బతుకమ్మ ఏర్పాట్లు సరే… బొడ్డెమ్మ సంగతేమిటి అనడిగాను… బొడ్డెమ్మ అంటే..? అనడిగాడు తను… అంతే… ఇంకేమీ మాట్లాడలేదు… రేపు బతుకమ్మ స్టార్ట్… ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభం పండుగ…
తెలంగాణ మహిళ అత్యధికంగా ఇష్టపడే పండుగ… తనకు గానుగెద్దు చాకిరీ నుంచి తోటి మహిళలతో కూడి, ఆడి, పాడి మనస్సులో ఓ ఆనందాన్ని నింపుకునే పండుగ… మంచీచెడూ పంచుకునే పండుగ… బతుకమ్మ విశిష్టత వేరు, ఇక్కడ కాదు, మరోచోట చెప్పుకుందాం…
ఐతే బొడ్డెమ్మ..? బతుకమ్మకు ముందే ఆడవాళ్లు పుట్టమన్నుతో పేర్చే కన్నె బతుకమ్మ… ప్రత్యేకించి కన్నె పిల్లలు ఆడుకునే పండుగ… పల్లెల్లోనే కనిపించడం లేదు ఇప్పుడు… అంతే… కనుమరుగవుతున్న తెలంగాణ సంస్కృతి… ఏమో, అక్కడక్కడా పల్లెల్లో ఇంకా కనిపిస్తున్నదేమో… కానీ పట్టణాల్లో మాత్రం అగోచరం…
Ads
నిజాం పాలనలో… తరువాత ఆంధ్రా పాలనలో కూడా… తెలంగాణ బతుకమ్మ తన ఉనికిని నిలుపుకుంది… బతికింది… తరతరాల బతుకు పండుగ బతుకమ్మ… కవితక్కలు గట్రా హైజాక్ చేసుకుంటే నిర్లిప్తంగా నవ్వుకుని ఉంటుంది బతుకమ్మ… కేసీయార్ వచ్చాక బతుకమ్మ అధికారిక పండుగ అయ్యాక… అధికారుల చేతుల్లో పడి భ్రష్టుపట్టిన పండుగ…
బూట్ల కాళ్లతో, పూల కుండీలు నడుమ పెట్టుకుని, డీజేల హోరులో మగాళ్లు ఎగిరే ఫోటోలు, వీడియోలు ఒక వికారం… ఇన్నేళ్లు తనను తాను కాపాడుెకున్న బతుకమ్మే సిగ్గుపడేలా… ఈ ఫోటో చూడండి… బతుకమ్మ బతికిందో, సిగ్గుతో చితికిపోయిందో…
చూశారు కదా… మస్తు తెలంగాణ ప్రవచనాలు బోధించిన ఉద్యోగసంఘాల నేతలు వాళ్లు… (మొహాలు నేనే తీసేశాను…) ఇప్పుడెవరూ పదవుల్లో లేరు… బతుకమ్మ శపించింది… సరే, మనం బొడ్డెమ్మ దగ్గర కదా మొదలెట్టింది… దాదాపుగా పట్టణాల్లో కనుమరుగైంది… ఇక హైదరాబాదు వంటి మిశ్రమ, విశ్వనగరంలో బొడ్డెమ్మను పేర్చేది ఎవరు..? పూజించేది ఎవరు..? కాలగతిలో క్రమేపీ మాయమవుతున్న ఓ సాంస్కృతిక విశేషం… అంతే…
ఇప్పుడిక బతుకమ్మ… పైన చెప్పిన అపచారాలు, అవలక్షణాలు ఏమీ లేని బతుకమ్మను ఆహ్వానిద్దాం… సోకాల్డ్ కవితక్కలు ఎలాగూ లేరు ఈ రోజుల్లో… స్వచ్ఛమైన బతుకమ్మ పండుగను ఆశిద్దాం, ఆహ్వానిద్దాం…
బొడ్డెమ్మ కనుమరుగు కావడమే కాదు… అసలు బతుకమ్మ రూపురేఖలే మారిపోతున్నాయి నగరాల్లో… అఫ్ కోర్స్, పట్టణాల్లో, పెద్ద పల్లెల్లో కూడా… చుట్టూ తిరుగుతూ ఓ రిథమ్‌లో ఆడటం ఓల్డ్ కల్చర్… ఇప్పుడు డీజే పెట్టాలె… కోలాటం, దాండియా, బతుకమ్మ కలగలిపి, అదేదో వింత పద్ధతిలో చుట్టూ తిరగాలి…
ఐనా సరే, మహిళలు ఎలా ఆడుకుంటారనేది ముఖ్యం కాదు… కొన్ని కొత్త ధోరణులు భరించబుల్… ఎటొచ్చీ మళ్లీ ఆ బ్యూరోక్రటిక్ ఫేక్, ఆర్టిఫిషియల్, కల్తీ బతుకమ్మలు కనిపించకూడదనే ఆశిద్దాం… పండక్కి ఏర్పాట్లు మాత్రమే ప్రభుత్వ బాధ్యత… అంతేతప్ప… దిక్కుమాలిన ఆనాటి బూట్ల, మగాళ్ల కోలాటం పిచ్చి గెంతుల బతుకమ్మలు కనిపించకూడదని ఆ బతుకమ్మనే ప్రార్థిద్దాం… నాటి సోకాల్డ్ టీఆర్ఎస్ నేతలూ… ప్లీజ్, బతుకమ్మను వదిలేయండి… సగటు తెలంగాణ మహిళకు బతుకమ్మను ఎలా బతికించాలో, పూజించాలో బాగా తెలుసు…!!
Share this Article