అప్పుడప్పుడూ ఆశ్చర్యం వేస్తుంది… జాతీయ స్థాయిలో అనితర సాధ్యమైన రాజకీయ ప్రణాళికల్ని అమలు చేసే సాధనసంపత్తి, సామర్థ్యం ఉన్న బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు అచేతనంగా ఉండిపోతోంది..? ఏపీని వదిలేయండి, ఇప్పట్లో బీజేపీ పెరగదు అక్కడ… ఆ రాష్ట్రాన్ని బీజేపీ వదిలేసినట్టుంది… కానీ మంచి అవకాశాలున్న తెలంగాణ బరిని కూడా ఎందుకు ఇగ్నోర్ చేస్తోంది..?
మొత్తం దక్షిణాదిలో బీజేపీకి కర్నాటక తరువాత మంచి అవకాశాలున్నది తెలంగాణలోనే… కానీ సరైన వ్యూహం లేదు, ఆచరణ లేదు… నిజానికి మొన్నటి ఎన్నికల ముందు గనుక బీజేపీ కేసీయార్‌తో లోపాయికారీ అవగాహనతో ఉండి ఉండకపోయి ఉంటే… కేసీయార్ పట్ల జనంలో ఉన్న తీవ్ర వ్యతిరేకతను వాడుకుని ఉంటే… ఇంకా మంచి సంఖ్యలో అసెంబ్లీ సీట్లు వచ్చి ఉండేవి… చేజేతులా కాలరాచుకుంది…
కేసీయార్‌తో అవగాహన అనే ప్రచారాన్ని జనం నమ్మారు… కాళేశ్వరం అవినీతితోపాటు అనేక వ్యవహారాల్లో కేసీయార్ అడ్డంగా దొరికిపోయే చాన్సున్నా, చివరకు కవితను అరెస్టు చేసే అవకాశమున్నా ఇగ్నోర్ చేసి కేసీయార్‌కు అండగా నిలబడింది బీజేపీ, ఆఖరికి అదే బీజేపీని ‘ఎమ్మెల్యేల కొనుగోలు’ డ్రామాతో జాతీయ స్థాయిలో బదనాం చేయడానికి, బీజేపీ జాతీయ కార్యదర్శిని కూడా బజారుకు లాగడానికి కూడా ప్రయత్నించినా సరే…
Ads
లాస్ట్ ఏమైంది..? ఆశలు గల్లంతు… గతంకన్నా మెరుగే, కానీ కళ్ల ముందున్న ఎదిగే అవకాశాల్ని జారవిడుచుకున్నట్టే కదా… ఇప్పటికీ మళ్లీ అదే కేసీయార్‌తో సయోధ్య యత్నాలు… పొత్తు పెట్టుకుంటారట… అసలు సొంత పార్టీలో కేసీయార్ మనుషులు అనే విమర్శలు, ప్రచారమున్న వాళ్లను కంట్రోల్ చేసుకున్నదీ లేదు… ప్రజల్లో కేసీయార్ మీద బలంగా ఉన్న వ్యతిరేకతే కాంగ్రెస్‌ను గద్దెనెక్కించింది తప్ప అది కాంగ్రెస్ పాజిటివ్ గెలుపు కాదనే నిజం బీజేపీకి ఇప్పటికీ అర్థమవుతున్నట్టు లేదు…
ఈ నాయకుడు చూడండి… బండి సంజయ్… ఒకప్పుడు పార్టీ అధ్యక్షుడు… కాస్త దూకుడుగా వెళ్లినట్టే కనిపించింది… కానీ ఓ ప్రణాళికారాహిత్యం, సబ్జెక్టు నాలెడ్జిలో వీక్, సరైన కమ్యూనికేటర్ కాకపోవడం మైనస్… ఐనా సరే పార్టీలో ఓ జోష్ వచ్చింది… బీజేపీ ఏదో ఆశించి, తమ రహస్య స్నేహితుడికి నొప్పి తగలకూడదని సంజయ్ పై వేటు వేసి, మళ్లీ ఆ కిషన్ రెడ్డికే పగ్గాలు ఇచ్చింది… ఈటల రాజేందర్‌కు పెద్ద పీట వేసింది… చేరికల కమిటీ అట… పైసా ఫాయిదా లేదు, ఏకంగా సీఎం కుర్చీని కలల్లో, కళ్లల్లో దర్శించుకోసాగాడు…
కొత్తవాళ్లు చేరడం మాటెలా ఉన్నా, పాతవాళ్లే పార్టీ కండువాను విసిరేసి వెళ్లిపోయారు… ఒక దశలో ఆ ఈటల కూడా ఉంటాడా అన్నట్టు సిట్యుయేషన్… ఇప్పుడు చూడండి, అదే బండి సంజయ్‌ను అదేదో జాతీయ హోదాలోకి కూడా తీసుకున్నారు… ఐతేనేం, ఇప్పటికీ తను కరీంనగర్ గీతా భవన్ చౌరస్తా దాటి ఎదుగుతున్నట్టు లేడు…
బీఆర్ఎస్ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు టచ్‌లో ఉన్నారట… ఈ మాటలు, మైండ్ గేమ్ క్రీస్తుపూర్వం నాటివి… జనం నవ్వుకుంటారనే సోయి కూడా లేకపోతే ఎలా సంజయన్నా..! ఒకవైపు మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల బీఆర్ఎస్ నేతలు అదును చూసి కాంగ్రెస్‌లోకి జంపుతున్నారు… స్టేట్ బీజేపీలో చడీచప్పుడూ లేదు, ఈ డొల్ల ప్రకటనల చప్పుళ్లు, ఉడత ఊపుళ్లు తప్ప…
అవునూ, ఈటల రాజేందర్ ఎక్కడ..? రెండు చోట్ల పోటీ చేశాడు కదా చేరికల హీరో… సరే, అదెలా ఉన్నా ఇలాంటి ప్రకటనలు ఒకవేళ చేస్తే గీస్తే కిషన్ రెడ్డి చేసుకుంటాడు కదా, నడుమ బండి ఎందుకు వేళ్లు కాళ్లు పెట్టడం, ఎలాగూ కరీంనగర్ నుంచి మళ్లీ పోటీచేస్తాడు, అక్కడ వర్క్ చేసుకుంటే సరిపోదా ప్రస్తుతానికి… ఎలాగూ ఢిల్లీ స్థాయిలో సంప్రదింపులు సాగుతున్నయ్ కేసీయార్‌తో అవగాహన కోసం… మళ్లీ మళ్లీ చేతులు, మూతులు కాల్చుకోవడం బీజేపీకి అలవాటే కదా…
నిజానికి నిష్కర్షగా ఉన్నా సరే, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు కావల్సింది కిషన్ రెడ్డిలు, పురంధేశ్వరిలు కాదు… తమిళ అన్నామలై వంటి కేరక్టర్లు కావాలి.. అగ్రవర్ణాల మనువాద పార్టీ అనే ముద్రను బ్రేక్ చేసుకుని అన్ని వర్ణాల్లోకీ దూసుకుపోవాలి… దూకుడుకూ ఓ లెక్క ఉండాలి… ఇంకా నిష్కర్షగా చెప్పాలంటే… బనియా పార్టీగా కాదు, బనియాన్ పార్టీగా… అంటే మర్రి చెట్టులా ఊడలు దిగాలి… ఇన్నేళ్లుగా అమిత్ షాకు టీబీజేపీ ప్రక్షాళన, నియంత్రణ చేతకాలేదు… ఏమో, ఇకపైనా నమ్మకం లేదు… అప్పటివరకూ ఇదుగో బండి సంజయ్ డొల్ల గొప్పలు విని నిట్టూర్చాల్సిందే…
Share this Article