Sankar G…….. చిన్న నిర్మాతల పెద్ద హీరో… చంద్రమోహన్.. పెద్ద హీరోలు పూర్తి స్థాయి కామెడీ చిత్రాలు చేసేవాళ్ళు కాదు. చేసినా అవి ఆడేవి కావు. చిరంజీవి చంటబ్బాయ్, బాలకృష్ణ బాబాయ్ అబ్బాయ్, కృష్ణ నటించిన కృష్ణవతారం…. ఈ సినిమాలు ఇప్పుడు చూసినా బాగుంటాయి, కానీ అప్పుడు ఆడలేదు. పెద్ద హీరోల కామెడీ చిత్రాల కన్నా ఇతర యాక్షన్ మాస్ చిత్రాలు, లేదా సీరియస్ రోల్స్ జనాలు ఇష్టపడేవాళ్ళు.
1964 లో బియన్ రెడ్డి నిర్మించిన రంగులరాట్నం చిత్రం ద్వారా చంద్రమోహన్ పరిచయం కాబడ్డాడు. ఆ చిత్రంలో ఏదో చిన్న పాత్ర వస్తుందని వెళితే ఏకంగా హీరోగా సెలెక్ట్ కాబడ్డాడు. పైగా అప్పుడే వేషాల కోసం ట్రై చేస్తున్న కృష్ణంరాజు లాంటి ఆరడుగుల హీరోలను దాటుకుని ఆ చిత్రంలో ఎంపిక చేయబడ్డాడు. సినిమా హిట్ అయ్యింది మంచి పేరు కూడా తెచ్చుకున్నాడు.
ఆ చిత్రం తర్వాత సోలో హీరోగా అవకాశలైతే రాలేదు కానీ సపోర్టింగ్ క్యారెక్టర్స్ పుష్కలంగా వచ్చేవి. బాపు బంగారు పిచ్చుకలో హీరోగా వేసినా ఆ సినిమా ఆడలేదు.హైట్ తక్కువగా, అమాయకంగా ఉండటంతో ఎక్కువగా స్నేహితుడు, బావమరిది, తమ్ముడి క్యారెక్టర్స్ లాంటివి వచ్చేవి. గంగా మంగా, కోడెనాగు లాంటి చిత్రాల్లో విలన్ వేషాలు కూడా వేశాడు. ఇది 60, 70 ల కాలం నాటి సంగతి..
Ads
70 ల నుండి కొత్త నిర్మాతలు, చిన్న హీరోలు, కొత్త హీరోలతో చిత్రాలు నిర్మించేవారు. కుటుంబ కథా చిత్రమైతే మురళీమోహన్, రంగనాధ్, శ్రీధర్ లతో తీసేవాళ్ళు. హాస్యచిత్రాలైతే చంద్రమోహన్ ను ఎంపిక చేసునేవాళ్ళు. కె వాసు, రేలంగి నరసింహారావు, జంధ్యాల నిర్మించే హాస్య చిత్రాల్లో ఎక్కువగా నటించాడు.
1980లలో కొత్తగా ఎవరయినా చిత్ర నిర్మాణంలోకి దిగాలి అనుకునేవారు ముందుగా చంద్రమోహన్ హీరోగా చిత్రాలు నిర్మించేవారు. కారణం అతి తక్కువ బడ్జెట్ 5, 10 లక్షల్లో చిత్ర నిర్మాణం పూర్తయిపోయేది. నిర్మాతకు రెండు నుండి 5 లక్షల వరకు లాభం వచ్చేది. ఒకవేళ సినిమా అడకపోయినా పెద్ద నష్టం వచ్చేది కాదు. కారణం ఈ హీరోతో నిర్మించే చిత్రాలన్నీ హాస్య కుటుంబ కథా చిత్రాలే. పెద్దగా సెట్టింగులు, ఏక్షన్ సన్నివేశాలు ఏమీ ఉండవు. నాలుగు ఇళ్లు, ఒక ఆఫీసు, ఒక హోటల్ లేదా పార్కు ఇంతకు మించి ఏమీ ఉండవు. సంగీత దర్శకులు కూడా రాజన్ నాగేంద్ర లాంటివారు అతి తక్కువ పారితోషకానికే సంగీతం ఇచ్చేవారు. అలాగని పాటలు నాసిరకంగా ఉండేవికావు.
సిరిసిరిమువ్వ, శుభోదయం, ఇంటింటి రామాయణం, నాగమల్లి, మూడుముళ్లు, రాధాకళ్యాణం అన్నీ మ్యూజికల్ హిట్స్. అశ్వినిదత్ లాంటి పెద్ద నిర్మాత కూడా తన మొదటి చిత్రం ఓ సీత కథలో హీరోగా చంద్రమోహన్ నే ఎంచుకున్నారు. ఏడిద నాగేశ్వరరావు మొదటి చిత్రం సిరిసిరి మువ్వ లో హీరో కూడా చంద్రమోహనే..
ఇక కొత్త హీరోయిన్ల లక్కీహ్యాండ్ గా పేరు తెచ్చుకున్నాడు. జయప్రద, శ్రీదేవి, జయసుధ ఈయనతో నటించాకే అగ్ర హీరోయిన్లుగా పేరు తెచ్చుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మంచిపేరు తెచ్చుకున్నారు. డబ్బు దగ్గర చాలా పొదుపరి. శంకరాభరణం సినిమాలో నటించిందుకు తనకు ఇవ్వవలిసిన పాతిక వేలకు బదులు ఒక ప్రాంతం రైట్స్ తీసుకోమని కోరగా తనకు డబ్బే ఇమ్మని కోరారు. ఆ ప్రాంతం నుండి ఆ పారితోషకానికి 20 రెట్లు లాభం వచ్చింది.
కె విశ్వనాధ్, బాలు ఇద్దరూ చంద్రమోహన్ కు బంధువులవుతారు. విశ్వనాధ్ చిత్రాల్లో ఎక్కువగా చేయటానికి ఇది కూడా ఒక కారణం అయ్యుండొచ్చు. చివరిగా నాకు బాగా నచ్చిన చిత్రం సుఖదుఃఖాలు. అందులో SV రంగరావుతో పోటాపోటీ నటన ప్రదర్శించాడు. ఆ సినిమాలో బాలు తొలి నాళ్ళలో పాడిన మేడంటే మేడా కాదు.. గూడంటే గూడూకాదు… నాకెంతో ఇష్టమయిన పాట. నా అల్ టైం ఫెవరేట్ సాంగ్స్ లో ఒకటి.. ఇవి కాకుండా సీతామాలక్ష్మి, సిరిసిరిమువ్వ, శుభోదయం, రాధాకళ్యాణం లాంటి చిత్రాలోనూ మంచి నటన కనపరిచారు. ఈ మధ్య యూట్యూబుల్లో కొన్ని ఇంటర్యులు కూడా ఇచ్చినట్టు ఉన్నారు…
Share this Article