Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఒరిజినల్ ఎడిటర్ కిడ్నాప్… ఆ ప్లేసులోకి ఓ ఫేక్ ఎడిటర్… తర్వాత..?!

December 20, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …… ప్రముఖ నటి నదియా నటించిన మొదటి తెలుగు సినిమా 1988 ఆగస్టులో వచ్చిన ఈ బజార్ రౌడీ . ద్విపాత్రాభినయం కూడా . కృష్ణ సమర్పించిన ఈ సినిమాలో ఆయన ఇరువురు కుమారులు రమేష్ బాబు , మహేష్ బాబు నటించారు .‌ బజార్ రౌడీగా రమేష్ బాబు , అతని శిష్యుడిగా , ఆల్ ఇండియా కృష్ణ ఫేన్స్ అసోసియేషన్ ప్రెసిడెంటుగా మహేష్ బాబు నటించారు .

చిక్కని కధ , బిర్రయిన స్క్రీన్ ప్లే , పదునైన మాటల్ని అందించిన సత్యమూర్తిని మొదటగా అభినందించాలి . ఆ తర్వాత అభినందనలు పండిపోయిన దర్శకుడు కోదండరామిరెడ్డికి . ఎక్కడా బోరించకుండా లాగించేసారు .

Ads

నదియా క్రాంతి అనే పత్రికకు అధినేత , చీఫ్ ఎడిటర్ . ఆమె తండ్రి పత్రిక వ్యవస్థాపకుడు భీమేశ్వరరావు నేరాలను చేసే , చేయించే కాంట్రాక్టర్ సత్యనారాయణ వలన చనిపోతాడు . పోతూ పోతూ అహోబలరావుని వదలిపెట్టవద్దని చెప్పి చనిపోతాడు . నదియా సత్యనారాయణ చేసే అక్రమాలను పత్రికలో ప్రచురిస్తూ ఉంటుంది .

ఇద్దరి మధ్య డైరెక్ట్ వార్ మొదలవుతుంది . నదియా కజిన్ శుభలేఖ సుధాకర్ని సత్యనారాయణ కిడ్నాప్ చేస్తాడు . విడిపించుకోవటానికి బజార్ రౌడీ రమేష్ బాబుని రంగంలోకి దింపుతుంది .

సినిమాలో అసలు ట్విస్ట్ ఇప్పుడే మొదలవుతుంది . నదియా పోలికలతో మరో నదియా ఒక హత్య కేసులో నేరస్తురాలు . ఆమెను తప్పించమని తండ్రి ప్రభాకరరెడ్డి సత్యనారాయణను ఆశ్రయిస్తాడు . బజార్ రౌడీ సహాయంతో అసలు నదియాని కిడ్నాప్ చేయించి నకిలీ నదియాని పత్రిక అధినేత సీట్లో కూర్చోబెడతాడు .

నదియా

అసలు నదియానే నేరస్తురాలిగా కోర్టులో రుజువు చేసి ఉరిశిక్ష పడేలా చక్రం తిప్పుతాడు . కిడ్నాప్ చేసిన సమయంలో అసలు నదియా బజార్ రౌడీని ప్రేమించేస్తుంది . దానితో అసలు నదియాను ఉరిశిక్ష నుంచి రక్షించటానికి బజార్ రౌడీ రంగంలో దిగి ఆఖరి నిమిషంలో గవర్నర్ దగ్గర నుండి స్టాప్ ఆర్డర్ని ఇప్పిస్తాడు . అయితే ఈ క్లైమాక్సులో నకిలీ నదియా చనిపోతుంది . అసలు నదియా , బజార్ రౌడీలు ఒకటవటంతో సినిమా సుఖాంతం అవుతుంది .

సినిమాలో పత్రికల నైతిక , సామాజిక బాధ్యతల గురించి ప్రస్తావన పుష్కలంగా ఉంటుంది . 1980s కాస్తో కూస్తో మీడియాకు నైతిక బాధ్యత ఉన్న రోజులు కదా ! అప్పుడప్పుడే మీడియాని కులాలకు , రాజకీయాలకు , డబ్బుకు తాకట్టు పెట్టడం ప్రారంభం అయింది .

రాజ్ కోటి సంగీత దర్శకత్వం ఆహ్లాదకరంగా ఉంటుంది . ముఖ్యంగా బేక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది . రమేష్ బాబు , నదియా , గౌతమి , సీతల మీద ఈ నాలుగు డ్యూయెట్లు ఉంటాయి . అన్నీ బాగా చిత్రీకరించబడ్డాయి . నృత్య దర్శకురాలు తారని , పాటల్ని శ్రావ్యంగా పాడిన బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , జానకమ్మలను అభినందించాలి .

ఓ ప్రేమా ఓ ప్రేమా నమహో నమః , తాకమాక తగ్గమాక , సింగారక్కో సిగ్గెందుకో , చెక్కిలిగిలి చిక్కుల ముడి అంటూ సాగుతాయి ఈ నాలుగు డ్యూయెట్లు . అయిదో పాట రీమిక్స్ పాట . చాలా సరదాగా సాగుతుంది . నకిలీ నదియాను టీజ్ చేస్తూ కుటుంబ సభ్యులు అందరూ పాడతారు . కొత్త పెళ్ళి కూతురా రావమ్మా అంటూ సాగుతుంది .

bazaar rowdy

కృష్ణ , రాధ అతిధి నటులుగా తళుక్కుమనే ఈ సినిమాలో రమేష్ బాబు , మహేష్ బాబు , నదియా , గౌతమి , సీత , నిర్మలమ్మ , శుభలేఖ సుధాకర్ , సత్యనారాయణ , అల్లు రామలింగయ్య , ప్రభాకరరెడ్డి , వయ్యారాల వై విజయ , రమణమూర్తి , ప్రదీప్ శక్తి , భీమేశ్వరరావు , పి జె శర్మ  ప్రభృతులు నటించారు .

మంచి సినిమా . అప్పటికే మళయాళ సినిమా రంగంలో నాలుగేళ్ళ నుండి నటిస్తున్న నదియా సత్యనారాయణకి దీటుగా బాగా నటించింది . మహేష్ బాబు ఎనర్జిటిక్ గా నటించాడు . కోదండరామిరెడ్డి డైరెక్షన్ కనిపిస్తుంది . వెరశి చూడతగ్గ సినిమా .

నటీనటుల ఎఫెక్ట్ కన్నా కధ , కధనం , దర్శకత్వం ఎఫెక్టే బాగా కనిపిస్తాయి . కృష్ణ ఫేమిలీ సినీ అభిమానులు తప్పక చూసే ఉంటారు . చూడనివారు వెంటనే యూట్యూబులో చూసేయవచ్చు .

నేను పరిచయం చేస్తున్న 1199 వ సినిమా . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్ #తెలుగు_సినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒరిజినల్ ఎడిటర్ కిడ్నాప్… ఆ ప్లేసులోకి ఓ ఫేక్ ఎడిటర్… తర్వాత..?!
  • మరో మెగా ఈవెంట్ చేస్తారు సరే… మరి తెగిన పాత పతంగుల మాటేంటి..?
  • వాణిని తొక్కేసింది లత, ఆశ… అసలే సౌతిండియన్, పైగా మెరిటోరియస్…
  • గ్రేట్… కథాకాకరకాయ జానేదేవ్… అదే విజువల్ వండర్… ఇది మరో లోకం..!!
  • జోలా జో-లమ్మ జోలా, జేజేలా జోలా, జేజేలా జోలా… హమ్ చేయండి ఓసారి…
  • అంత వణికిపోయే ముప్పేమీ కాదు… నందాదేవి అణుముప్పు అసలు స్టోరీ..!!
  • రేవంతుడు ధన్యుడు… వందలేళ్ల ఆదివాసీ చరిత్ర ‘చెక్కబడుతోంది’…
  • ఎడ్యుకేటెడ్, రిటైర్డ్, ఇంగ్లిషు తెలిసినవాళ్లే… ఈజీ సైబర్ టార్గెట్లు..!
  • ఒక బ్రహ్మపుత్రుడు… ఒక బ్రహ్మపుత్రిక… వెరసి ఓ బ్రహ్మపదార్థం సినిమా..
  • అశ్వపతి… ఈ పాత్రే లేకపోతే రామాయణం లేదు… రావణ వధ లేదు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions