.
భోగి… మూడు రోజుల సంక్రాంతి పండుగలో తొలిరోజు… తెలంగాణలో భోగి మంటలు అనే అంశానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు… ఆంధ్రా మూలాలున్న వాళ్లు తప్ప..! (ఈమధ్య కొందరు పిడకలతో భోగి మంటలు వేస్తున్నారు, కానీ తక్కువే…)
కాకపోతే ఇంట్లో చిన్న పిల్లలుంటే… భోగి పళ్లు పోస్తారు… కొన్నిచోట్ల బోడ పళ్లు అంటారు… హిందూ సాంప్రదాయంలో సంక్రాంతి పండుగలో భాగంగా ‘భోగి’ రోజున చిన్న పిల్లలకు భోగి పళ్లు పోయడం ఒక అందమైన ఆచారం…
Ads
పిల్లలు కదా, మురిపెంగా ఇంట్లో పొద్దున లేదా సాయంత్రం ఓ చిన్న వేడుకలాగా చేస్తారు…

ఏ వయస్సు పిల్లలకు పోయాలి?
సాధారణంగా పుట్టినప్పటి నుండి 5 ఏళ్ల లోపు పిల్లలకు భోగి పళ్లు పోస్తారు… కొన్ని ప్రాంతాల్లో 12 ఏళ్లు వచ్చే వరకు (బాల్యం ముగిసే వరకు) కూడా ఈ వేడుకను జరుపుకుంటారు… మన ఇష్టం…
ఎందుకు పోయాలి? (కారణం)
దీని వెనుక ఆధ్యాత్మిక, ఆరోగ్యపరమైన కారణాలు ఉన్నాయి….
-
దిష్టి తగలకుండా…: చిన్న పిల్లలకు ఇతరుల దృష్టి (దిష్టి) తగలకుండా, వారిపై ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోవాలని ఈ ఆచారం పాటిస్తారు…
-
శ్రీమన్నారాయణుని ఆశీస్సులు…: రేగు పళ్లను ‘బదరీ ఫలాలు’ అంటారు… నారాయణుడు బదరీ వృక్షం వద్ద తపస్సు చేశాడని పురాణాలు చెబుతాయి… అందుకే ఈ పళ్లను పిల్లల తలపై పోయడం అంటే ఆ దేవుడి ఆశీస్సులు అందడమేనని భావిస్తారు…
-
ఆరోగ్యం…: శీతాకాలంలో వచ్చే మార్పుల వల్ల పిల్లలకు రోగనిరోధక శక్తి పెరగాలని, వారు నిండు నూరేళ్లూ ఆరోగ్యంగా ఉండాలని దీవిస్తారు…
ఎలా పోయాలి? (పద్ధతి)
భోగి రోజు సాయంత్రం వేళ ఈ వేడుకను నిర్వహిస్తారు…
-
సిద్ధం చేసుకోవడం…: రేగు పళ్లు, చిల్లర నాణేలు, చెరుకు గడ ముక్కలు, బంతి పూల రెక్కలు, అక్షింతలను ఒక గిన్నెలో కలిపి ఉంచుకోవాలి…
-
అలంకరణ…: పిల్లలకు కొత్త బట్టలు వేసి, దిష్టి చుక్క పెట్టి, పీటపై కూర్చోబెట్టాలి…
-
ప్రక్రియ…: ఇంట్లోని ముత్తైదువులు లేదా పెద్దవారు ఆ మిశ్రమాన్ని తీసుకుని పిల్లల తల చుట్టూ మూడు సార్లు దిగదుడిచి, తలపై నుండి పోయాలి…
-
హారతి…: పళ్లు పోసిన తర్వాత పిల్లలకు కర్పూర హారతి ఇచ్చి ‘భోగి’భాగ్యాలతో ఎదగాలని ఆశీర్వదించాలి….

చిన్న సూచన…: రేగు పళ్లను శుభ్రంగా కడిగి, పుచ్చులు లేకుండా చూసుకోవాలి… అలాగే పిల్లల తలకి దెబ్బ తగలకుండా నాణేలు మరీ బరువుగా లేకుండా చూసుకోవడం మంచిది…
ఎలాగూ భోగి నాటికే సకినాలు గట్రా రెడీ అయిపోతాయి కదా… సకినాలే కాదు, గరిజెలు (కజ్జికాయలు), అరిశెలు, నువ్వుల ముద్దలు, పల్లీల ముద్దలు, పేలాల ముద్దలు, పుట్నాల ముద్దలు సరేసరి… ఇవి చాన్నాళ్లు నిల్వ ఉంటాయి…
గరిజెల్లో కూడా కోవా గరిజెలు, బెల్లం గరిజెలు, పిండి గరిజెలు… చాలామంది వీటితోపాటు అప్పాలు, మురుకులు కూడా చేస్తారు… సంక్రాంతి రోజు కోసం చేసుకునే వంటకాలు వేరు… అవి తరువాత చెప్పుకుందాం… (కొందరు సింపుల్‌గా మిర్చి బజ్జీలు, పకోడీలతో మమ అనిపించేస్తున్నారు…)

సకినాలు తెలంగాణ స్పెషల్… పిండిలో జిలకర్ర, నువ్వులు వేసి… గుండ్రంగా సకినాలు వేయడం ఓ ఆర్ట్… అందరికీ రాదు… మాంచి పల్లీల నూనెలో గోలిస్తే దాని రుచే వేరు… కాకపోతే ఇప్పుడు పల్లీ నూనె వాడటం బాగా తగ్గిపోయింది… కొలెస్ట్రాల్, అధిక ధరల భయం… (కొందరు కారం సకినాలు చేస్తున్నారు కానీ వితవుట్ కారమే టేస్టీ…)
దాన్ని తినడం మరో పెద్ద కళ… ఆవకాయ (సోగి)తో… ఆవకాయ ప్లస్ గడ్డ పెరుగు కాంబో… అల్టిమేట్ అంటే ఆవకాయ ప్లస్ ముద్దపప్పుతో… కొందరు టీలో ముంచి తింటారు… భోజనంలోకి ఆధరువుగా ఎక్కువ మంది… ఆల్కహాలికులు సరేసరి… చింతకాయ తొక్కు ప్లస్ పప్పు మరో సూపర్ కాంబో…

ఈమధ్య చాలామందికి ముద్దలు చేయడమే రావడం లేదు అసలు… మామూలు బెల్లం కాదు, కటిక బెల్లం లేదా గట్టిబెల్లం అని దొరుకెుతుంది… దాంతో చేస్తే చాన్నాళ్లు గట్టిగా, విచ్చుకుపోకుండా ఉంటాయి… మధుమేహులకు కూడా ఇవి నిషిద్ధం కాదు, పరిమితంగా ఉంటే… ఎందుకంటే..? పల్లీలు, నువ్వులు, పుట్నాలు ఆరోగ్యదాయకాలే… బెల్లం ఉంటుంది కాబట్టి పరిమితమే అవశ్యం…

అన్నట్టు... అరిశెల పైన నువ్వులు కాదు, ఈసారి గసగసాలు చల్లి చూడండి... ఆ మత్తు, ఆ గమ్మత్తు వేరు..! ఆ రుచే వేరు... చక్కెర బదులు బెల్లం వాడి చూడండి..!!
Share this Article