పొద్దున్నే టీవీల్లో కొందరు స్వాములు రంగురంగుల పూసల దండలు వేసుకుని, ప్రపంచంలోని ప్రతి సమస్యకు ఓ విరుగుడు చెప్పేస్తుంటారు… ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంటారు… మూఢనమ్మకాల్ని వ్యాప్తి చేస్తూ డబ్బు సంపాదిస్తుంటారు… వాళ్లను చూస్తుంటేనే ఓ అలర్జీ… సేమ్, సాక్షిలో ఈరోజు వచ్చిన హాఫ్ పేజీ ఐటం కూడా అలాగే అనిపించింది…
ఐటం అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే… అది యాడ్‌లా అనిపించలేదు, యాడ్ అనీ రాయలేదు… స్పాట్ వార్త కాదు, స్పెషల్ స్టోరీ కాదు… ఫ్యామిలీ పేజీ కదా, ఏది రాసినా సరే, ఆఫ్టరాల్ పాఠకులే కదా, మేం చెప్పిందే నమ్ముతారు, రాసిందే చదువుతారు అన్నట్టుగా ఉంది అది… ప్రతి కొత్త సంవత్సరం ఆరంభంలో గ్రహచార ఫలితాల్ని పబ్లిష్ చేయడం పలు పత్రికలకు అలవాటే…
నిజానికి రోజువారీ జాతకఫలాలే పెద్ద ఫేక్… ఏ మనిషి గ్రహచార ఫలాన్ని లెక్కించాలన్నా పుట్టిన తేదీ, సమయం, ప్రాంతం, వయస్సు గట్రా గుణించి… దాన్ని బట్టి గ్రహసంచారాన్ని గణించి… అప్పుడు ఫలితాల్ని వ్యక్తుల వారీగా చెప్పాలి… అంతేతప్ప సామూహిక ఫలితాలు ఉండవు… ఎవడి జాతకం వాడిదే… జ్యోతిష్య రూపాలు అనేకం… హస్త సాముద్రికం నుంచి నాడీజోస్యం దాకా అనేక పద్దతులు… ఎవరి అభ్యాసం వాళ్లది… అఫ్‌కోర్స్, అవీ జరిగితే తమ గొప్ప అని చెప్పుకోవడం, జరగకపోతే సైలెంటుగా ఉండిపోవడం…
Ads
సాక్షిలో కూడా ఇలాగే 2023 ‘సంవత్సర ఫలాలు అని పబ్లిష్ చేసింది… నిజానికి ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా సంవత్సర ఫలాలు అని చెప్పడమే అబ్సర్డ్… కాలమానాన్ని బట్టి మన కొత్త సంవత్సరం ఏదో డిసైడ్ చేసుకుని, ఆరోజున వచ్చే ఏడాదికి ఏం ఫలాలు ఉంటాయో తెలుసుకోవడం కద్దు… సాక్షి వాడికి ఇవేవీ తెలియవు… జనాన్ని పిచ్చోళ్లను చేయడం తప్ప… న్యూమరాలజీ ప్రకారం 2023 ఫలితాలు అని రాసిపడేశారు…
దరిద్రం ఏమిటంటే… పుట్టిన తేదీని బట్టి సామూహికంగా ఫలితాలను చెప్పేయడం…!! ఫాఫం, ఇలాంటి విద్యలు ఏమీ తెలియని పండితులు రాశులు అనీ, నక్షాత్రాలనీ, పాదాలనీ ఏవేవో లెక్కిస్తుంటారు… ఇందులో ఒక వాక్యం చదవండి… ‘‘2023… ఈ సంవత్సరం నంబర్… ఇందులో అంకెల్ని కూడితే 7 వస్తుంది… ఏడు అంటే కేతువుకు సంకేతం… సో, ఈ ఏడాది విశేషం ఏమిటంటే… మరుగునపడిన తాంత్రిక విద్యలు, ఆయుర్వేదం, జ్యోతిష్యం విద్యలలో సృజనాత్మక మార్పులు జరుగుతాయి’’ అని రాసిపడేశాడు ఒకాయన…
నిజమే, క్రియేటివ్ జ్యోతిష్యమే ఇది… రాసింది ఒక అస్ట్రో-న్యూమరో-గ్రాఫాలజిస్ట్ అట… ఓహ్… ఈ విద్య కూడా 2023లోనే స్టార్టయిందా..? జాతకఫలాలకు గ్రాఫాలజీకి సంబంధం ఏమిటో… రాసింది మహమ్మద్ దావూద్… సరే, జ్యోతిష్యానికి మతభేదం ఉండదు, ఎవరైనా సాధన చేయవచ్చు… అందులో అభ్యంతరం ఏమీ లేదు… కానీ ఎటొచ్చీ తరతరాలుగా ప్రజలు విశ్వసించే పద్ధతులను వెకిలి చేసినట్టుగా ఉండకూడదు… ఏవో పిచ్చి పేర్లను, విద్యలను చూపిస్తూ, జనాన్ని ఇంకా పిచ్చోళ్లను చేయవద్దు… దీన్ని పబ్లిష్ చేసినప్పుడు సాక్షి పెద్దలు ఏం ఆలోచించి ఉంటారు..? భలేవారే, అలాంటివి ఆలోచిస్తే అది సాక్షి ఎందుకు అవుతుంది అంటారా..? అంతేలెండి…!!
Share this Article