అదేదో ఢీ అనే డాన్స్ షోలో చూపించినట్టు… ఏదో హైపర్ ఆది అలా చెప్పగానే, అలాగే బావా అని పిలిచి గట్టిగా ఓ హగ్గు ఇచ్చేస్తుంది పాపం అనుకోకండి… మరీ అంత అమాయక కేరక్టర్ ఏమీ కాదు ప్రియమణి బయట… ఫీల్డులో స్ట్రగుల్ అయ్యీ అయ్యీ రాటుదేలి, కూలిపోయిన కెరీర్ గోడను ఎలాగోలా తిరిగి పేర్చుకుంటోంది… భామాకలాపం అనే ఓటీటీ సినిమా (ఆహా) చూస్తున్నంతసేపూ ఆమె మాత్రమే కనిపిస్తుంది… ప్లజెంట్‌గా ఉంది ఆమె… ఎహె, అందం చందం గురించి కాదు… ఆ పాత్రను అచ్చంగా మోసి, అలరించింది అని…!
కేరళ, పాలక్కాడ్ కుటుంబం వాళ్లది… బెంగుళూరులో పుట్టింది… 2003లో ఎవరే అతగాడు సినిమా నుంచి కెరీర్ స్టార్టయితే, ఎక్కువగా తెలుగు సినిమాలే నిలబెట్టాయి ఆమెను… 2006లోనే పరుత్తివీరన్ అనే తమిళసినిమాకు ఏకంగా జాతీయ అవార్డు కొట్టింది… జూనియర్ ఎన్టీయార్ యమదొంగలో 2007లోనే హీరోయిన్ తను… అందం ఉంది, నటన కౌశలం ఉంది, కానీ వయస్సున్నప్పుడే కెరీర్‌ను బలంగా నిర్మించుకోవాలి కదా… పాత్రల ఎంపికలో పొరపాట్లు కావచ్చు, దురదృష్టం కావచ్చు… తరువాత కెరీర్‌లో వేగంగా, దారుణంగా వెనకబడిపోయింది…
Ads
మస్తఫా రాజ్‌తో పెళ్లి తరువాత మరీ… ఆ తరువాత లోకం అర్థమైంది… ఇండస్ట్రీ తీరు అర్థమైంది… ఈలోపు వయస్సు కరిగిపోయింది… అనగా ఇండస్ట్రీకి పనికొచ్చే వయస్సు అని..! కూడదీసుకోవడం స్టార్ట్ చేసింది… ఈటీవీ ఢీ డాన్స్ షోలో జడ్జి… తెర మీద రెగ్యులర్‌గా కనిపించడానికే కాదు, వారం వారం డబ్బొచ్చే పాడిబర్రె ఆ ఢీ షో… అందుకే దాన్ని వదిలేయలేదు… వదలదు… నలభై ఏళ్ల వయస్సులో హీరోయిన్ పాత్రల్ని ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయలేదు కదా…
అందుకే వెబ్ సీరీస్ ప్లస్ సినిమాల్లో అడపాదడపా పాత్రలు… ఇండస్ట్రీ నుంచి కనుమరుగు కావద్దు… అంతే… ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరిస్ ఆమె మళ్లీ వెలిగేలా చేసింది… పైగా ఇప్పుడు ఇండస్ట్రీలో కంటెంట్ బేస్డ్, కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు, సీరియళ్లు వస్తున్నయ్… అత్త, అమ్మ, వదిన పాత్రలతో మమ అనిపించడం కాదు, కాస్త ప్రయారిటీ, గుర్తింపు వచ్చే పాత్రలు వస్తే వెంటనే సైన్ చేస్తుంది… మెరిట్ ఉంది… ఆమధ్య వచ్చిన నారప్ప, భామాకలాపం ఓటీటీ సినిమాతోపాటు రాబోయే విరాటపర్వం సినిమానూ ఈ కోణంలోనే చూడాలి…
భామాకలాపం సినిమా ఓ సరదా మర్డర్ మిస్టరీ మూవీ… ప్రియమణి అచ్చంగా ఒదిగిపోయింది ఆ పాత్రలో… ఓ మధ్యతరగతి ఇల్లాలు… యూట్యూబ్‌లో వంటల వీడియోలు పెడుతూ నాలుగు డబ్బులు పోగేసుకుంటూ ఉంటుంది… చుట్టుపక్కల ఇళ్లల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే తత్వం… ఓసారి అనుకోకుండా ఓ ఫ్లాట్‌లోకి అడుగుపెట్టి, పొరపాటున ఒకడి తాడు తెంపేస్తుంది… వందల కోట్ల విలువ చేసే ఓ గుడ్డు చుట్టూ కథ… అంతర్లీనంగా మూఢనమ్మకాల్ని కాస్త టచ్ చేస్తుంది సినిమా… కాస్త ఫన్, కాస్త థ్రిల్, కాస్త వెరయిటీ… ఈ తిక్క పెద్ద హీరోల నరుకుడు, నాకుడు అతి వేషాలు చూసే బదులు ఇలాంటివి చూస్తే పెద్ద రిలీఫ్… మొత్తానికి ప్రియమణికి ఓ మంచి బాట దొరికింది..!!
Share this Article