Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బర్మా అరకాన్ ఆర్మీ… బాల్కనైజేషన్ ఆఫ్ మియన్మార్… అసలు కథ ఇదీ…

December 24, 2024 by M S R

.

. (  పొట్లూరి పార్థసారథి ) …  …… బాల్కనైజేషన్ ఆఫ్ మియాన్మార్ – Balkanisation of Myanmar! Part – 2

1948 లో బ్రిటీష్ వారి నుండి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి మియాన్మార్ ( బర్మా ) లో ప్రశాంతత అనేది ఎప్పుడూ లేదు!

Ads

మియాన్మార్ లో వివిధ జాతుల మధ్య ఎప్పుడూ ఎక్కడో ఒక చోట అంతర్గత ఘర్షణలు జరుగుతూనే వస్తున్నాయి.
ఒక వేళ జాతుల మధ్య ఘర్షణ సద్దుమణిగితే అక్కడి మిలిటరీ ప్రభుత్వంతో ఏదో ఒక వర్గం ఘర్షణ పడుతూ వస్తున్నది!

స్వాతంత్య్రం వచ్చాక అంటే 1948 నుండి 1962 వరకూ పౌర ప్రభుత్వం ఉంది. 1964లో మిలిటరీ కుట్ర చేసి ప్రజా ప్రభుత్వాన్ని దించేసి సైనిక పాలన మొదలుపెట్టింది!

1962 లో సైనిక కుట్ర జరిగింది ఆంగ్ శాన్ ( Aung San ) మీద. ఆంగ్ శాన్ ఎవరో కాదు, సుదీర్ఘ కాలం బర్మాలో ప్రజాస్వామ్యం కోసం నిరాహార దీక్ష చేసి నోబుల్ శాంతి బహుమతి పొందిన మహిళ ఆంగ్ శాన్ సూకీ తండ్రి!

1962 వరకూ బర్మాలో పరిస్థితులు మరీ ఘోరంగా లేకపోయినా ప్రశాంతంగా ఉండేవి. ముఖ్యంగా బర్మా నుండి టేకు కలప భారత్ లోకి దిగుమతి అయ్యేది. బర్మా టేకు కలప వ్యాపారంతో లక్షాధికారులు అయిన భారతీయులు ఉన్నారు.

1962 లో సైనిక కుట్ర చేసి ప్రజా ప్రభుత్వాన్ని దించేసి మిలిటరీ పాలన వచ్చాక భారతీయుల మీద దాడులు జరిగాయి. దాంతో అప్పటి వరకూ రంగూన్ ( ఇప్పుడు యాంగూన్ ) లో ఉన్న భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారు!

రోహింగ్యాల మీద దాడులు మొదలయ్యింది కూడా 1962 లోనే. రోహింగ్యాలు 1962 లో భారత్ లో ఆశ్రయం పొందారు వెస్ట్ బెంగాల్ మరియు తమిళనాడులో…

శరణార్థులుగా వచ్చిన రోహింగ్యాలకి మద్రాస్ హార్బర్ దగ్గర షాపులు పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చింది తమిళనాడు ప్రభుత్వం.

మద్రాస్ పారీస్ సెంటర్ కి దగ్గరలో ఉన్న ‘ బర్మా బజార్ ‘ బర్మా కాందిశీకులు ఏర్పాటు చేసుకున్నదే!

1970 నుండి 1995 వరకూ స్మగుల్డ్ వస్తువులకి కేరాఫ్ అడ్రస్ బర్మా బజార్. కెమెరాలు, టీవీలు, VCR లతో పాటు అన్ని స్మగుల్డ్ వస్తువులు అమ్మేవారు. వాళ్లకి లైసెన్స్ ఇచ్చింది విదేశీ వస్తువులు అమ్మడానికి కాదు, కానీ 25 ఏళ్ళ పాటు యదేచ్చగా వ్యాపారం చేసుకోగలిగారు!

 

********
1962 లో సైనిక కుట్ర జరిగి ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి సైనిక పాలన మొదలవడంతో ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఫలితంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ బర్మా (CPB ), కచిన్ ఇండిపెండెన్స్ ఆర్మీ (KIA ) లాంటి తిరుగుబాటు గ్రూపులు సైన్యంతో ఘర్షణ కి దిగాయి. మిలిటరీ కఠినంగా అణిచివేసింది. కానీ బర్మాలోని వివిధ వర్గాలలో మిలిటరీ ప్రభుత్వం మీద వ్యతిరేకత అలానే ఉండిపోయింది.

అభివృద్ధి అనేది లేకపోవడం చేత, నిరుద్యోగం పెరగడం మూలాన ఎక్కడికక్కడ ప్రాంతీయ, జాతుల మధ్య ఘర్క్షణలు జరగుతూ రావడం వలన ఎవరికి వారు తమ ప్రాంతానికి, జాతికి స్వయం ప్రతిపత్తి కావాలి అంటూ ఉద్యమాలు మొదలు పెట్టి సైనిక ప్రభుత్వo మీద తిరుగుబాటు మొదలుపెట్టారు.

మిలిటరీ ప్రభుత్వాన్ని నడిపేది బర్మన్ (బమర్ ) జాతి!

మియాన్మార్ లో జాతుల వివరాలు!

A.బర్మన్ (బమర్ ) జాతి జనాభా 68%

B.షాన్ (Shan ) జాతి జనాభా 9%

C. కరేన్ (Karen ) జాతి జనాభా 7%

D.రఖైన్ (Rakhain ) జాతి 4%

E.చైనీయులు 3%

F. భారతీయులు 2%

G. మాంగోలియన్లు 2%
H. ఇతరులు 5%

ఇక మతాల వారీగా అయితే బౌద్ధులు 88%, క్రైస్తవులు 6%, ముస్లిమ్స్ 4%, అనిమిస్ట్ 0.08%, హిందువులు 0.05%, ఇతరులు 0.02% గా ఉన్నారు.

 

********
జాతుల మధ్య పోరాటం అనేది తాము మెజారిటీగా ఉన్న ప్రాంతాలకి ఆటానమస్ (స్వయం ప్రతిపత్తి ) కావాలి అనే డిమాండ్ కారణం!

తమ జాతులకి సైన్యంలో ఉద్యోగాలు ఇవ్వాలని మరో డిమాండ్! బర్మాలో ప్రభుత్వ ఉద్యోగం అంటే ఆర్మీనే! ఇతర ప్రభుత్వ రంగాలలో ఉద్యోగాలు పెద్దగా ఉండవు. ఒకవేళ ఉన్నా అవి బర్మన్ జాతి (బమర్ ) ప్రజలకే సింహ భాగం దక్కుతాయి. అంతెందుకు అక్కడి మిలిటరీ (ఝాంటా ) ప్రభుత్వాన్ని బమర్ ప్రభుత్వం అనే పిలుస్తారు!

నిరుద్యోగం, అవినీతి, ద్రవ్యోల్బణం అనేవి బర్మాని పట్టి పీడిస్తున్నాయి గత అయిదు దశాబ్దాలుగా.

సైనిక నియంత ప్రభుత్వం ఉన్న అన్ని దేశాలలో అవినీతి ఎక్కువగా ఉండడం సహజం!

ఇక బర్మాకి ఒకప్పుడు సోవియట్ యూనియన్, తరువాత ఇప్పుడు రష్యా అండగా నిలిచింది! మరోవైపు చైనా కూడా అక్కడి సైనిక ప్రభుత్వానికి మద్దతుగా ఉంటూ వస్తున్నది. So! భారత ప్రభుత్వ పరపతి పెద్దగా ఉండదు.

బోడోలాండ్ ఉగ్రవాదులు బర్మాలో దాక్కున్నప్పుడు అజిత్ దోవల్ ఫార్మల్ గా విషయం తెలిపి, భారత బలగాలని బర్మాలోకి పంపించి ఏరివేసిన ఘటనలు ఉన్నాయి గతంలో. అంతే కానీ బర్మా అనుమతి కోసం వేచి చూడలేదు. ఇంతవరకే భారత్ పరపతి!

ప్రస్తుత బర్మా పరిస్థితికి అంకురార్పణ జరిగింది 1962 లోనే అయినా 2021 లో సైనిక ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం అనేది తాడో పేడో తేల్చుకునే స్థితికి వచ్చింది!

2021 లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఆంగ్ సాన్ సూకిని అవినీతి ఆరోపణలతో పదవి నుండి దించి సైన్యం మళ్ళీ అధికారం చేపట్టినప్పటి నుండి అప్పటి దాకా ఏ గ్రూపుకి ఆ గ్రూపు విడివిడిగా చేస్తున్న పోరాటాన్ని ఆపివేసి అన్ని గ్రూపులూ కలిసి సైన్యానికి వ్యతిరేకంగా పోరాడాలని నిశ్చయించాయి.

రెబెల్ గ్రూపులకి బర్మా ప్రజల నుండి గతంలో ఎప్పుడూ లేనంతగా మద్దతు వచ్చింది. ఉపాధ్యాయ వర్గం, ప్రభుత్వ ఉద్యోగ వర్గం, సైన్యంలో పనిచేసి రిటైర్ అయిన వర్గం, పోలీసు వ్యవస్థ కూడా తిరుగుబాటులో పాల్గొన్నది!

మిలిటరీ నాయకత్వం ఈ స్థాయిలో తిరుగుబాటు వస్తుందని ఊహించలేదు.
గత సంవత్సరం చివరి నాటికి బర్మాలోని చాలా ప్రాంతాలు రెబెల్స్ చేతిలోకి వెళ్లిపోయాయి!

ఒక దశలో రెబెల్స్ ధాటికి తట్టుకోలేక బర్మా సైనికులు సరిహద్దు దాటి భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలలోకి పారిపోయారు!

అక్కడ సైన్యంకి చేతకాక కాదు. బ్యారక్స్ కి పరిమితం అవ్వాల్సిన సైన్యం స్వంత ప్రజలని చంపడానికి మనసురాక పూర్తిగా పనిచేయట్లేదు!

అఫ్కోర్స్! బర్మా సైన్యం యుద్ధం చేస్తున్నది పరిసరాల మీద పూర్తిగా అవగాహన ఉన్న స్థానిక ప్రజల మీద! గేరిల్లా తరహా దాడులు చేసి పరిసర ప్రాంతాలలో కలిసిపోతున్నారు రెబెల్స్. స్థానికుల సహాయ సహకారం ఉన్నది. సైన్యం అంటే వ్యతిరేక భావం ఉన్నది!

*********
బర్మా లో తిరుగుబాటు దళాలు అన్నీ కలిసి పోయి ఒకే ఛత్రం కిందకి వచ్చి సైన్యం మీద దాడులు చేస్తూ వస్తున్నాయి.
ఎత్నిక్ ఆర్మర్డ్ ఆర్గనైజషన్స్ ( Ethnic Armed Organisations – EAOs గా వ్యవహారిస్తున్నారు అన్నిటిని కలిపి.

అవి….

1.పీపుల్స్ డిఫెన్స్ ఫోర్సెస్ – People’s Defence Forces- PDF

2.అర్కాన్ ఆర్మీ – ARAKAN ARMY

3.ది మియాన్మార్ నేషనల్ డెమోక్రాటిక్ అలియన్స్ ఆర్మీ – The Myanmar Democratic Alliance Army

4.తాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ – Taa’ng National Liberation Army.

5.కచిన్ ఇండిపెండెన్స్ ఆర్మీ – Kachin Independence Army.

ఇవి ప్రధాన తిరుగుబాటు గ్రూపులు కాగా కచిన్ ఇండిపెండెంట్ ఆర్మీ గత జులై నాటికే బర్మాకి ఆనుకుని ఉన్న రాష్ట్రంలో ఉన్న అన్ని మిలిటరీ చెక్ పోస్ట్ లని తన ఆధీనంలోకి తీసుకుంది. చైనా తూర్పు ఆసియా దేశాలతో జరిపే అన్ని రకాల వర్తక, వాణిజ్యాలు కచిన్ ఇండిపెండెన్స్ ఆర్మీ చెక్ పోస్టుల ద్వారా జరుగుతున్నాయి గత ఆరు నెలలుగా.

*********
అన్ని తిరుగుబాటు గ్రూపులలో అరకాన్ ఆర్మీ ప్రత్యేకం!

Dominance of the Arakan Army!

అరకాన్ ఆర్మీ బర్మాలోని రఖైన్ ప్రావిన్స్ కి చెందిన బౌద్ధ సన్యాసుల సైన్యం!

ఈ రఖైన్ ప్రావిన్స్ లోనే రోహింగ్యా ముస్లిమ్స్ అధిక సంఖ్యలో ఉన్నారు!

అరకాన్ ఆర్మీకి పొలిటికల్ వింగ్ ఒకటి ఉంది, అది యునైటెడ్ లీగ్ అఫ్ అరకాన్ ( ULA ).

బర్మాలో అత్యంత ప్రభావం కలిగిన గ్రూపు ఏదైనా ఉంది అంటే అరకాన్ ఆర్మీ మరియు ULA.

చాలా మంది అరకాన్ ఆర్మీని రోహింగ్యాలది అనుకుంటున్నారు.

అరకాన్ ఆర్మీ – భౌద్ధ సన్యాసులది.

అరకాన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ – Arakan Rohingya Salvation Army – ARSA అనేది రోహింగ్యా ముస్లిమ్స్ ది.

2017 లో రోహింగ్యాలు బౌద్ధ సన్యాసులని తక్కువ అంచనా వేసి ఒంటరిగా ఉన్న సన్యాసులని చంపి పూడ్చిపెట్టడం చేయడం మొదలుపెట్టారు.
క్రమంగా ఒక్కొక్కరు మాయం అవడం మీద బౌద్ధులు నిఘా పెట్టడంతో అసలు విషయం బయటపడ్డది.

దాంతో బౌద్ధులు రోహింగ్యాల మీద విరుచుకు పడ్డారు. సైన్యం కూడా ఒక చేయి వేయడంతో దిక్కుతోచని రోహింగ్యాలు బాంగ్లాదేశ్, థాయిలాండ్, మలేషియా దేశాలకి పారిపోయారు!

ప్రస్తుతం బాంగ్లాదేశ్ లోని కాక్స్ బజార్ ( Cox’s Bazar district )లో పునరావాస శిబిరాలలో 10 లక్షల మంది రోహింగ్యాలు ఉన్నారు.

ప్రపంచంలోని ఏ దేశం కూడా రోహింగ్యాలని శరణార్థులుగా స్వీకరించడానికి సిద్ధంగా లేవు!

అరకాన్ ఆర్మీ, దాని పొలిటికల్ వింగ్ అయిన యునైటెడ్ లీగ్ ఆఫ్ అరకాన్ తో పాటు బర్మా మిలిటరీలు ఐక్యరాజ్య సమితిని కానీ, అమెరికాని కానీ లెక్కచేయకుండా రోహింగ్యాలని రఖైన్ ప్రావిన్స్ నుండి తరిమివేసాయి!

వాస్తవం ఏమిటీ?

బర్మాలోని రఖైన్ ప్రావిన్స్ లో ఉన్న రోహింగ్యాలని 1962 లో మిలిటరీ అధికారంలోకి వచ్చాక బర్మా పౌరులుగా గుర్తించము అని తెగేసి చెప్పింది.

బర్మా ప్రజల దృష్టిలో రోహింగ్యాలు బెంగాల్ నుండి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్లకి పౌరసత్వం ఇవ్వకూడదు!
ఓటు హక్కు లేదు. ఒక దశలో ఒక్కో రోహింగ్యా రెండు పెళ్లిళ్లకంటే ఎక్కువ చేసుకోకూడదు అనే నిబంధన విధించారు. ఎవరైనా వాళ్ళు ఉంటున్న గ్రామం విడిచి పక్కన ఉన్న గ్రామానికో లేదా పట్టణానికో వెళ్ళాలి అంటే స్థానిక మిలిటరీ చెక్ పోస్ట్ నుండి అనుమతి తీసుకోవాలి!

రోహింగ్యాలకి రఖైన్ ప్రావిన్స్ లో ఉండడానికి మాత్రమే అనుమతి ఇస్తూ తెల్ల కార్డు (white card ) ఇస్తుంది మిలిటరీ! ఇప్పటికి రోహింగ్యాలకి వాళ్ళు ఫలానా దేశ పౌరులు అనే గుర్తింపు కార్డు అంటూ ఏమీ లేదు.

దీనంతటికి కారణం రోహింగ్యాలు ఎక్కువ పెళ్లిళ్లు చేసుకోవడం, పిల్లల్ని కనడం వలన రఖైన్ ప్రావిన్స్ లో వీళ్ళ జనాభా పెరిగిపోయి మెజారిటీ బౌద్దులు కాస్త మైనారిటిలోకి వెళ్లిపోవడమే!

బౌద్ధ ఆరామాలు, బౌద్ధ మత ఆచారాలు మాకు ఇష్టం లేదు అంటూ బౌద్దులతో ఘర్షణకి దిగడం అనేది వాళ్ళని దేశం వదిలి వెళ్లేలా చేసింది!

బర్మాలో పేదరిక శాతం 37% అయితే రఖైన్ ప్రావిన్స్ లో అది 67% గా ఉంది. అంటే దేశ యావరేజ్ శాతం కంటే రెండింతలుగా ఉంది రఖైన్ ప్రావిన్స్ లో. బర్మాలో అత్యంత పేదరికంలో ఉన్న ప్రావిన్స్ రఖైన్! రోహింగ్యా జనాభా ఎక్కువగా ఉండడమే రఖైన్ పేదరికంలో ఉండడానికి ప్రధాన కారణం అని అరకాన్ ఆర్మీ విశ్వసిస్తున్నది!

Contd.. Part 3

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • గ్రోక్ కూడా చేతులెత్తేసిన భాష… ఇక ఆక్స్‌ఫర్డ్ టీమ్‌కే సాధ్యమేమో…
  • ఏమైంది అసలు..? చేజేతులా ట్రోలర్లకు చిక్కుతున్న కొండా సురేఖ..!!
  • అడుగుకో పాక్ గూఢచారి… వీళ్ల ఏరివేతే యుద్ధంకన్నా ప్రధానం..,
  • అనవసరంగా వైసీపీ సోషల్ బ్యాచ్‌ను గోకిన భైరవం దర్శకుడు…
  • అత్యంత అసాధారణ కరెంటు బిల్లు… నమ్మడమే కష్టం సుమీ….
  • సొంత ‘బతుకమ్మ’ పేర్చుకుని… తన ఆట తాను ఆడుకోవడమేనా..?
  • ఫక్తు అక్కినేని మార్క్ వన్ ప్లస్ టూ రొటీన్ సినిమా ప్రేమ కథ..!!
  • ఆ సిరివెన్నెల పాటలు… రాసిన అర్థాలు వేరు- వాడుకున్న తీరు వేరు…
  • శరణార్థుల ఆశాసూచిక – భారత రాజ్యాంగంలోని కుబేరుని కళాచిత్రం…
  • కశ్మీర్‌లో యూఎన్ ధర్మసత్రం షట్‌డౌన్… శెభాష్ జైశంకర్… ఇదీ టెంపర్‌మెంట్..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions