‘‘ప్రశ్నించాల్సిన చోట, ప్రశ్నించే స్థోమత ఉన్నచోట… ఒక తప్పు జరుగుతున్నప్పుడు ప్రశ్నించకుండా నిశ్శబ్దంగా ఉండిపోవడం… ఒక తప్పుకు రహస్య సమ్మతి తెలిపినట్టే… అంటే ధర్మానికి ద్రోహం చేసినట్టే… ద్రోహం అంటే తప్పు… తప్పు అంటే నేరం… మరి నేరానికి శిక్ష తప్పదు కదా…’’ Silence is connivance.. Connivance is betrayal.. Betrayal is sin.. Sin is a punishable offence…… మనం బతుకుతున్న వాతావరణంలో మనకు నచ్చని అనేకానేక మౌనాల్ని గమనిస్తున్నప్పుడు ఇలా ఎప్పుడైనా అనిపించిందా..? ఇది ఎవరో కాదు అన్నది… శ్రీకృష్ణుడు..!
అవును, మహాభారతంలో మనకు అనేక పాఠాల్ని నేర్పే అనేకాంశాలు… కొన్ని ప్రక్షిప్తాలు కావచ్చు, కొన్ని మూలకథలో ఉన్నవే కావచ్చు… కొన్ని అలా మనస్సులో ముద్రవేసేస్తాయి… ఆత్మచింతనలో పడేస్తాయి… అందులో ఒకటి భీష్ముడికి కృష్ణుడికీ నడుమ జరిగిందని చెప్పబడే సంభాషణ… పైన మనం చదివిన కొటేషన్ సి.రాజగోపాలాచారి రాసిన మహాభారతంలో కనిపిస్తుంది…
Ads
కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడిని నిలువరించలేక… కృష్ణుడు శిఖండిని ముందు నిలిపి, ఆయన్ని అస్త్రసన్యాసుడిని చేసి, ఆ తరువాత అసంఖ్యాక బాణాల్ని ఆయన దేహంలో నాటిస్తాడు… ఇచ్ఛామరణం వరమున్న భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం కోసం, శరశయ్యపై అలా నిస్త్రాణగా పడుకుని, నిరీక్షిస్తూ ఉంటాడు… ఇది అందరికీ తెలిసిన కథే కదా…
చీకటి, ఒంటరితనం, నీరసం, ఎటూ కదల్లేని దైన్యం, చావుకై నిరీక్షణ… దైహికమైన నొప్పి, మానసికమైన నొప్పి… చుట్టుముట్టే జ్ఞాపకాలు… అదొక నరకం… వెంటనే ప్రాణం వదిలేస్తే బాగుండేదనిపించే దురవస్థ… ఓ రాత్రి ఎవరో వస్తున్న చప్పుడు… కళ్లను అటువైపు కూడా తిప్పి చూడలేడు… ఆ ఆకారం సమీపించింది… మసకగా మసకగా కనిపించి, తరువాత స్పష్టంగా… ఒక వెలుగు… తను కృష్ణుడు… భీష్ముడి కళ్లలో ఆశ్చర్యం… ఆనందం…
పితామహా.., వందనం
కృష్ణా.., నాది ఎంతటి దురవస్థో గమనించావా..? ప్రత్యభివాదం చేయడానికి కూడా చేతులు కదలవు… చిన్నవాడివైనా లోకం దేవుడిగా కీర్తిస్తున్న ప్రతిభావంతుడివి, ప్రభావశీలివి, ప్రభాశీలివి… జీవితంలో మొదటిసారి కళ్లల్లో నీళ్లు ఆగనంటున్నవి కృష్ణా… చిన్నవాడివి, సంపూర్ణ ఆయుష్మాన్‌భవ అని నిన్ను దీవించనా..? నా ఆయుష్షు సత్వరం తీసేసుకో, ఇక ఈ జీవితం చాలు అని ప్రార్థించనా..?
ఉత్తరాయణ పుణ్యతిథి కోసం అడిగింది నువ్వే, ఆగిందీ నువ్వే… అప్పుడే అప్పగింతలా వసువూ…
అర్థం కాలేదు కృష్ణా… నువ్వు నాకెప్పుడూ పూర్తిగా అర్థం కాని ప్రహేళికవే… కానీ ఈ కొత్త సంబోధన ఏమిటి..?
నువ్వు కారణజన్ముడివి భీష్మాచార్యా… నీ పుట్టుక రహస్యం నాకు, వ్యాసుడికి మాత్రమే తెలుసు… అష్టవసువులూ శాపవశాత్తూ భూమ్మీద పుట్టాల్సి వచ్చింది… నువ్వు తప్ప అందరూ పుట్టగానే గంగలో నిమజ్జనమై, ఊర్ద్యలోకాలకు వెళ్లిపోయారు… వారిలో నువ్వు మాత్రమే ఒక జీవితకాలాన్ని శిక్షగా జీవించాల్సి వచ్చింది…
నమో నమః కృష్ణా… ధన్యుడిని… అంతిమ ఘడియల్లోనైనా ఓ సంతోషం… శిక్షాకాలం పూర్తయినందుకు… ఇక వెళ్లిపోతున్నందుకు… కానీ ఒక్క ప్రశ్నకు బదులు చెబుతావా కృష్ణా..?
అడగండి పితామహా… ఈలోకంలో నేను గౌరవించే అతికొద్దిమంది ధర్మవర్తనుల్లో నువ్వూ ఉంటావు…
నేను వసువును… కారణజన్ముడిని… ధర్మవర్తనుడిని… నా జీవితకాలంలో ఏ ఒక్క స్త్రీ పట్ల అమర్యాదగా ప్రవర్తించలేదు… రాజ్యాన్ని త్యాగం చేశాను… ధర్మమని నేను భావించిన ఏచోట కూడా బీరువై పారిపోలేదు, నిలబడ్డాను… ఈ విశ్వంలో ఎదురులేని యుద్ధవీరుడు, నా గురువు పరుశురాముడిని కూడా ఎదిరించాను అంబ విషయంలో… నేను ఒక కోటగోడ… నేను లేక కురువంశం లేదు, ఆర్యావర్తం అజేయంగా లేదు… జీవితంలో ఏ క్షణమూ కన్నీరు పెట్టలేదు నేను… గౌరవాన్ని, హుందాతనాన్ని వదులుకోలేదు… ధర్మాలు తెలిసినవాడిని, తప్పనివాడిని… మరి నాకెందుకీ నరకం కృష్ణా… ఈ చీకటి, చావుకై ఈ నిరీక్షణ, నొప్పులు, తెల్లారితే చాలు యుద్ధబీభత్సాలు, ధ్వనులు, ఏడుపులు… శవాల వాసన… నెత్తుటి వాసన… రాత్రిళ్లు పైన తిరిగే గద్దల్లో ఏదో ఒకటి నా నెత్తుటి వాసన పట్టుకుని వచ్చి పీక్కున్నా, నేను అదిలించలేని దురవస్థలో ఉన్నాను… ధర్మాచరణకు ఈ శిక్ష ఏమిటి కృష్ణా..? ఎలా బతికాను- ఎలా వెళ్లిపోతున్నాను…?
నీ మాటలన్నీ అక్షరసత్యాలే భీష్మాచార్యా… కానీ ఒక్కచోట… ఒక్కసారి… నువ్వు నేరసమానమైన మౌనాన్ని ఆశ్రయించావు… అందుకే ఈ శిక్ష… అది చెప్పడానికే ఒంటరిగా వచ్చాను నేను… నేను నిన్న పది మంది ఎదుటా తూలనాడలేను…
నేనా..? నేరమా..? అదెలా కృష్ణా..?
నువ్వు చెప్పావు కదా, జీవితంలో ఏ ఒక్క స్త్రీ పట్ల అమర్యాదగా ప్రవర్తించలేదు అని… కానీ ఓ స్త్రీ మర్యాద మంటగలుస్తుంటే మౌనంగా ఉన్నావు భీష్మా… నిండు సభలో దుశ్శాసనుడు ద్రౌపదిని వివస్త్రను చేస్తుంటే, నిన్ను కాపాడాల్సిందిగా ద్రౌపది పదే పదే వేడుకుంది… రోదించింది… నా మానాన్ని, నా అభిమానాన్ని కాపాడు తాతా అని ప్రార్థించింది… కానీ నువ్వు ఏం చేశావు..? తలతిప్పేసుకున్నావు… అది ఒక తప్పుకు రహస్య సమ్మతి కాదా భీష్మా…? నువ్వు కన్నెర్ర చేస్తే ఆ సభలో ఒక్కడైనా కిక్కుమనేవాడా..? నీ స్థాయి, నీ వయస్సు, నీ పెద్దరికం, నీ ధర్మవర్తన, నీ యుక్తాయుక్త విచక్షణ ఏమయ్యాయి..?
నీ అభియోగాన్ని అంగీకరిస్తున్నాను కృష్ణా… కానీ పట్టాభిషిక్తుడైన రాజు సింహాసనంలో ఉన్నప్పుడు, నేనెప్పుడూ అధికారాన్ని చేతుల్లోకి తీసుకుని తీర్పులు చెప్పలేదు, చెప్పడం కూడా ధర్మం కాదు… అది నీకూ తెలుసు కదా కృష్ణా…
కాదు, నీ మౌనం ఓ పరోక్ష అంగీకారం అయ్యింది అక్కడ… అది ద్రోహం.., ద్రోహం నేరం.., నేరానికి శిక్ష… ఇదుగో ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న నరకం అదే… నువ్వు అనామకుడివి అయితే నీ మౌనానికి అసహాయతో, భయమో కారణమని భావించవచ్చు… కానీ నువ్వు తప్పును తప్పు అని చెప్పే స్థితిలో ఉన్న సర్వోన్నతుడివి అక్కడ… భీష్మా, నిన్ను పరిహసించడం కాదు గానీ… నీకన్నా యుయుత్సు నయం, తప్పు అన్నాడు… ఒక దాసి కొడుకు… ఆ తల్లి తన కొడుకుకు ధర్మమే కాదు, ధైర్యాన్ని కూడా నేర్పింది… వికర్ణుడు నీతో పోలిస్తే ఎంత..? తప్పు అన్నాడు… మరి నువ్వేం చేశావు..? వాళ్లతో పోలిస్తే నువ్వెంతకు దిగజారిపోయావు..? నీ ధర్మం, నీ వీరం, నీ జ్ఞానం ఏమయ్యాయి..?
కృష్ణా, నా దగ్గర సమాధానం లేదు… నువ్వు వచ్చావుగా, వస్త్రాలు ఇచ్చి ఆమె గౌరవాన్ని కాపాడావు, కానీ నువ్వూ ఆ తప్పుకు ఎవరినీ దండించలేదు, నువ్వు చక్రం చేతపడితే నిన్ను ఎదిరించేవాడెవ్వడు అక్కడ..? ఎందుకు ఉపేక్షించావు…
ఆలస్యంగా వచ్చాను పితామహా… నేను అలౌకిక అనుబంధం కలిగిన అతికొద్ది మందిలో ద్రౌపది కూడా ఉంటుంది… ఆమెకు జరిగిన అవమానం నన్నెప్పుడూ కలిచివేస్తూనే ఉంది… మౌనంగా ఉండిపోయిన నిన్ను ప్రశ్నించాలని ఎప్పుడూ అనుకునేవాడిని… అది తప్ప నీ బతుకంతా ధర్మమే… అదీ నాకు గౌరవం, అదే నన్ను కట్టేసింది… ఇప్పుడైనా నీ తప్పు నీకు చెప్పాలి, నీ పుట్టుక రహస్యమూ చెప్పాలి అనుకుని ఇలా వచ్చాను… ఇక సభలో నేను ఎవరినీ ఎందుకు శిక్షించలేదు అన్నావు కదా… తమ భార్యకు జరిగిన అవమానానికి ఆ భర్తలే బదులు తీర్చుకోనీ… ఇన్నేళ్లుగా తమ ఆయుధాలకు పగతో, కసితో పదును పెట్టుకుంటున్నారు… జరగాల్సినప్పుడే జరగాలి ఏదైనా… ఇప్పుడు జరుగుతున్నది అదే…
ఇప్పుడు నేను ప్రాయశ్చితమూ చేసుకోలేనుగా కృష్ణా… అనుభవించాల్సిన శిక్షను అనుభవించడమే దానికి నిష్కృతి…
ఇక అక్కర్లేదు భీష్మా… అదుగో సూర్యోదయం కావొస్తున్నది… నువ్వు కోరిన పుణ్య తిథిలోకి ప్రవేశించాం… ఇక వెళ్లు… నీ శిక్షాకాలం కూడా పూర్తయింది… వీడ్కోలు పితామహా…
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
Share this Article