ఏమౌతావో నాకు నువ్వు.. ఏమౌతానని నీకైనా నేను… … 2000లో తమిళంలో ‘భారతి’ అనే సినిమా వచ్చింది. తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా అది. సుబ్రహ్మణ్య భారతిగా షాయాజీ షిండే, ఆయన భార్య చెల్లమ్మగా దేవయాని నటించారు. ఆ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. అన్ని పాటలూ హిట్. ముఖ్యంగా ‘మయిల్ పోలె పొణ్ణు ఒణ్ణు.. కిళి పోల పేచ్చి ఒణ్ణు’ పాట మరీ మరీ హిట్. లేలేత గొంతులో అందంగా పలికిన పాటను ఎవరు పాడారా అని తమిళనాడంతా ఆసక్తిగా చూసింది. అంతేనా? ఆ సంవత్సరం జాతీయ ఉత్తమ నేపథ్య గాయని పురస్కారం సైతం ఆ పాటకుగానూ ఆమెనే వరించింది. ఆ గాయని పేరు భవతారిణి. ఆమె ఇళయరాజా గారి కూతురు.
… ఇళయరాజా గారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. కార్తిక్ రాజా, యువన్ శంకర్ రాజా అందరికీ తెలిసినవారే! కుమార్తె భవతారిణి తెలుగు వారికి పెద్దగా తెలియదు. ఆమె గాయని, సంగీత దర్శకురాలు. 1976లో పుట్టిన ఆమె క్యాన్సర్‌తో బాధపడుతూ నిన్న రాత్రి శ్రీలంక రాజధాని కొలంబోలో మరణించారు. దక్షిణ భారతదేశంలోని అతని తక్కువ మంది మహిళా సంగీత దర్శకులలో ఒకరు ఇలా ఉన్నట్టుండి కనుమరుగవడం పట్ల సినీరంగం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
… 1984లో ‘మై డియర్ కుట్టిచేతన్’, 1990లో ‘అంజలి’ సినిమాల్లో చిన్నపిల్లలకు పాటలు పాడారు భవతారిణి. ఆ తర్వాత 1995లో ప్రభుదేవా హీరోగా నటించిన ‘రాసయ్య’ సినిమాలో ‘మస్తానా.. మస్తానా’ పాట ద్వారా పూర్తిస్థాయి గాయనిగా మారారు. తక్కువ పాటలే పాడినా గుర్తుండిపోయే పాటలను ఆలపించారు. తన తండ్రి ఇళయరాజా, సోదరులు కార్తిక్, యువన్‌ల సంగీత దర్శకత్వంలో ఎక్కువగా పాడిన ఆమె సిర్పి, దేవా, హారిస్ జైరాజ్ వంటి వారి సారథ్యంలోనూ పాటలు పాడారు. తెలుగులో వంశీ గారి దర్శకత్వంలో వచ్చిన ‘అనుమానాస్పదం’ సినిమాలో ‘రేల రేల రేల.. రెక్కి రెక్కి రేల’ పాటతో తెలుగు వారికి పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘గుండెల్లో గోదారి’ సినిమాలో ‘నను నీతో నిను నాతో కలిపింది గోదారి’ పాటతో తెలుగులో పేరు పొందారు. ఆమె పాడిన తెలుగు పాటలు ఈ రెండే కావడం విశేషం.
Ads
… 2002లో నటి రేవతి దర్శకత్వం వహించిన ‘మిత్ర్ మై ఫ్రెండ్’ అనే భారతీయ ఆంగ్ల సినిమాకు భవతారిణి సంగీత దర్శకత్వం వహించారు. 2003లో ‘అవునా’ అనే తెలుగు సినిమాకూ ఆమె సంగీతం అందించారు. ఆ తర్వాత 10 సినిమాలకు సంగీత దర్శకురాలిగా పని చేశారు. శిల్పా శెట్టి, సల్మాన్ ఖాన్ నటించిన ‘ఫిర్ మిలేంగే’ సినిమాలో రెండు పాటలకు ఆమె సంగీతం అందించారు. అమితాబ్ బచ్చన్ నటించిన ‘పా’ సినిమాలో భవతారిణి పాడిన ‘గుమ్ సుమ్ గుమ్.. గుమ్ సుమ్ హొ క్యూ తుమ్’ పాట ఆమెకు బాలీవుడ్‌లోనూ పేరు ప్రఖ్యాతలు అందించింది.
…. అడ్వర్‌టైజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆర్.శబరిరాజ్‌ను భవతారిణి వివాహం చేసుకున్నారు. కొన్నేళ్ల నుంచి ఆమె క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్నారు. దాన్నుంచి కోలుకొని ఈనెల 27, 28 తేదీల్లో కొలంబోలో ఒక షోలో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేశారు. ఇంతలోనే ఇలా జరిగింది. ఒక గొప్ప గాయని, సంగీత దర్శకురాలి ప్రయాణం ఆగిపోయింది.
‘గుండెల్లో గోదారి’ సినిమాలో భవతారిణి పాడిన పాట అందరికీ గుర్తే! అందులోని లైన్లు ఇలా ఉంటాయి.
‘ఏమౌతావో నాకు నువ్వు.. ఏమౌతానని నీకైనా నేను
అందించావు ఈ కొలువు.. నీ చెలిమై నే మళ్ళీ పుట్టాను’
నిజంగా అలాగే వచ్చి, తన కొలువు పూర్తి చేసి హఠాత్తుగా లోకం దాటి దూరమైపోయారామె. ఆమెకు నివాళి.
No RIPs or Rest in Peaces Please. Express any other words… – విశీ
Share this Article