జనం తండోపతండాలుగా వెళ్తున్నారు… పెద్ద పెద్ద టూరిస్ట్ సర్వీసులు, వందల కార్లు, జనం, రద్దీ, యాదాద్రిని మించిపోతోంది రద్దీ… అసలు ఏముంది సార్ ఈ గుడిలో… అని సీరియస్ ప్రశ్న వేశాడు ఓ మిత్రుడు… తరువాత కాస్త సెర్చ్ చేస్తే… అది మానేపల్లి కుటుంబం కట్టించుకున్న ఓ ప్రైవేటు గుడి అని తెలిసింది… గతంలో ఓసారి ఇదే మానేపల్లి జువెల్లర్స్ షాపుకు వెళ్లి జస్ట్, కొద్ది నిమిషాల్లోనే వాపస్ వచ్చిన ఉదంతం గుర్తొచ్చింది… ఇది ఓసారి యాదికి ఉంచుకొండి…
సరే, ఓసారి చూసొద్దాం, తరువాతే ఆ మిత్రుడికి సమాధానం చెబుదామని బయల్దేరే ముందు నెట్‌లో వెతికితే వైటీడీ అని దొరికింది… అనగా యాదాద్రి తిరుమల దేవస్థానం అట… ఇంకా పేర్లున్నయ్, స్వర్ణగిరి, మానేపల్లి టెంపుల్ ఎట్సెట్రా… యాదాద్రికీ దీనికీ సంబంధం లేదు, తిరుమలకూ దీనికీ సంబంధం లేదు… గమనించగలరు… 22 ఎకరాలు, భవ్యమైన వాస్తు, నీటిలో పద్మనాభస్వామి, పెద్ద హనుమంతుడు ఎట్సెట్రా చాలా పొగడ్తలు కనిపించాయి… కాదు, అతిశయోక్తులు…
హైదరాబాద్, పరిసరాల్లోని భక్తులే కాదు, ఎక్కడెక్కిడి నుంచో పోటెత్తుతున్నారు… వరంగల్ రహదారిలో భువనగిరి రాకముందే రైట్ సైడ్ టర్న్ తీసుకోవాలి… సొంత వాహనాలే బెటర్…, బస్సులు, రైళ్ళు అనుకూలం కాదు… ఆ హైవే దాటి ఈ స్వర్ణగిరి రూటులోకి మళ్లాక అసలు అవస్థలు స్టార్ట్… అదేదో మొత్తం ఓ పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్‌లోకి వెళ్తున్నట్టు అనిపించింది… కావచ్చు, మానేపల్లి వాళ్లకు వందల కోట్ల డబ్బు ఉండే ఉండవచ్చు… ఆ ఏరియా స్థలాల రేట్లు హఠాత్తుగా బాగా పెరిగిపోవచ్చు… కానీ..?
Ads
వాళ్లెందుకు ఈ గుడి కట్టారో తెలియదు, కానీ సంకల్పాన్ని తప్పుపట్టలేం, ఆ ఖర్చు కూడా తక్కువేమీ కాదు, ఓ పుణ్యక్షేత్రం బ్రహ్మాండంగా డెవలప్ అయితే ఆనందమే కదా… కానీ ఆ మట్టి రోడ్డు మీద కొద్దిదూరం వెళ్లాక గుడి… పెద్దగా, విశాలంగా… కానీ మెయిన్ గేట్ దగ్గర నుంచే అవస్థలు ఆరంభం… పార్కింగ్ స్లాట్ దూరం… పైగా అడ్డదిడ్డం నిర్వహణ… ఎలాగూ 50 రూపాయలు తీసుకుంటున్నారు కదా, వ్యాలెట్ పార్కింగ్ పెట్టి ఉంటే బాగుండేది…
మరో దరిద్రం ఏమిటంటే… పిల్లల్ని, వృద్ధుల్ని, మహిళల్ని ఆ మెయిన్ గేటు దగ్గర (అవెవరివో గానీ పెద్ద పాదాలున్నయ్ అక్కడ)… డ్రాప్ చేసి, పార్కింగ్ చేసి, చాలా దూరం నడిచి వచ్చాక… తిరిగి వెళ్లేటప్పుడు వాళ్లను తిరిగి ఎక్కడ పికప్ చేసుకోవాలో తెలియదు… ఎందుకంటే ఎగ్జిట్ దారి వేరు, వీళ్లంతా గుడికి మరోవైపు నడిచివెళ్లాలి, దూరమే…
మెయింటెనెన్స్ విషయానికొస్తే… నిజానికి అది పూర్తి స్థాయిలో గుడి అయిపోలేదు… అసలు ఆ చినజియ్యర్ ప్రాణప్రతిష్ట అనగానే డౌటొచ్చింది నాకు, అంతా అడ్డదిడ్డం ఆలోచనలే తనలాగే… మొత్తం అయ్యాక చేయొచ్చుగా… చేశారు, ఎగ్జిట్ వేలో వెళ్లేటప్పుడు జాగ్రత్త… నిండు గర్భిణులు, వృద్ధులు మరీ జాగ్రత్త… గుంతలు, మట్టిరోడ్డు, బురద… నిజానికి ఆ గుడిలో ఏది ఎక్కడ ఉందో చెప్పే సూచికలే సరిగ్గా లేవు…
నిజానికి ప్రభుత్వరంగంలో గుళ్లు ఉండొద్దు, దేవాదాయశాఖ నాన్సెన్స్ అంటుంటాం గానీ… ప్రైవేటు గుళ్ల నిర్వహణే భేష్ అంటాం గానీ… ఆ అభిప్రాయమే చెత్త అని మానేపల్లి గుడి నిరూపిస్తుంది… అప్పుడే పామ్ ట్రీస్ ఎండిపోయాయి… సగం సగం నిర్మాణాలు, ఇంకా వసతి, చౌల్ట్రీస్ కడుతున్నట్టున్నారు…
మానేపల్లి వారి గుడి అంటే అదేమీ వీసాల చిల్కూరు బాలాజీ టెంపుల్ కాదు, డబ్బు పిండనిదే సరైన దర్శనం అనిపించుకోదు అనే భావన ప్రబలంగా ఉన్నట్టుంది… 50 రూపాయల టికెట్టు… ధర్మదర్శనాన్ని మించి రష్… భక్తులకు అనుకూలమైన క్యూ లైన్స్ అనేది తెలియాలంటే ఈ గుడి నిర్వాహకులు పలు గుళ్లు తిరిగి తెలుసుకోవాల్సింది… ఎండొచ్చినా వానొచ్చినా మటాష్, కాళ్లనొప్పులు, కీళ్లనొప్పులు, ముసలోళ్లు, చంటిపిల్లల తల్లులు, సుగర్ పేషెంట్లు ఉంటే వాళ్ల పని అయిపోవాల్సిందే…
ఇరుకిరుకు లైన్లు… శని, ఆదివాారాలే కాదు, మామూలు రోజుల్లోనూ జనం విరగబడుతున్నారు… ఆ సుదీర్ఘమైన ఐదారు వరుసల లైన్లు చూశాక ఇక చాలు అనిపించింది… ఆ యాభై దర్శనం టికెట్లు చించేసి, నమస్కరించడానికి కూడా మనస్కరించక, వీసమెత్తు భక్తి వైబ్ లేక… వాపస్… పోనీ, అన్నప్రసాదం అంటున్నారు కదా, ఆ పుణ్యమైనా తీసుకుందాం అని వెళ్తే… అది మరింత దరిద్రం…
ఓ పెద్ద షెడ్డు… అందులో ఏమీ లేవు… టార్పాలిన్లు పరిచి ఉన్నయ్, ఓ మూల ఒకాయన పెరుగన్నమో, మజ్జిగన్నమో తెలియని పదార్థాన్ని ముష్టివాళ్లకు వేసినట్టు వేస్తున్నాడు… కడగడానికి ఏమీ లేదు, కొన్ని డ్రమ్ముల్లో నీరు, మీ ఇష్టం, ఎలాగైనా కడుక్కొండి… గుడి ప్రసాదవితరణ అనేది పెద్ద టాస్క్… మానేపల్లి వాళ్ళు అందులో అట్టర్ ఫ్లాప్, అసలు వాళ్లకు ఏమీ తెలియదని అర్థమైంది… తెలంగాణ గుళ్ల దగ్గర కూడా ఉండే వైశ్య అన్నసత్రాలను చూసి రండి ఓసారి… అదొక బృహత్ యజ్ఞం అది… డబ్బులున్నాయని ఓ పెద్ద గుడి కట్టడం కాదు…
భక్తులు దర్శనానికి ఎంత విలువ ఇస్తారో అన్నప్రసాదానికి అంత విలువ ఇస్తారు… ఒక్కసారి మానేపల్లి వాళ్లకు గనుక సోయి, భక్తజనం మీద, దేవుడి మీద ప్రేమ ఉంటే అంతర్వేది వద్దకు వెళ్లి రావాలి… పోనీ, కర్నాటకలోని ఏ చిన్న గుడి దగ్గరకు వెళ్లినా సరే… వీళ్లకు వీసమెత్తు జ్ఙానం లేదు అని చెప్పడానికి సాహసిస్తున్నాను… ఒక బిర్లామందిర్, ఒక సంఘీ టెంపుల్ వద్దకు వెళ్తే, కాసేపు కూర్చోవాలనే పాజిటివ్ వైబ్ క్రియేటవుతుంది… మానేపల్లి దగ్గర అది శూన్యాతిశూన్యం…
చెబుతూ పోతే ఇలాంటివి బోలెడు ఇక్కడ… అయ్యా, చిన జియ్యరుడా… ఇదేనా లోకానికి నీ మరో ప్రసాదం..? ఒక్కటైనా సరిగ్గా సలహా ఇచ్చావా..? ఎక్కడ అడుగుపెట్టినా ఇదేనా కథ..? అర్చనలు అట, విశేష పూజలు అట, డోనర్ టికెట్ అయితే 1000 కడితే నలుగురికి ప్రత్యక దర్శనం, స్వామివారి ప్రసాదం, స్వామివస్త్రం అట… సో, ఇదీ సగటు దేవాదాయశాఖ బాపతు దుకాణం టైపే… ఇంతకీ ఈ అధ్వానపు నిర్వహణతో ఇంత పెద్ద గుడి ఎందుకు కట్టినట్టు…? మానేపల్లి వాళ్లు ఏది చేసినా ఏదో ఆర్థిక పరమార్థం ఉంటుంది, అదేమిటో అర్థం కాలేదు…
నిజానికి ఏదైనా టెంపుల్‌ను పరిచయం చేస్తున్నప్పుడు వ్లాగర్లు, బ్లాగర్లు, ట్యూబర్లు పెద్దగా నెగెటివిటీ జోలికి పోరు, ఆహా ఓహో అంటారు… కానీ ఎక్కడెక్కడి నుంచో వచ్చే కొత్త భక్తులకు అక్కడ పరిస్థితిని తెలియజెప్పడం అవసరం… అది ఒకరకంగా నిర్వాహకులకు సరైన ఫీడ్ బ్యాక్… నిజానికి అదే పుణ్యం… అయ్యా, మానేపల్లి గుడికి వ్యయప్రయాసలకు ఓర్చి, వెళ్లి, వికలమైన మనసుతో వాపస్ వచ్చి, మా కాలనీ వెంకన్నను చూసి, కళ్లు మూసుకుని, భక్తిగా దండం పెట్టేవరకు మనసుమనసులో లేదు… మా బాలాజీ కూడా ఏదో మార్మికమైన చిరునవ్వుతో నావైపు చూసి ఏదో చెప్పినట్టనిపించింది..!
చెప్పనే లేదు కదూ… ఉప్పల్ నుంచి వరంగల్ రహదారిలో దాదాపు 40, 50 కిలోమీటర్లు… మధ్యలో టోల్ బాదుడు కూడా ఉంది… అక్కడ తినడానికి కూడా ఏమీ దొరకదు… వీలైతే ఇంటి నుంచే, లేదా మధ్యలో ఏదైనా హోటల్ నుంచి పార్శిళ్లు, వాటర్ బాటిళ్లు తీసుకుపోతే…. పిల్లలు, సుగర్ పేషంట్లకు మేలు, శ్రేయస్కరం..! లేదా భక్తులకు నిజంగానే దేవుడు కనిపిస్తాడు..! తెలంగాణాలో ఒక మాట అంటుంటారు ఇలాంటివి చూస్తే… నీకు రీతి లేదురా.. !!
Share this Article