకు వారసుడైన తన పోలికలతో ఉన్న మరో ధనికుడి పాత్రలోకి వెళ్తాడు… బొచ్చెడు సినిమాలు వచ్చాయి ఇలాంటివి… ఇక్కడ ఇష్యూ ఏమిటంటే..? మొన్ననే కదా అర్జున్ ఈ విష్వక్ మీద పలు ఆరోపణలు చేసి, బాధపడ్డాడు… బాలకృష్ట వంటి పక్కా ప్రొఫెషనల్స్‌తో తనకు సత్సంబంధాలు ఉన్నాయని చెప్పుకున్నాడు…
తీరా చూస్తే అర్జున్‌కు బాలయ్య నుంచి నాలుగు మంచి మాటలు కూడా దక్కలేదు… అర్జున్ తన సమకాలికుడు… పైగా అర్జున్ చెప్పుకున్న ఆ పాజిటివిటీని కూడా తుంగలో తొక్కేసి, బాలయ్య జై విష్వక్ జైజై విష్వక్ అంటున్నాడు… ఒకరకంగా అర్జున్‌కు ఇది విష్వక్ చేసిన గాయంకన్నా పెద్దది…
ఇంద్రగంటి నానితో తీసిన జెంటిల్‌మ్యాన్, చిరంజీవి తీసిన రౌడీ అల్లుడు, దొంగమొగుడు, రవితేజ నటించిన దరువు, ఎస్వీ కృష్ణారెడ్డి అభిషేకం… ఇలా చాలా సినిమాల్ని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు… బాలయ్యతో ఇదే ప్రాబ్లం… ప్రేమిస్తే ఇంకేమీ చూడడు, అలుముకుంటాడు… లేదంటే ఈడ్చి కొట్టేస్తాడు… అర్జున్ ఫీలింగ్స్‌ను గాయపరచడాన్ని ఎలా సమర్థించుకుంటాడో… ఐనా బాలయ్యను అడిగేవాడెవడు..?!
Share this Article