Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అది అన్నమే అన్నాడు కానీ అన్నమో కాదో… టీలాగే ఉంది గానీ అదో కాదో…

April 16, 2023 by M S R

“మరలనిదేల రామాయణంబన్నచో
నీప్రపంచక మెల్లనెల్ల వేళ
దినుచున్న యన్నమే దినుచున్న దిన్నాళ్ళు
తనరుచి బ్రతుకులు తనవిగాన…”
అని రామాయణ కల్పవృక్షం ముందుమాటలో విశ్వనాథ సత్యనారాయణ గొప్పగా సూత్రీకరించారు. రోజూ అదే అన్నమే తింటున్నా… విసుగు పుట్టదు. ఏ పూటకాపూట ఆ అన్నం కోసమే ఎదురు చూస్తాం.

హైదరాబాద్ నుండి వెస్ట్ బెంగాల్ సరిహద్దు దగ్గర బాగ్ డోగ్రాకు విమానమెక్కి, బాగ్ డోగ్రా నుండి నాలుగు గంటలు కారులో ప్రయాణించి భూటాన్ సరిహద్దు నగరం ఫుషిలాంగ్ చేరి, రాత్రి అక్కడే బసచేసి పొద్దున రోడ్డు మార్గంలో కొండాకోనలూ, లోయలు, నదులు, వంతెనలు దాటుతూ… నాలుగు గంటలు ప్రయాణించి…భూటాన్ రాజధాని థింపూ చేరాము. చేరేసరికి మధ్యాహ్నం ఒంటి గంట. ఫుషిలాంగ్ లో పొద్దున ఏడు గంటలప్పుడు తిన్న పిడికెడు అటుకులు. థింపూ ఊరి మధ్యలో నక్షత్రాలు తలదాల్చిన హోటల్. రూము కంటే ముందు అన్నమో భూటాన్ చంద్రా! అని ఆకలి అరుపులు అరిచాము. ప్రధాన వంటలయ్య (చీఫ్ చెఫ్)ను మా ముందు ప్రవేశపెట్టారు.

అన్నం తినడమే తప్ప అన్నం వండడం తెలియని మనకు… అన్నం ఎలా వండుతారో అతడు వివరించి చెప్పాడు. “అన్న జ్ఞానం మీద ఎంత చర్చించినా ఆకలి తీరదు” అని కొడవటిగంటి కుటుంబరావు చెప్పిన విషయం గుర్తొచ్చి… శాకాహారంలో ఏమి వండగలవు నాయనా? అని దీనంగా అడిగాము. బాయిల్డ్ బ్రౌన్ రైస్, మిక్స్ డ్ వెజిటబుల్ కర్రీ తప్ప ఇంకేమీ కుదరదన్నాడు. భూటాన్ వంటల్లో ఏదయినా ఒక వెజిటేరియన్ కర్రీ చేస్తానన్నాడు. అన్నానికి ఆర్డర్ ఇచ్చినట్లుగా కాకుండా… భారత్- భూటాన్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి రాయబారుల శిఖరాగ్ర చర్చల్లా అనిపించింది నాకు!

Ads

గౌరవంగా తలవంచి అభివాదం చేసి నవ్వుతూ వెళ్లిన ప్రధాన వంటలయ్య మా ఆకలి మాడి మసై… కళ్లు తిరిగి పడిపోతామేమో అనుకునే క్షణాన తన అప్రధాన వంటగత్తెల చేత పదార్థాలు పంపాడు. రాగి సంకటి లాంటి బాయిల్డ్ బ్రౌన్ రైస్, ఉడికీ ఉడకని కూరలకు ఉప్పు వేసి ఇచ్చిన రెండు వెజిటబుల్ కూరలు.

“రుచికరమయినవన్నీ ఆరోగ్యకరం కాకపోవచ్చు;
ఉప్పు, కారం, రుచిలేని వాటిలో అంతులేని ఆరోగ్యం దాగి ఉండవచ్చు”
అని ఒక మిల్లెట్ ఫుడ్ నిపుణుడు చెప్పిన మాటను గుర్తు చేసుకుని… రెండు ముద్దలు తిన్నాము. ఇక తినలేక ఏమన్నా పచ్చడి ఉందా అని ప్రాధేయపడ్డాము. మిక్స్ డ్ వెజిటబుల్ పచ్చడి తెచ్చి పెట్టారు. బహుశా అది రెడీ మేడ్ అయి ఉంటుంది. పెరుగు ఉందా? అంటే భూటాన్ లో పెరుగు తినము కదా? అన్నారు. పచ్చడి మెతుకులు తిని… కివి ఫ్రూట్ జ్యూస్ తాగి… అన్నం అయ్యిందనిపించాం.

సాయంత్రం సింప్లి భూటాన్ ప్రదర్శనకు వెళితే… అతిథి మర్యాదల్లో భాగంగా భూటాన్ ప్రజలు అత్యంత ఇష్టంగా పదే పదే తాగే “సుజా చాయ్” ఇచ్చారు. వెన్నతో చేసే టీ కాబట్టి జిడ్డుగా ఉంది. కొంచెం ఉప్పు, మసాలా కూడా ఉన్నట్లుంది. పాలు కలపరు. సూపులా ఉంది.

పేరు అన్నమే.
అది అన్నం అవునో కాదో నాలుక చెప్పుకోలేదు.
పేరు టీ.
అది టీ అవునో కాదో కడుపు చెప్పుకోలేదు.

రోజూ తినే అన్నమే తినాలని విశ్వనాథవారు ఎందుకు అంత బలంగా చెప్పారో ఇలాంటప్పుడు అనుభవంలోకి వస్తూ ఉంటుంది!

“అన్నం పరబ్రహ్మ స్వరూపం” అని నిర్ణయించింది శాస్త్రం.
పరబ్రహ్మను పట్టుకోవడం అంత సులభమయిన పని కాదు.
ఇల్లు వదిలి బయటపడితే ఆ పరబ్రహ్మం ఒక పట్టాన దొరకడు!
భూటాన్ లాంటి చోట్ల దొరికే అన్నంలో పర(ఇతర)బ్రహ్మం ఉంటాడేమో!

-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com

అన్నం పరబ్రహ్మ స్వరూపం

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions