Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హమ్మయ్య… నందమూరి కల్యాణరాముడికి ఎట్టకేలకు ఓ హిట్టొచ్చింది…

August 5, 2022 by M S R

ఒక్క ముక్కలో చెప్పాలంటే… చరిత్రను భ్రష్టుపట్టించిన ఆర్ఆర్ఆర్‌కన్నా… ఓ చందమామ, ఓ బాలమిత్ర తరహా కథను టైమ్ ట్రావెల్ అనే ఫార్ములాలోకి ఇమిడ్చి… గ్రాఫిక్స్‌తో భారీతనాన్ని అద్ది… కీరవాణి సంగీతంతో సానబెట్టి… పర్లేదు అనే స్థాయిలో ప్రజెంట్ చేయబడిన బింబిసార సినిమా చాలా బెటర్… ఆగండాగండి… బింబిసారుడనగానెవ్వరు అని గూగూల్‌ను చావగొట్టకండి… ఆ చరిత్ర చదవాలని చూడకండి… ఏదో పేరు బాగున్నట్టనిపించి పెట్టుకున్నారు తప్ప బింబిసారుడి చరిత్రకూ ఈ సినిమా కథకూ ఏమాత్రం సంబంధం లేదు… హిస్టారికలూ కాదు, హిస్టరీ కథా కాదు…

నిజానికి బింబిసారుడి కాలం నుంచీ సినిమాలు చేస్తున్నాడు గానీ… అంతటి ఎన్టీయార్ వారసత్వం కూడా ఉంది… ఏ నిర్మాతా దొరక్కపోతే సొంతంగా తీసిపడేసే సాధనసంపత్తి కూడా ఉంది… తీసిపారేయదగిన నటుడు కూడా కాదు… ఐనా సరే, ఇన్నేళ్ల కెరీర్‌లో ‘‘ఇదీ నా సినిమా’’ అని చెప్పుకునే గొప్ప సినిమా, బంపర్ హిట్ సినిమా తనకు ఒక్కటీ లేదు… విచిత్రమే… ఆమధ్య వచ్చిన 118 సినిమా కాస్త పర్లేదు, కానీ డబ్బులు వచ్చాయో పోయాయో తెలియదు… 9 ఏళ్ల క్రితం వచ్చిన పటాస్ కూడా పర్లేదు…

అలాంటి కల్యాణరాముడికి ఓ సూపర్ హిట్ దక్కినట్టేనా..? ఈ ప్రశ్నకు జవాబు కష్టం… ఎందుకంటే..? ఈ బింబిసార సినిమాలోనూ ప్లస్సులున్నయ్, మైనసులున్నయ్… థియేటర్లకు జనం వచ్చే రోజులు కావివి… సినిమాను ఓ మోస్తరుగా కష్టపడి తీశారు, అద్భుతమని చెప్పలేం కానీ బోరింగు కాదు… సో, వసూళ్ల తీరు వేచిచూడాలి…

Ads

తన సోదరుడి కోసం జూనియర్ ఎన్టీయార్ మరీ మరీ ఎక్కువ ప్రమోషనల్ వ్యాఖ్యలు చేస్తున్నాడు… మార్నింగ్ షో అయిపోగానే, సూపర్ బంపర్, మంచి రెస్పాన్స్ అంటూ మరో ట్వీట్ పెట్టాడు… బింబిసార పాత్రను కల్యాణరామ్ తప్ప ఇంకెవరూ చేయలేరు అన్నాడు ప్రిరిలీజ్ ఫంక్షన్‌లో… మరీ అంత లేదు… కానీ పర్లేదు… (కీరవాణి బదులు థమన్‌ను తీసుకుని, డైలాగ్స్ ఇంకాస్త పదునుపెట్టి, బాలయ్యతో గనుక ఈ పాత్ర చేయిస్తే, అఖండలా ఇంకో రేంజులో ఉండేదేమో… అఫ్‌కోర్స్, బింబిసారుడి పాత్ర మొదట్లో క్రూరమైన విలనీ కాబట్టి బాలయ్య ఒప్పుకునేవాడు కాదేమో…)

ఈ కోణంలో చూసినప్పుడు బింబిసారుడి పాత్ర చిత్రీకరణ విభిన్నంగా, ఆసక్తికరంగా అనిపిస్తుంది… కల్యాణరామ్ దీనికి ఒప్పుకోవడం బాగుంది… దర్శకుడు కూడా బాగానే హ్యాండిల్ చేశాడు… కాకపోతే పాత సినిమాల ప్రభావం బాగా ఉన్నట్టుంది దర్శకుడి మీద… ఓ క్రూరుడైన రాజు… రాజ్యాలు ఆక్రమిస్తాడు, అడ్డొచ్చినవాడిని నరికేస్తాడు, అడ్డొస్తాడేమో అనుకున్నా సరే చంపేస్తాడు… కవలసోదరుడికీ స్పాట్ పెడతాడు… పొరుగు రాజును ఖతం చేస్తాడు, సహజంగానే ఆ రాకుమార్తెని చెరపడతాడు… ఈక్రమంలో ఓ ఊరి మీద కోపమొచ్చి నాశనం చేస్తాడు… ఓ వృద్ధుడినీ, ఓ పిల్లనూ హతమారుస్తాడు… ఇక్కడ దర్శకుడు కథను మరీ ఆచార్య బాపతు పాదఘట్టం చేస్తాడేమోనని నందమూరి ఫ్యాన్స్ భయపడ్డారు గానీ ఆ తప్పు జరగలేదు… సరే, బింబిసారుడు ఓ మాయదర్పణం మీద పడి, వర్తమానంలోకి వచ్చిపడతాడు… లైన్ బాగుంది…

టైమ్ ట్రావెల్ కథలంటేనే ఫిక్షన్… దీనికి రాజుల బాపతు ఫాంటసీ కలిపారు… అసలు విలన్ వేరు, హీరో వేరు ఏమిటి… ఛస్, రెండూ మనమే అన్న తరహాలో పాత్రను రూపుదిద్దారు… ఆ క్రూరుడైన రాజు వర్తమానంలోకి వచ్చిపడ్డాక తప్పులు తెలుసుకుని సాధుజీవిగా అంటే హీరోగా మారతాడు… ఈ మొత్తం క్రమంలో సహజంగానే నరికివేతలు, రక్తాలు, ఊచకోతలు గట్రా ఉంటయ్… సినిమా అంతా కల్యాణరాముడే… ఇంకెవడూ కనిపించడు ఇక… తెలుగు సినిమా అంటేనే సూపర్ హీరోయిక్ కదా… అది సంపూర్ణంగా నెరవేర్చారు ఈ సినిమాలో కూడా… ఎలాంటి కొత్త కథయినా సరే, అక్కడ నో కంప్రమైజ్… (500 ఏళ్ల క్రితం కూడా మన డాన్సర్లు ఇప్పటి డ్రెస్సులతో, ఇప్పటి తెలుగు స్టెప్పులనే వేస్తుంటారు… కొరియోగ్రాఫర్‌కు వేనవేల దండాలు…)

కేథరిన్, సంయుక్తా మేనన్ ఉన్నారు… ఉన్నారంటే ఉన్నారు… వరినా అని మరొకామె కూడా కనిపిస్తుంది… వెన్నెల కిషోర్ కూడా ఉన్నాడు… తను లేకపోతేనే ఆశ్చర్యం కదా… తను ఉండటం అనేది తెలుగు సినిమాకు తప్పనిసరి సెంటిమెంట్… చెప్పలేదని అనుకోవద్దు… నేపథ్య సంగీతం పెద్ద మైనస్ ఈ సినిమాకు… రాజమౌళి సినిమాకు తప్ప ఇంకెవరికీ తను సిన్సియర్‌గా వర్క్ చేయడా..? అసిస్టెంట్ల మీద వదిలేస్తున్నాడా అనే డౌట్లూ కోకొల్లలు… వేరే సంగీత దర్శకులు చేసిన పాటలు కూడా సోసో…

చివరగా :: జనం థియేటర్లకు రావడం లేదనే విషయాన్ని నేను నమ్మడం లేదు అన్నాడు కదా కల్యాణరామ్… సినిమాకు కాస్త పాజిటివ్ టాకే వస్తోంది కదా… జనం ఎలా వస్తారో, వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి ఇక…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తెలంగాణతనానికి కాదు, దొరతనానికి సలాములు కొట్టే గొంతులు
  • వైవిజయ పులుసు టేస్టుకు నాటి ప్రేక్షకలోకం ఫ్లాటయిపోయింది..!!
  • గొప్ప నటుడు… ఆధిపత్య అహంకారాన్ని బాధతో భరించిన ఆర్టిస్టు కూడా…
  • జరిగేదంతా… జర్నలిజంతో ఘర్షణా..? ఏబీఎన్ రాధాకృష్ణతో ఘర్షణా..?
  • ఆ తల్లిది అలుపెరగని పోరాటం… 30 ఏళ్లుగా ఏ మార్గాన్నీ వదల్లేదు…
  • గుడ్ లోకేష్… వర్తమాన ఏపీ బూతు రాజకీయాల్లో నాలుగు మంచిమాటలు…
  • హమ్మయ్య… బీజేపీ మాధవుడు రాత్రికిరాత్రి తెలంగాణను మళ్లీ ఇచ్చేశాడు…
  • ప్రేక్షకులూ బీ రెడీ…! ఆరేడు వందల కోట్ల వసూళ్లకు దండయాత్ర..!!
  • మోడీ నిర్మించిన ఆ సర్దార్ విగ్రహంకన్నా మూడడుగులు ఎక్కువే..!!
  • క్రమేపీ మతానికి దూరమవుతున్న ఓ తూర్పు దేశం… ఇంట్రస్టింగు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions