ప్రపంచమంతటా కరోనా భయం తగ్గిపోయింది… మొన్నమొన్నటిదాకా కేసుల సంఖ్య భయానకంగా అనిపించిన కొన్ని దేశాల్లో కూడా వ్యాప్తి అదుపులోకి వచ్చినట్టే కనిపిస్తోంది… కేసుల సంఖ్య కనిపిస్తున్నా మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది… అంటే కరోనా బలహీనపడింది అని అర్థం… కొత్త వేరియెంట్లు వచ్చినా సరే మనిషి వాటిని తట్టుకునే స్థితికి చేరుకున్నాడనే అనుకోవాలి… ఏడాది, రెండేళ్ల క్రితంతో పోలిస్తే కరోనా ఓ సాధారణ వైరస్‌లా మారిపోయింది… దాని ఉనికి ఉంటుంది, అది చావదు…
ఎటొచ్చీ చైనాలోనే వ్యాప్తి ఆగడం లేదు… అదుపు చేయడానికి చైనా పాటిస్తున్న పద్దతిలోనే లోపముందని అంటారు మరి… కరోనా అనేది భస్మాసురుడి టైపు… తనను పుట్టించిన చైనానే వణికిస్తోంది మళ్లీ… దాదాపు 26 పట్టణాలు, నగరాల్లో లాక్ డౌన్ అని వార్తలొస్తున్నాయి… ఇండియాలో కూడా ఫార్మాసురులు ఎప్పటికప్పుడు భయపెడుతూనే ఉన్నారు… అదుగో ఫోర్త్ వేవ్, వచ్చె, వచ్చె అంటూ వేక్సిన్ విక్రేతలు ఒకవైపు… ఫార్మా మాఫియా మరోవైపు… కాచుకు కూర్చున్నారు…
ఈనేపథ్యంలో ఒక వార్త ఇంట్రస్టింగ్… చదవండి…
Ads
మూడో వేవ్ వస్తుందనే అంచనాలతో భారీగా ఉత్పత్తి చేశాయి కొన్ని కంపెనీలు… వాస్తవం చెప్పాలంటే… చాలా మందులు పనిచేయనేలేదు… అనవసరంగా రోగులకు ఎక్కించారు… మస్తు రేట్లు పెంచేశారు… అనేక కంపెనీలు అర్జెంటుగా కోవిడ్ మందుల ఉత్పత్తిలో దిగిపోయాయి… ఉత్పత్తి సంస్థల లాభార్జనకు ఎన్నోరెట్లు వాటిని బ్లాక్ చేసి దళారులు రోగుల్ని నిలువునా దోపిడీ చేశారు… అనేకమంది కరోనా నుంచి కోలుకున్నా సరే ఆస్తులు అమ్ముకుని, అప్పులపాలై చిక్కిశల్యమయ్యారు… ఇప్పుడు ఆ నిల్వలు అలాగే ఉండిపోయాయి… కంపెనీలు ఆశించిన కొత్త వేవ్స్ ఏమీ రావడం లేదు, ఒకవేళ వస్తే మాత్రం ఈ ఫార్మా మాఫియాల దెబ్బకు రోగమొచ్చిన మనిషి ప్లస్ సమాజం ఇక కోలుకోవు బహుశా… ఇప్పటికే లక్షల కుటుంబాలు చితికిపోయాయి…
చౌక మందులు, మనిషిలో స్వతహాగా ఇమ్యూనిటీ పెంచే చికిత్స ప్రోటోకాల్‌కు భిన్నంగా మన కేంద్ర వైద్య, ఆరోగ్య అధికారులు కూడా చిత్ర విచిత్ర నిర్ణయాలను దేశంపై రుద్దుతూ వెళ్లారు… దేశంలో అత్యంత బలమైనది ఫార్మా లాబీయే… కాస్త నియ్యత్ ఉన్న బ్యూరోక్రాట్లు ఎవరూ ఆ శాఖలో లేని కారణంగా ‘‘పనికిరాని మందుల’’ను సైతం వేల కోట్లకు రోగులకు ఎక్కించి పారేశారు… కార్పొరేట్ హాస్పిటళ్ల దోపిడీ సరేసరి… అవి నిలువు దోపిడీ గ్యాంగులు…
కొన్ని డ్రగ్స్‌ను విదేశాలకైనా తరలించి, ఉత్పత్తి వ్యయాన్ని రాబట్టాలని కంపెనీలు ఆలోచిస్తున్నాయట… కొన్నేమో దేశంలో కేసులు పెరుగుతున్నాయి కదా, ఇక్కడే అడ్డగోలుగా అమ్మి సొమ్ము చేసుకుందామని ఆశిస్తున్నాయట… బంగారు కొండల్ని తవ్వుకున్న వేక్సిన్ కంపెనీలు కూడా ఇక ఉత్పత్తి తగ్గించేశాయి… బూస్టర్ల డోసుల పేరిట ఎంత పుష్ చేద్దామని ప్రయత్నిస్తున్నా జనంలో పెద్దగా కదలిక లేదు… సుప్రీంకోర్టు కూడా వేక్సిన్లపై నిర్బంధం చేయవద్దని ఆదేశించింది తాజాగా…
12-15 ఏళ్ల పిల్లలకు వేసే కోవావాక్స్ వేక్సిన్ ధరను ఆ కంపెనీ ఒకేసారి 900 నుంచి 225 రూపాయలకు తగ్గించింది… ఐనాసరే, వేయించుకునేవాడు లేడు… ఇక్కడ ప్రశ్న ఏమిటంటే..? 225 రూపాయలకు అమ్మినా లాభాలు వర్కవుట్ అయ్యే ఉత్పత్తిని 900 దాకా అమ్మింది ఆ కంపెనీ మొన్నమొన్నటిదాకా… ఇక 1600 దాకా అమ్మిన కంపెనీల మాటేమిటి..? ఆ వేక్సిన్లకు ఆ ధరలను ఖరారు చేసిన ఢిల్లీ పెద్దల బుద్ధిని ఏమనాలి..? తెలంగాణలో ప్రభుత్వం దగ్గర ప్రస్తుతం 40 లక్షల వేక్సిన్ డోసులు ఉంటే… ఆ నిల్వలు కదలడం లేదు… కేంద్రం వాపస్ తీసుకోదు…
చైనా మనకు శతృదేశమే అయినా సరే, అది కూడా కరోనా పీడ నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకోవాలి… దాంతోపాటు మనకు కూడా ఈ ఫార్మా మాఫియా నుంచి విముక్తి అప్పుడే… అఫ్‌కోర్స్, మరో కొత్త మహమ్మారి కోసం ఈ కంపెనీలు ప్రార్థిస్తూ ఉంటాయేమో…!!
Share this Article