Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చావు తరువాత..? అంతుపట్టనిదేదో ఉంది… ఎడతెగని పరిశోధనలు…

September 6, 2023 by M S R

Soul-Resale: “కన్ను తెరిస్తే ఉయ్యాల; కన్ను మూస్తే మొయ్యాల…” అని జాలాది చాలా లోతయిన విషయాన్ని చాలా సింపుల్ గా తేల్చిపారేశాడు.

“కన్ను తెరిస్తే జననం;
కన్ను మూస్తే మరణం;
రెప్పపాటే కదా జీవితం?”  అని మినీ కవిత రచయిత పేరుతెలియకపోయినా తెలుగులో దశాబ్దాలుగా బాగా ప్రచారంలో ఉంది.

“స్వతంత్ర దేశంలో చావుకూడా
పెళ్లిలాంటిదే బ్రదర్!”  అని ఆకలి రాజ్యంలో సినీ కవి సూత్రీకరించాడు.

Ads

చావు- పుట్టుకలు రెండూ మనచేతిలో ఉండవు. ఏది మనచేతిలో ఉండదో సహజంగా దానికి అతిన్ద్రియ శక్తులను అంటగడతాం. శాస్త్రం- నమ్మకం వేరువేరుగా అనిపించినా శ్రీహరికోట అధునాతన మానవనిర్మిత సాంకేతిక ఉపగ్రహం కూడా అంతరిక్షంలోకి వెళ్లే ముందు సూళ్లూరుపేట చెంగాళమ్మకో, తిరుమల వెంకన్నకో మొక్కుకునే బయలుదేరుతుంది. ఎంతటి గ్రహానికయినా గ్రహచారం బాగుండాలంటే దేవుడి ఆశీస్సులు తప్పనిసరి అనుకుంటే సరి. కొన్ని నమ్మకాలను గౌరవించాలే తప్ప, పీకి పాకం పెట్టి…పలుచన చేయడం మంచిదికాదు.

వాడుక మాటల్లో చావు గురించి ఎన్ని ఎగతాళి మాటలు ఎన్నయినా ఉండవచ్చు.
కానీ చావు ఎగతాళి కాదు.
చావు- చచ్చేంత సీరియస్.

సనాతన ధర్మ మూల స్తంభం- పునర్జన్మ. పాపపుణ్యాలను బట్టి తరువాత జన్మల్లో నల్లిగానో, బల్లిగానో, కుక్కగానో, నక్కగానో పుడుతూ ఉంటాం. ఇలా మనుషులుగా పుట్టడానికి గత జన్మల్లో ఎంతో పుణ్యం చేసి ఉంటామట. దాన్నే పెట్టి పుట్టడం అన్నారు. ఈ జన్మలో ఎలాగూ పెట్టం కాబట్టి తరువాత జన్మల్లో ఏ రూపంలో, ఎక్కడ పుడతారో ఎవరికి వారు ఊహించుకోవచ్చు.

ఒక కోణంలో అసలు దేవతల కంటే పితృ దేవతలు చాలా పవర్ ఫుల్. అందుకే బతికి ఉండగా తల్లిదండ్రులకు అన్నం ముద్ద పెట్టని పిల్లలు కూడా వారు పోయాక భక్తి శ్రద్ధలతో, భయంతో పిండ శ్రాద్ధాలు పెడుతూ ఉంటారు. అండ పిండ బ్రహ్మాండాలు అని వేదాంతంలో గంభీరమయిన మాట ఉంది. పోయిన ఆత్మ బ్రహ్మాండంలో భద్రంగా ఉండాలంటే పిండం పద్ధతిగా పెట్టాలి.

ఇప్పుడు భూమ్మీద 28 రోజులు చంద్రుడి మీద ఒక పగలు ఒక రాత్రి అయినట్లే… మన ఒక నెల పితృదేవతలకు ఒక రోజు. అందుకే చనిపోయిన తరువాత ప్రతి నెలా వారికి అన్నం ముద్దలు, నీళ్లు ఇచ్చే మాసికాలు పెట్టారు. తరువాత మన ఒక సంవత్సరం వారికి ఒక రోజు. అందుకు ఏటా తద్దినం పెడుతున్నాం. ఇంతకంటే లోతుగా వెళ్లడం భావ్యం కాదు. కొందరికి నచ్చకపోవచ్చు.

వాల్మీకి రామాయణంలో చనిపోయిన దశరథుడు రాముడికి పితృ దేవుడిగా కనిపించాడు. మాట్లాడాడు కూడా.

“లోకంబులు లోకేశులు
లోకస్థులుఁ దెగినఁ దుది నలోకం బగు పెం
జీకటి కవ్వల నెవ్వం
డే కాకృతి వెలుఁగు నతని నే సేవింతున్”  అన్నాడు పోతన భాగవతంలో గజేంద్రుడు. చనిపోయినవారు ఆ పెను చీకటిగుండా ప్రయాణించాలి. చనిపోయే ముందు అంతులేని చీకటి అనుభవంలోకి వస్తుందట. చావు అంచుల దాకా వెళ్లి వచ్చిన అయిదు వేల మంది అనుభవాలను లోతుగా అధ్యయనం చేసిన ప్రఖ్యాత అమెరికా వైద్యుడు(రేడియేషన్అంకాలజిస్ట్) జెఫ్రీ ఎన్నెన్నో చావు కబుర్లను చల్లగా చెబుతున్నారు.

ఆయన అధ్యయనం ప్రకారం:-
1 . చనిపోయే ముందు అంతులేని చీకటి అనుభవంలోకి వస్తుంది.
2 . తరువాత ఒక ఫ్లాష్ లాంటి మెరుపు వెలుగు కనపడుతుంది.
3 . మరణాంతరం ఆ జీవికి ఇంకేదో జీవితం ఉంది. అది ఇదీ అని నేను చెప్పలేకపోవచ్చు కానీ...మరణం కేవలం పాంచభౌతికమయిన ఈ శరీరానికే. లోపలి చైతన్యానికి కాదు. ఈ సంగతి మృత్యు కౌగిల్లోకి వెళ్లి వచ్చిన అయిదు వేల మంది చెబితేగానీ…జెఫ్రీకీ అర్థం కాలేదు.

“నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః
న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః”
ఆత్మను ఆయుధాలు కోయలేవు. అగ్ని కాల్చలేదు. నీళ్లు తడపలేవు. గాలి శోషింపచేయలేదు. ఆత్మ నిత్యం. సత్యం. శాశ్వతం- అని మనకు భగవానుడు ఎప్పుడో చెప్పాడు కదా! -పమిడికాల్వ మధుసూదన్, 9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions