.
తొలుత సీనియర్ జర్నలిస్టు Bhandaru Srinivas Rao పోస్టు ఓసారి చదవండి…
ప్రతి నాలుగు లేదా అయిదేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించడం ఒక్కటే కాదు. ప్రజాస్వామ్య స్పూర్తి ఉన్నప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి జరిగిన ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆ స్పూర్తి కొట్టవచ్చినట్టు కనబడింది.
Ads
ఈరోజు పొద్దున్నే మూడు నాలుగు పత్రికలు చూశాను. టీవీలో కనపడ్డ ఆ దృశ్యాలు, నేను తిరగేసిన ప్రధాన పత్రికల్లో కానరాలేదు. ట్రంప్ అమెరికా నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అంతకు నిమిషం ముందు వరకు అధ్యక్షుడిగా వున్న బైడన్, ఉపాధ్యక్షురాలిగా వున్న కమల హారిస్ పక్కనే ఆసీనులయి కనిపించారు.
ట్రంక్ తనదైన శైలిలో పూర్వపు ప్రభుత్వాన్ని, దాని విధి విధానాలను తూర్పారపడుతూ ప్రసంగిస్తున్నా, వారిద్దరూ చాలా నిగ్రహంతో, హుందాగా ఆ ప్రసంగాన్ని మౌనంగా ఆలకించారు. అంతే కాదు, ఒక సందర్భంలో సభికులు అందరూ నిలబడి హర్షధ్వానాలు చేస్తున్నప్పుడు,వారిద్దరూ కూడా లేచి నిలబడి చేతులు చరిచారు.
ప్రజాస్వామ్య స్పూర్తికి కొలమానం అయిన ఈ దృశ్యాల ఫోటోలు నాకు ఈరోజు పత్రికల్లో ఎక్కడా కనిపించలేదు.
నిజంగా ట్రంపు ప్రమాణానికి సంబంధించిన అన్ని ఫోటోలోకెల్లా ఈ ఫోటో బాగనిపించింది… ప్రమాణ స్వీకారానికి వచ్చే ట్రంపు (78), ఆయన భార్య మెలానియా (54)కు వైట్ హౌజ్ నుంచి వైదొలుగుతున్న బైడెన్ (82), ఆయన సతీమణి జిల్ బైడెన్ (73) (నిన్నటివరకూ ఫస్ట్ లేడీ) దంపతులు రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు…
తేనీటి విందు ఇచ్చారు… తెలుగింటి అల్లుడు వాన్స్ కు, తెలుగింటి తొలి సెకండ్ లేడీ ఉషకు తమిళ కమల హారిస్ స్వాగతం పలికింది… ఈ స్వాగతాల అనంతరం వైట్ హౌజ్ నుంచి కేపిటల్ హిల్‌లో ప్రమాణానికి ఒకే వాహనంలో బైడెన్, ట్రంపు దంపతులు కలిసి వెళ్లారు…
ఒక్కసారి ఊహించండి… మన తెలుగు రాజకీయాలే కాదు, దేశంలో ఎక్కడైనా దీన్ని ఊహించగలమా..? జాతీయ స్థాయిలోనైనా సరే..! మనలో ఆ స్పిరిట్ కనిపించదు… అంతెందుకు..? రేవంత్ రెడ్డి ప్రమాణం అనంతరం ఫామ్ హౌజ్ వెళ్లిపోయిన కేసీయార్ ఎమ్మెల్యేగా ప్రమాణం కోసం తప్ప ఎప్పుడైనా జనజీవితంలో వచ్చాడా…? ఇదీ మన ప్రజాస్వామిక స్పూర్తి… జనం తీర్పును ఆమోదిస్తున్నాననే ఒక్క మాట కూడా తన నోటి నుంచి రాలేదు… జనం తీర్పును అగౌరవపరచడం అది..!
కానీ 2018లో అనుకుంటా… రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారానికి, అదీ బహిరంగసభలో… మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియా హాజరైంది… మొహం మాడ్చుకుని కాదు, ఉల్లాసంగా ప్రజలకు అభివాదం కూడా చేసింది అక్కడే… మొన్నటి ఎన్నికల తరువాత నవీన్ పట్నాయక్ కూడా సేమ్…
విభేదాలు ఎన్నయినా ఉండనీ, రాజకీయ ఘర్షణలు ఎలాగైనా ఉండనీ, పార్టీలు సంఘర్షించనీ… కొన్ని సంప్రదాయాలు, కొన్ని మర్యాదలు ఉన్నత స్థాయిలో కనిపించాలి… అదే, ఆ రాజకీయ సంస్కారమే మన సమాజంలో లోపించింది..!!
Share this Article