Srinivas Sarla……. చేతుల పిస్తోల్ లేదు, జేబుల రీల్ పటాకలు లెవ్వు, వేసుకోడానికి కొత్త అంగీ లాగు లేదు, దోస్తుగాళ్ళు అందరూ బతుకమ్మ దగ్గరకు వెళ్లారు, అందరి దగ్గర పిస్తోల్ ఉంది, నా దగ్గర లేదు, మరేట్ల పోవాలే ఆడుకోను.. అరేయ్ నేను రాను మీరు పోర్రి.. అని అలిగి ఇంట్ల కూసున్న…
పెద్దవాళ్ళు బతుకమ్మ ఆడుతుంటే, మేము చేతిలో 5 రూపాల ఇనుప తుపాకీతో రీల్ తొడిగి, కనిపించినోడి వెంబడి పడుతూ హ్యాండ్సప్ కదిలితే కాల్చి పడేస్తా అని బతుకమ్మ ఆట చుట్టుపక్కల ఓ పది పదిహేను మంది పిల్లలం కలిసి పిస్తోల్ తో ఛేజింగులు చేసుకుంటూ ఆడుకునేటోళ్లం..
వచ్చే బతుకమ్మ పండుగకు ఎట్లయిన సరే పిస్తోల్ రీల్ పటాకలు కొనాలి అని డిసైడ్ అయ్యి యాడాది ఎదురు చూసా…
Ads
చిన్న బతుకమ్మ పండుగ మొదలైంది.. పొద్దుగాళ్ల 5 గంటలకు లేసి ఒక కొడలి (కొడవలి), అమ్మది పాత చీర చింపి తాడు లాగా సించిన.. సైకిల్ పట్టుకుని తొక్కుకుంటు తొక్కుకుంటు మా ఊరు దాటి గుండి గోపాల్ రావ్ పేట వైపు గునుక పువ్వు బాట పట్టిన..
సైకిల్ తొక్కి తొక్కి అలసిపోతున్నా మధ్య మద్యల ఆడుకుంటూ.. వెళ్ళేది
గోపాల్ రావ్ పేట దాటిన తరువాత పత్తి చేన్ల పొంటి, చెలకల పొంటి గునుక పువ్వు కనిపించింది, సైకిల్ ఒక చెట్టు కింద పెట్టి ఆ చెలకలకు పోయి ఒక రెండు గంటలు గునుక పువ్వు కోస్తే ఒక మోపు అయింది..
తాడు తీసుకుని మంచిగ కట్టి, ఇంటికి తీసుకెళ్లి… చిన్న చిన్న కట్టలు కట్టి, ఇంట్లో దాచి పెట్టేది, అలా సద్దుల బతుకమ్మ వచ్చేదాకా గునుక పువ్వు తంగేడు పువ్వు పట్టుకచ్చి సద్దుల బతుకమ్మకు ఒక్క రోజు ముందు కట్టిన చిన్న చిన్న కట్టలు అన్ని ఒక గమాల (బేషన్) లో పెట్టుకుని బస్టాండ్ కు పోయి అమ్ముకచ్చిన.
ఆటాన కు ఒక కట్ట, రూపాయి రెండు కట్టలు, అవి అమ్మితే పైసలు బాగానే వచ్చాయి, అటు నుంచి అటే బట్టల దుఖాన్ల కు పోయి అంగీ లాగు కొందాం అనుకున్న, ఛీఛీ ఇన్ని పైసలు వచ్చినంక మళ్ళా అంగీ లాగు కొనాల్నా, ఈ సారి జిన్ ప్యాంటు అంగీ కొంటా అని ఒక డ్రెస్సు తెచ్చుకున్న.
రావంగా రావంగా పటాకల దుకాణం పోయి 5 రూపాలు పెట్టి బ్లాక్ కలర్ ఇనుప పిస్తోల్… రీల్ పటాకల పూడలు కొనుక్కుని ఇంటికి పోయిన. తెల్లారితే సద్దుల బతుకమ్మ ధూమ్ దాం చెయ్యాలని పడుకున్నా. తెల్లారింది బతుకమ్మ హడావిడి మొదలైంది. నేను మాత్రం సాయంత్రం ఎప్పుడెప్పుడు అయితదా అని, ఎప్పుడెప్పుడు కొత్త డ్రెస్ వేసుకుందామా అని పొద్దుగాళ్లటి నుండి స్నానం కూడా చేయకుండా సాయంత్రం దాకా ఎదురు చూసిన..
సాయంత్రం నాలుగు గంటలకు టక్క టక్క స్నానం చేసి కొత్త బట్టలు తోడుక్కుని, నెత్తికి నూనె రాసుకుని దువ్వుకున్న. అమ్మ బొట్టు పెట్టి బతుకమ్మ ఎత్తుకుంది. నేను ఇంట్ల దాచిపెట్టిన నా పిస్తోల్ లో రీల్ పటాకలు వేసుకుని బతుకమ్మనెత్తుకున్న. మా అమ్మకు సైనికుడిలా బయలెళ్లిన.. బతుకమ్మ నాకు బతుకును నేర్పింది, కష్టం నేర్పింది…
Share this Article