.
రాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ స్టయిలే వేరు… హఠాత్తుగా ఓ సెన్సేషనల్ పాయింట్ తెర పైకి పట్టుకొచ్చేస్తాడు… చర్చనీయాంశం చేస్తాడు… ఇక మూసేసినట్టే అనుకున్న ఏదో పాత ఫైల్ తెరిచి, ప్రత్యర్థులను ఇరకాటంలో పడేస్తాడు…
క్రమేపీ తెలంగాణ బీజేపీని బీఆర్ఎస్ వైపు నడిపిస్తున్నారు కొందరు పార్టీ పెద్దలు అనే అభిప్రాయం, చర్చ ఉంది కదా తెలంగాణ పొలిటికల్ సర్కిళ్లలో… ప్రజల్లో…! కానీ బండి సంజయ్ అదే బీఆర్ఎస్‌ను చిక్కుల్లో పడేస్తున్నాడు… ఈసారి ఏకంగా కేసీయార్ కొడుకు కేటీయార్‌ను డ్రగ్స్ కేసులోకి లాగుతున్నాడు… ఒక కేంద్ర మంత్రి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు సంచలనమే…
Ads
తను నిన్న (27.12.2025) హైదరాబాద్ లో విడుదల చేసిన ప్రకటన ముఖ్యాంశాలు…
‘‘ఉత్సవాలు, పండుగలప్పుడే డ్రగ్స్ కేసులు నమోదు చేస్తారా? అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో నాటి డ్రగ్స్ కేసు విచారణ ఏమైంది? అనేక మంది సెలబ్రిటీల పేర్లు బయటకు వచ్చాయి కదా? కేసీఆర్ కొడుకు సైతం తమతోపాటు డ్రగ్స్ తీసుకున్నారని నిందితులు వాంగ్మూలమిచ్చారు కదా?
నిందితుల వాంగ్మూలంతోపాటు ఆడియో, వీడియోలను రికార్డు చేసింది కదా? తన కొడుకు భవిష్యత్తు నాశనమవుతుందనే భయంతో కేసీఆర్ ప్రభుత్వం ఆ కేసును నీరుగార్చింది కదా? అంందుకే అకున్ సబర్వాల్ ను అర్ధాంతరంగా డ్రగ్స్ కేసు నుండి తప్పించారు కదా?
అకున్ సేకరించిన ఆధారాలు, వీడియో, స్టేట్ మెంట్ రికార్డులన్నీ నాటి సీఎస్ సోమేశ్ కుమార్ స్వాధీనం చేసుకున్నారు… ఆ ఆధారాలన్నీ ఏమయ్యయో ఎందుకు విచారణ జరపడం లేదు? తక్షణమే సోమేశ్ కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారణ జరపాలి. అప్పుడే డ్రగ్స్ కేసుపై వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. అసలు ఈగల్ టీం లీగల్ గా బాధ్యతలు నిర్వర్తిస్తోందా? ఈగల్ టీంలో కొందరు డబ్బులకు అమ్ముడుపోయి డ్రగ్ పెడ్లర్లతో రాజీపడుతున్నారు.
డ్రగ్స్ నిర్మూలనపై చిత్తశుద్ధి ఉంటే అకున్ సబర్వాల్ కు తిరిగి డ్రగ్స్ కేసు బాధ్యతలను అప్పగించాలి…’’ ఇదీ సంజయ్ ఉవాచ… అకున్ సబర్వాల్ సేకరించిన ఆధారాలు, ఆడియో, వీడియో రికార్డులు, స్టేట్ మెంట్లను సోమేశ్ కుమార్ తదుపరి విచారణ టీంకు అప్పగించలేదని, వాటిని కోర్టుకు స్వాధీనం చేయలేదని తన ఆరోపణ…
కేటీయార్ మీద రేవంత్ రెడ్డి కూడా డ్రగ్స్ ఆరోపణలు చేశాడు గతంలో… టెస్టులకు సిద్ధమా అనీ సవాల్ విసిరాడు… ఇప్పుడు బండి సంజయ్ గోకుతున్నాడు… రేవంతూ నీకు చేతకాదా అని ఎగేస్తున్నాడు… అసలు ఈగల్ టీం పనిచేస్తోందా, పాత విచారణలు, ఆధారాలు ఏమయ్యాయీ అనడుగుతున్నాడు…

ఇది నిన్నటి వార్తే... ఈ కేసులో నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ కూడా ఉన్నాడు... గత సంవత్సరం కూడా ఈయన పోలీసులకు పట్టుబడ్డాడు... తనను పట్టుకుని ‘మర్యాద’ చేస్తే ఎందరు ప్రముఖుల పేర్లు బయటపడతాయో..!! బండి సంజయ్ కోరుకునేది అదే కదా..!?
Share this Article