ఈమధ్య మనకు భలే కేరక్టర్స్ దొరుకుతున్నయ్… కిరాణాకొట్టు నానిలాగే ఇదుగో ఈ రవిశాస్త్రి… క్రికెట్ బెట్టింగ్ చట్టబద్దం చేయాలని గట్టిగా చెప్పాడు… అసలే రవిశాస్త్రి, అపరమేధావి… నిజానికి తన అపరిమిత తెలివితేటల్ని కేవలం క్రికెట్‌కే పరిమితం చేశాడు గానీ అన్నిరంగాలకూ వర్తింపజేయాల్సినంత పే-ద్ద బుర్ర… అంతేకదా రవీ… నాని చెప్పినట్టు సినిమా టికెట్ ధరల్ని తగ్గిస్తే ప్రేక్షకులకు అవమానించినట్టుగానే… ఒకవేళ బెట్టింగ్‌ను గనుక చట్టబద్ధం చేయకపోతే యావత్ క్రికెట్ ప్రేమికులనూ మోడీ ప్రభుత్వం అవమానించినట్టే అంటావ్, అంతేకదా… వీలయితే బెట్టింగ్‌ను కూడా ఏదైనా కార్పొరేట్ కంపెనీకి అప్పగిస్తే బెటర్… ఆదానీ బెట్టింగ్ కార్పొరేషన్‌ను రాత్రికిరాత్రి పుట్టిద్దాం అదెంత పని..? లేదంటే ఐపీఎల్ ఫ్రాంచైజీలకే ఆ అవకాశమూ ఇచ్చేద్దాం… ఈ ఇండస్ట్రీకి ప్రోత్సాహం పేరిట ఏమైనా రాయితీలు ప్రకటించే పని ఆర్థికమ్మ గారికి అప్పగించేద్దాం… ఏమంటావ్..?
అసలు బెట్టింగ్ చట్టబద్ధీకరించడమే కాదు, మ్యాచ్ ఫిక్సింగ్‌ను కూడా ఇకపై ఏమాత్రం నేరంగా పరిగణించకూడదని రాజ్యాంగంలో ఓ సవరణ కూడా తీసుకురావాలి… వీలయితే అవార్డులు ఇచ్చి ఎంకరేజ్ చేయాలి ప్రభుత్వం… అసలు క్రికెట్ బెట్టింగ్‌ను ప్రజలకు మరింత చేరువ చేయడానికి ఊరూరా కియోస్క్‌లు, మట్కా కేంద్రాల్లాగా పట్టణాల్లో చిన్న చిన్న దుకాణాలకు కూడా అనుమతినివ్వాలి… బాల్ బాల్‌కూ, ఓవర్ ఓవర్‌కూ, మ్యాచ్ మ్యాచ్‌కూ, ప్లేయర్ ప్లేయర్‌కూ బెట్టింగ్ రేట్లు మారిపోతుంటయ్ కాబట్టి ఎప్పటికిప్పుడు రియల్ టైమ్ అప్‌డేషన్ కోసం బీసీసీఐ ఆధ్వర్యంలోనే ఓ అధికారిక వెబ్‌సైట్ ఏర్పాటు చేస్తే బెటరేమో రవీ…
Ads
మట్కా అంటే గుర్తొచ్చింది… అసలు ఈ క్రికెట్ బెట్టింగ్ మాత్రమే దేనికి..? ఎలాగూ మనం అరికట్టలేకపోతున్నాం కాబట్టి మట్కాలను, హవాలా యవ్వారాలను కూడా చట్టబద్ధీకరిస్తే ఓ పనైపోతుంది… అన్నింటికన్నా ముందు వ్యభిచారాన్ని చట్టబద్ధం చేసేయాలి… వైన్స్, బార్లకు లైసెన్సులు ఇచ్చినట్టుగానే టెండర్లు పిలవాలి… ఎక్సయిజ్ శాఖలాగే ఓ సెక్సయిజ్ శాఖను కూడా పెట్టేసి, అందులో కూడా విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాల్ని క్రియేట్ చేయాలి… కోడిపందేలు, పేకాటల్ని కూడా కేంద్రం ఇతోధికంగా ప్రోత్సహించే కొత్త విధానాన్ని వచ్చే పార్లమెంటు సమావేశాల్లో పెట్టేయాలి… ఇది మొదటి దశ… తదుపరి దశల్లో తుపాకుల తయారీని కుటీర పరిశ్రమగా గుర్తించడం, బాంబుల తయారీ ముడిపదార్థాలకు రాయితీలు, అల్లర్లకు పాల్పడే రౌడీమూకలకు అవార్డులు, చైన్ స్నాచర్లకు పదునైన బ్లేడ్ల పంపిణీ, ఆన్‌లైన్ ఫ్రాడ్లకు ప్రత్యేక సిలబస్, కరిక్యులంలో చేర్పు వంటి విప్లవాత్మక నిర్ణయాలు కూడా తీసుకుంటే బెటరేమో… రవీ, ఈ డిమాండ్లు కూడా పెట్టేసెయ్… వాటిని ఎలాగూ ఆపలేనప్పుడు లీగలైజ్ చేయడమే కరెక్ట్ అనే కదా నీ సూత్రం… రేప్ ఆపలేనప్పుడు, ఆహ్వానించడమే బెటర్ అంటారు కదా నీలాంటోళ్లే…!! ష్, ఆకతాయి రోమియోలకు రాయితీ ధరల్లో యాసిడ్ బుడ్లు, వేటకొడవళ్లు సరఫరా చేయడం కూడా అవసరం అంటావేమో… ఏం బుర్రరా బాబూ నీది..? నీ అనంతరకాలంలో ఖచ్చితంగా సాలార్‌జంగ్ మ్యూజియంలో పెట్టేయాలి… ప్రస్తుతానికి నీతిఆయోగ్ పగ్గాలు నీకివ్వడమే మంచిది… మంచిది…!!
Share this Article