ఏమాత్రం తప్పు లేదు… ఏ పత్రికైనా, ఏ టీవీ అయినా తప్పుడు వార్త రాస్తే తప్పుపట్టాల్సిందే… నిజాలు ఇవీ అని విప్పిచెప్పాల్సిందే… తప్పులు రాసిన తీరును నిలదీయాల్సిందే… పత్రికను కొన్ని ఓ సామాన్య పాఠకుడూ చేయవచ్చు, ఎందుకంటే తను కస్టమర్ కాబట్టి..! నాసిరకం సరుకును నిలదీసి అడిగే హక్కుంది కాబట్టి…! ప్రత్యర్థి మీడియా కూడా ప్రశ్నించవచ్చు… కానీ ఎప్పుడు..? తను శుద్దపూస అయినప్పుడు… తనకు ఆ నైతిక హక్కు ఉంటుంది… సరే, కార్పొరేట్ వార్, మీడియా వార్, పార్టీ వార్… ఏదో ఒకటి జరగనీ, తన్నుకోనీ, కొన్ని నిజాలైనా ప్రజలకు తెలుస్తాయి అనుకుని స్వాగతిద్దాం… ఈనాడు వర్సెస్ సాక్షి, సాక్షి వర్సెస్ ఆంధ్రజ్యోతి, నమస్తే వర్సెస్ వెలుగు, సాక్షి టీవీ వర్సెస్ టీవీ5, వీ6 వర్సెస్ టీన్యూస్… ఇలా… కానీ ఎంతవరకూ… ఏ లిమిట్స్ వరకు..? అదీ అసలు ప్రశ్న… ఈ ప్రశ్న ఎందుకు పుట్టిందంటే నిన్న సాక్షి ఏపీ ఎడిషన్ ఫస్ట్ పేజీ, ఫస్ట్ బ్యానర్ ఈనాడును తిట్టిపోసే వార్త… వార్త కాదు, కథనం… కాదు, కౌంటర్… ఏపీ సర్కారు ఇవ్వాల్సిన వివరణను సాక్షి తన భుజాల మీద మోస్తూ… తనే రాస్తూ… ఫస్ట్ బ్యానర్ అచ్చేసింది… ఒక విభ్రమ… నిజంగా సాక్షి, ఆంధ్రజ్యోతి, నమస్తే… ఈ పార్టీల పత్రికలు ఏ స్థాయికైనా వేగంగా దిగిపోగలవు…
సాక్షి పుట్టిన కొత్తలో… ఈనాడు ఏది రాసినా సరే, ఏది నిజం పేరిట పేజల కొద్దీ సాక్షి కౌంటర్లు రాసేది… తరువాత ఈనాడు ఆ కౌంటర్లకు కౌంటర్లు రాసేది… తరువాత అది మానేసింది… సాక్షి మానేసింది… కానీ అవి ఏ ఎడిట్ పేజీలోనో, లోపలి పేజీల్లోనో ప్రచురించేవారు… సరే, పార్టీల యుద్ధం, పత్రికల యుద్ధం… సహజమే అనుకుందాం… కానీ మరీ ఫస్ట్ పేజీ ప్రాధాన్య వార్తే ఈనాడును తిట్టడమేంటి..? సాక్షిని కొనే పాఠకులు ఈనాడుకు కౌంటర్ల కోసం, వేరే పత్రికల్లో వచ్చే వార్తలకు వివరణల కోసం, ఖండనల కోసం, స్పష్టీకరణల కోసం కొనాలా..? అసలు ఓ పత్రిక రూపస్వభావాలు, బేసిక్ సమాచార ముద్రణ, ఇతర ప్రాథమిక లక్షణాల్నే బొందపెట్టేస్తున్నట్టుగా ఉంది… హార్ష్‌గా ఉన్నా సరే, ఒక న్యూట్రల్ పాఠకుడు ఫీలయ్యేది ఇదే… సర్కారుకూ, పత్రికకూ నడుమ ఓ సన్నని రేఖ ఉంటుంది, ఉండాలి… దాన్ని కూలగొట్టి సర్కారీ గెజిట్ చేస్తే ఎలా..?
Ads
ఎస్, ఏపీలో విద్యారంగానికి సంబంధించి కొన్ని గుణాత్మక మార్పులు కనిపిస్తున్నయ్… సర్కారు బడిని ప్రైవేటు బడికి దీటుగా, కాదు, అంతకుమించి ఉన్నతంగా తీర్చిదిద్దే ఓ సంకల్పం కనిపిస్తోంది… బడులు రూపురేఖలు మారుతున్నయ్… ఇంగ్లిష్ మీడియం, త్వరలో సీబీఎస్ఈ, గోరుముద్ద… త్వరలో న్యాప్కిన్లు… అమ్మఒడి… ఒకే ఏడాది సర్కారు బడుల్లో 6 లక్షల మంది పిల్లలు కొత్తగా చేరారు… గుడ్… అభినందించాలి… కానీ పాఠ్యపుస్తకాలు ఇంకా అందాల్సి ఉంది అంటూ ఈనాడు ఓ వార్త రాసింది… ఇదే సాక్షి తన సుదీర్ఘకథనంలో ఓచోట ‘ఇంకా కొందరికి అందాల్సి ఉంది’ అని అంగీకరించింది… ఈనాడు రాసిందీ అదే కదా… ఇంత ఉలిక్కిపాటు దేనికి..? సర్కారును మించిన ఉక్రోషం దేనికి..? వోకే, ఈనాడు తెలుగుదేశం పత్రికే, దురుద్దేశంతోనే రాసింది… ఖండన జారీ చేసి, ఖచ్చితంగా దాని ముద్రణను డిమాండ్ చేయమనండి సర్కారును… అదేదో పత్రికలకు కళ్లెం వేయటానికి 2435 జీవో తెచ్చారుగా… ఏదీ, ఒక్కరి మీదా ఒక్క కేసూ పెట్టలేదేం..? పెడితే కదా, ఏ సుప్రీం దాకా వెళ్తేనే కదా, ఆ జీవో రాజ్యాంగబద్ధత నిగ్గుతేలేది… జగన్ సార్, మీరు ఈనాడు, ఆంధ్రజ్యోతికి కౌంటర్లు రాస్తారు కదా… సాక్షి పత్రిక కొంటే కౌంటర్లు చదువుతాం, అసలు ఒరిజినల్ వార్తలేమిటో, ఇవి ఏ వార్తలకు కౌంటర్లో, వాళ్లేం రాశారో తెలుసుకోవాలంటే… మేం ఈనాడు లేదా ఆంధ్రజ్యోతి కొనుక్కోవాలా సార్..? వారెవ్వా…!! సాక్షి లోగో పక్కన అదే మాస్ట్ హెడ్ పక్కన ప్రభుత్వ లోగో కూడా ముద్రించే ఆలోచన ఉంటే మానేయండి సార్… ప్లీజ్, బాగుండదు…!!
Share this Article