చిరంజీవి అంటే తెలుగు సినిమాలో ట్రెండ్ సెట్టర్… తను తెరపై కనిపిస్తే చాలు కాసుల వర్షమే… అలాంటిది చిరంజీవి మరో నటుడిని అనుకరించడమా..? అదీ తన తమ్ముడిని..! అంటే తన పని ఐపోయిందని తనే అనుకుంటున్నాడా..? ఒక సినిమాలో ఎవరో హిందీ హీరో కావల్సి వచ్చాడు… ఆమధ్య రవితేజ కావల్సి వచ్చాడు… మరో సినిమాలో కొడుకు కావల్సి వచ్చాడు… తను ఒంటి చేత్తో సినిమాను మోసే రోజులు పోయాయా..?
ఏమండీ చిరంజీవి గారూ… రజినీకాంత్ అజిత్‌ను ఇమిటేట్ చేయడు… లేదా విజయ్‌ను కూడా ఇమిటేట్ చేయడు… అమితాబ్ బచ్చన్ షారూక్ ఖాన్‌ను ఇమిటేట్ చేస్తాడా..? చేయడు కదా… మరి మీరేమిటి ఇలా..? ఎందుకు చేస్తున్నట్టు..? ఫ్యాన్స్ కోసమా..? పవన్ ఫ్యాన్స్ ఈలల కోసమా..? అంటే చిరంజీవి సొంతంగా ఈలలు వేయించలేడా..? మిమ్మల్ని మీరే ఎందుకు తగ్గించుకుంటున్నారు..?
అన్నింటికీ మించి ఖుషి సినిమాల పవన్ కల్యాణ్, భూమిక నటించిన అత్యంత పాపులర్ ‘నాభి చూసే’ సీన్‌ను ఇందులో రీక్రియేట్ చేయడం ఎందుకో నచ్చలేదు… పైగా చిరంజీవి, శ్రీముఖి ఈ సీన్‌లో ఏదో జబర్దస్త్ షో స్పూఫ్‌లా కనిపించారు… అసలే శ్రీముఖి, పైగా చిరంజీవితో… ట్రాజెడీ… పైగా సరిగ్గా సినిమా విడుదలకు ముందు హీరోల రెమ్యునరేషన్ల మీద, తను ఇండస్ట్రీ కార్మికుల కోసమే సినిమాలు చేస్తున్నాననే వివాదాస్పద వ్యాఖ్యలు, ప్రకటనలు దేనికి..?
Ads
భోళా శంకర్ సినిమా తమిళ బ్లాక్ బస్టర్ ‘వేదాళం’ సినిమాకు రీమేక్ అనే సంగతి అందరికీ తెలుసు… తమిళ, మలయాళ ఒరిజినల్స్‌ను మనవాళ్లు రీమేకుల పేరిట పక్కా ఇమేజీ బిల్డప్పుల రొడ్డకొట్టుడు సినిమాలుగా మార్చేస్తున్నారు… ఇదీ అంతేనా కాదా తరువాత సంగతి… టైటిల్స్ క్రెడిట్స్ సమయంలో “కథ డెవలప్‌మెంట్ – మెహర్ రమేష్” అని ఉంది. మెహర్ కథను ఏం అభివృద్ధి చేశాడో ఏమిటో గానీ… ఇంటర్వెల్ తరువాత, క్లైమాక్స్‌లో ఆ పది నిమిషాలు తప్ప దర్శకుడు చాలావరకు చిరంజీవి మార్క్ సినిమా తీయడంలో ఫెయిలే…
ఐనా ఏం డెవలప్ చేసినట్టు..? కథను, కథనాన్ని, ప్రేక్షకుల్ని, చిరంజీవిని కనీసం రెండు దశాబ్దాల వెనక్కి నడిపించాడు… డైలాగులు, పాటలు, పిక్చరైజేషన్, ఇమేజీ ఎలివేషన్స్ అన్నీ అంతే… సెకండాఫ్ కాస్త నయం… ఫస్టాఫ్ అయితే చిరంజీవి ఫ్యాన్స్‌కు కూడా నిరాశే… కీర్తిసురేష్ అనేక సన్నివేశాల్లో గందరగోళానికి గురైంది… ఆ మహానటి ఈమేనా..? చివరకు తను బలంగా పర్‌ఫామ్ చేయగలిగిన ఎమోషనల్ సీన్స్‌లో కూడా అంతా అయోమయ ముద్ర… తమన్నా ఉందంటే ఉంది… అక్కడక్కడా నేనూ ఉన్నానని కనిపిస్తుంది… అంతే…
చిరంజీవి గారూ, మళ్లీ మీరు దర్శకుడిదే తప్పు అని ముద్ర వేయకండి… నిజానికి ఆయనకు అంత సీన్ లేదు… ఆయన పాత సినిమాల ఫలితం చూసీ మీరే ఎందుకు చాన్స్ ఇచ్చినట్టు…? పైగా తనకు నచ్చినట్టుగా సినిమాను డైరెక్ట్ చేసే స్వేచ్ఛ కూడా మీ సినిమాల్లో దర్శకుడికి ఉండదు… సో, తమిళ జైలర్‌కూ, తెలుగు భోళాశంకర్‌కూ నడుమ ఒక్కరోజు గ్యాప్‌తో మొదలైన పోరాటంలో తమిళ రజినీకాంతుడిదే పైచేయి…!! (ఇది యూఎస్ నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్, ఇండియన్ హెరాల్డ్ రివ్యూ ఇన్‌పుట్స్ ఆధారంగా రాయబడింది…)
Share this Article