.
(వరుణ్ శంకర్) …….. తెలుగు రాజకీయాలపై, ప్రత్యేకించి తెలంగాణ రాజకీయలపై ప్రత్యేకమైన ముద్ర వేసిన కొండా సురేఖ కొంతకాలంగా విచిత్రమైన వివాదాల్లోకి కూరుకుపోతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ మధ్య నాగార్జున కుటుంబంపైన, మొన్న మంత్రుల కమీషన్లపైన సురేఖ చేసిన వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదం అయ్యాయి.
అలాగే ఇటీవలి మిస్ వరల్డ్ అందాల పోటీల్లో వచ్చీరాని ఇంగ్లిష్‌లో తడబడుతూ చేసిన ప్రసంగం కూడా ప్రత్యర్థులకు అవకాశంగా మారింది. నిజానికి ఇంగ్లిష్ ప్రసంగం పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం కాకపోయినా, సోషల్ మీడియా జమానా కాబట్టి అది ట్రెండింగ్‌గా మారింది.
Ads
సురేఖ చాలాకాలం క్రితమే ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందారు. ఏటికి ఎదురీదే నేతగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. నమ్ముకున్న వారి కోసం ఎంతదూరమైనా పోతారనే గుర్తింపును పొందారు. అగ్రకుల ఆధిపత్యాలను, అడ్డంకులను ఛేదిస్తూ ఆమె సాధారణ కార్యకర్త నుంచి మంత్రి వరకు ఎదిగారు.
తాను అనుసరించిన బాటతో ప్రజల్లో తనకంటూ ఇమేజ్‌ను పొందగలిగారు. అయితే అనేకానేక పరిణామాల నేపథ్యంలో ఎదురైన అనేక చీకటి రోజుల తర్వాత ఆమె రెండోసారి మంత్రి అయ్యారు. అయితే ఈ టర్మ్‌లో ఆమె తీరు అనేకమార్లు విమర్శలకు తావిస్తుండటం విస్మయం కలిగిస్తోంది.
సురేఖ తెలిసి చేస్తున్నారా.. తెలియక చేస్తున్నారా.. అనేది చర్చగా మారింది. రాజకీయాల్లో అనుసరించాల్సిన విచక్షణను, వ్యూహాలను, సంబంధాలను ఆమె పట్టుకోలేకపోతున్నారనే అపవాదును మూటగట్టుకుంటున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారనేది అంతుబట్టడం లేదు.
బీసీ పద్మశాలి సామాజికవర్గానికి చెందిన మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన సురేఖ.. భర్త కొండా మురళి ప్రోత్సాహంతో 1995లో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటికే ఆమె పట్టభద్రురాలు. రాజకీయాల్లో వచ్చిందే తడవుగా ఆమె గీసుగొండ ఎంపీపీగా ఎన్నికయ్యారు.
తొలి రోజుల్లోనే ఆమె అత్యంత చురుకైన నేతగా గుర్తింపు పొందారు. వరంగల్ జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడిన పత్తి రైతుల కుటుంబాలను ఓదార్చేందుకు 1998లో సోనియాగాంధీ వచ్చిన సందర్భంలో, ఆమెకు పత్తి రైతుల కుటుంబాలకు మధ్య సురేఖ దుబాసీగా వ్యవహరించారు.
ఆమె సోనియాను ఆకట్టుకున్నారు. అనంతరం అంటే 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శాయంపేట ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని విజయం సాధించారు. అట్లా ఆమె తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
భర్త అడుగుజాడల్లో, కన్నుసన్నల్లో నడిచే సురేఖ తన నాయకత్వ లక్షణాలను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వచ్చారు. 1999లో ఎమ్మెల్యేగా ఎన్నికైంది మొదలు.. ఆమె వెనుదిరిగి చూడలేదు. తన చర్యలు, వైఖరితో ఫైర్‌బ్రాండ్‌గా పేరుపొందారు.
అప్పటినుంచి క్రియాశీల రాజకీయాల్లో తలమునకలై వున్నారు. తెలుగులో సురేఖ మంచి వాగ్ధాటి గల నేత. భర్త మురళి వెన్నుదన్నుగా ఆమె క్రియాశీల రాజకీయాల్లో ప్రభావవంతంగా రాణించారు. గత 30 ఏళ్లుగా ఆమె సెక్రటరీలతో, కలెక్టర్లతో, ఎస్పీలతో, ఇతర ఉన్నతాధికారులతో ప్రజాప్రతినిధిగా కలిసి పనిచేస్తూ వస్తున్నారు. అసెంబ్లీలోనూ తన ప్రసంగాలతో ముద్ర చాటారు.
సురేఖది మొదటి నుంచీ ముక్కుసూటి శైలి. 2002లో కొండా మురళిపై ‘టాడా’ కేసు నమోదైనప్పుడు, తన భర్త హత్యకు కొందరు కుట్ర పన్నుతారని, తన మాంగల్యం కాపాడాలని నిండు అసెంబ్లీలో ఆమె అప్పటి సీఎం చంద్రబాబును వేడుకోవడం అప్పుడొక సంచలనం.
2009 సెప్టెంబరులో వైఎస్ మరణించిన సమయంలో జగన్‌ను సీఎం చేయనందుకు నిరసనగా, మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తన రూటే సపరేటని చాటుకున్నారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో సురేఖ.. సమైక్యవాదిగా ముద్రపడిన వైఎస్ జగన్ శిబిరంలో చేరి, 2010 మే 28న జగన్‌ను మహబూబాబాద్‌కు ఓదార్పు యాత్రకు ఆహ్వానించారు.
అయితే తెలంగాణ వాదులు జగన్ యాత్రకు నిరసనగా, మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో జగన్ వర్గ నేతలపై రాళ్ల దాడికి దిగడం, ప్రతిగా వారిపైకి సురేఖ రాళ్లు విసరడం, ఈ క్రమంలోనే కాల్పులు చోటుచేసుకోవడం.. అదొక రక్తసిక్త అధ్యాయం. అప్పుడు సురేఖ తీరు తీవ్ర చర్చనీయాంశంగా నిలిచింది.
జగన్ కోసం ఎమ్మెల్యే పదవిని, మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేయడం, తెలంగాణ వాదులకు వ్యతిరేకంగా వ్యవహరించడం ఆమెను వివాదాస్పదం చేశాయి. వైఎస్ కుటుంబంతో వున్న సాన్నిహిత్యం ముందు ఏ పదవీ, ఏ ఉద్యమమూ తనకు లెక్కకాదని ఆమె చాటారు.
ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆమె టీఆర్‌ఎస్‌లో చేరారు. కేసీఆర్ ఆశీస్సులతో 2014లో వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ రక్తాన్ని నరనరాన జీర్ణించుకున్న కొండా దంపతులు.. టీఆర్‌ఎస్‌లో ఇమడలేకపోయారు.
కేసీఆర్, కేటీఆర్‌తో దూరం పెరగడంతో 2018లో వారికి టికెట్ దక్కలేదు. టికెట్ దక్కని అనేకమంది సైలెంట్‌గా ఉండగా, సురేఖ మాత్రం ధిక్కారస్వరం వినిపించారు. తనకు జరిగిన అవమానాలను ఏకరువు పెట్టారు. 2018లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా విజయం దక్కలేదు.
తిరిగి 2023లో వరంగల్ తూర్పు నుంచి పోటీ చేసి టీఆర్‌ఎస్ వ్యతిరేక పవనాల్లో అనూహ్యంగా గెలుపొందారు. నిజానికి ఇది సురేఖకు పునర్జన్మ లాంటిది. ఎన్నికల్లో తనకు ఎవరూ పెద్దగా సహకరించపోయినా రాజకీయ సమీకరణాలు, త్రిముఖ పోటీ ఆమెకు కలిసివచ్చాయి. సీనియర్ ఎమ్మెల్యే కావడంతో ఏకంగా మంత్రి అయ్యారు. బీసీ సామాజికవర్గం నుంచి ఎదిగిన సురేఖ.. బీసీ అస్తిత్వ రాజకీయాలకు ఐకాన్ గా నిలిచారు.
రాజకీయాల్లో రెండో ఇన్నింగ్స్‌ను అతి జాగ్రత్తగా ఆడాల్సిన సురేఖ.. ఎందుకో ఆటపై పట్టు కోల్పోతున్నట్టు కనిపిస్తోంది. నిజానికి పేరుకు కాంగ్రెస్ ప్రభుత్వమైనా, రేవంత్ టీమ్ అంతా టీడీపీ-బి టీమ్‌గా కనిపిస్తుంది. టీడీపీతో జీవితకాలం యుద్ధ రాజకీయాలు చేసిన సురేఖ.. ఇప్పుడు అదే టీమ్‌లో సభ్యురాలిగా ఉండటం వైరుధ్యమే కాదు, సున్నితమైన అంశం కూడా.
ఒకప్పుడు సురేఖకు ముందూ వెనుకా ఆమె భర్త మురళీ అన్నీతానై కనిపిస్తూ ఉండే వారు. ఇప్పుడు ఆయన అంతగా కనిపించడం లేదు. కారణాలు తెలియవు. కానీ ఆ లోటేదో మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.
రాజకీయంగా మాట్లాడే సమయంలో ఆచితూచి వ్యవహరించాల్సిన రోజుల్లో.. సురేఖ రెక్‌లెస్‌గా, బేస్‌లెస్‌గా మాట్లాడుతుండటం విస్తుగొలుపుతోంది. ఇది అంతర్గత, బహిర్గత శత్రువులకు అవకాశంగా మారుతుందనే అంశాన్ని ఆమె పట్టించుకోవడం లేదు. మిగతా మంత్రులతో పోల్చుకున్నప్పుడు మొత్తం మంత్రివర్గంలో సురేఖ మాత్రమే వివాదాస్పదురాలిగా ముద్ర పడుతుండటం గమనించాల్సిన విషయం.
దీని వెనుక ఏదైనా కుట్ర ఉందేమో ఆమె తెలుసుకుంటే మంచిది. సోషల్ మీడియాలో సురేఖ ట్రోల్ అవుతున్నట్టుగా మరే మంత్రి కావడం లేదు. నిజానికి ట్రోలింగ్ అనేది రహస్య శత్రువు చేసే దాడి లాంటిది. ఎదుటిపక్షం వారు ఎవరో తెలియకుండానే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.
మిస్ వరల్డ్ అందాల పోటీల్లో స్ర్కిప్టును చూసుకుంటూ ఇంగ్లిష్‌లో మాట్లాడే అవకాశం వున్నా, ఆమె వచ్చీరానీ అదేదో ఇంగ్లిష్‌లో తడబడుతూ మాట్లాడి ట్రోలర్లకు ఎందుకు దొరికినట్టో అర్థం కావడం లేదు.
సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనేది వివిధ పార్టీలకు రాజకీయ ఆయుధంగా మారిన తర్వాత.. తమ టార్గెట్లు ఎక్కడ దొరుకుతారా..? అని ఆయా పార్టీల టీమ్‌లు కాచుక్కూర్చోవడం పరిపాటిగా మారింది. ట్రోలింగ్ కల్చర్ బలపడిన క్రమంలో అజ్ఞాత ట్రోలర్స్‌కు బాగా డిమాండ్ పెరిగింది.
లక్షలు వెచ్చించి సోషల్‌మీడియా బ్యాచ్‌లను పెంచి పోషిస్తున్నారు. సురేఖ వీడియో క్లిప్పింగ్స్… వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా, ఎక్స్‌లో వైరల్ కావడమే కాదు, ట్రెండింగ్‌లోనూ నిలిచాయి. ఒకే మాటను వీడియో ఎడిటింగ్‌లో పదే పదే చూపడంలో, బ్యాక్‌గ్రౌండ్‌లో సౌండ్స్‌ను మిక్స్ చేయడంలో, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో పదే పదే వైరల్ చేయడంలో ఎదుటిపక్షం నేతలను అవమానించడం, వారి స్థాయిని దిగజార్చడం ప్రధాన టార్గెట్‌గా కనిపిస్తుంది. అదొక టెక్నికల్ వ్యూహం. ప్రజల్లో పలుచన చేసే ఎత్తుగడ.
ప్రజాప్రతినిధులు, నాయకుల పబ్లిక్ లైఫ్‌లో సీక్రసీ, ఆఫ్ ది రికార్డు, పర్సనల్.. వంటి పదాలకు కాలం చెల్లిపోయింది. ఒకప్పుడు నాయకులు మాట్లాడినప్పుడు అఫీషియల్, అన్ అఫీషియల్ అనే పద్ధతి ఉండేది. అన్ అఫీషియల్ మాటలను మీడియా ప్రతినిధులు బయటకు వెల్లడించే వారు కాదు. దానిని నైతిక బాధ్యతగా భావించే వారు.
ఇప్పుడు అదంతా జాన్తానై. ఏది మాట్లాడినా అఫీషియలే. అన్ అఫీషియల్‌లో స్పైసీ ఉంటే, వద్దని ఎంత మొత్తుకున్నా.. అది మరింత అఫీషియలై పోతుంది. దాచాలంటే దాగదులే అని సోషల్ మీడియా కోడై కూస్తుంటే.. నాయకులు జాగ్రత్తగా మాట్లాడాలి కదా. సురేఖ లాంటి ఫైర్‌బ్రాండ్ నేతలు ఇప్పటికైనా తమ ట్రెండ్ మార్చుకుంటారేమో చూడాలి… అయ్యో, నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు అని వివరణ ఇచ్చుకునేలోపు జరగాల్సిన డ్యామేజీ జరిగిపోతుంది మరి..!!
Share this Article