ఆ వార్త చదివి, ఆ ఫోటోలు చూశాక… ఇలా కూడా విశ్లేషించవచ్చా అని ఆశ్చర్యమేసింది… అలాగని ఆంధ్రజ్యోతి వాడు రాసిందాంట్లో పూర్తి అబద్ధాలేమీ లేవు… విషయమేమిటంటే… తాడేపల్లిలో జగన్ నివాసంలో జగన్ భారీ ఖర్చుతో రాజకీయ సంక్రాంతి వేడుకలు జరిపాడు… జగన్ నివాసంలోనే ఏకంగా తిరుమల సెట్టింగ్ వేశారు… అంతేకాదు, ప్రముఖ ఆలయాల్లోని దేవుళ్లు నమూనాలు కూడా ప్రతిష్టించారు…
శఠగోపం స్వీకరించి నామాలు కూడా పెట్టించుకున్నాడు… ఇదీ వార్త సారాంశం… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బాధేమిటంటే… అయ్యో, అయ్యో మా చంద్రబాబు సర్వశక్తులూ కూడదీసుకుని, అపర చేగువేరా పవన్ కల్యాణ్‌ను కూడా తోడుపెట్టుకుని సమరశంఖం పూరిస్తే, ఆ క్రిస్టియన్ జగన్ హిందువుల కళ్లకు గంతలు కట్టడానికి, మభ్యపెట్టడానికి, మోసగించడానికి, ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఈ నాటకం ఆడాడు, ఎంత దారుణం అనేది ఆయన ఆవేదన ఫాఫం…
Ads
నిజమే… జగన్ క్రిస్టియనే… దాచుకునే ప్రయత్నం ఏమీ చేయడు… హిందూ గుళ్లకు భారతీరెడ్డి మొదటి నుంచీ దూరం అనే విషయం కొంత సందిగ్ధం… నిజంగానే ఆమె ఎప్పుడూ ఏ మత ఆధ్యాత్మిక కార్యక్రమం బాపతు ఫోటోల్లో గానీ, వార్తల్లో గానీ కనిపించదు… కారణం బోధపడదు… చివరకు తిరుమల బ్రహ్మోత్సవాలకు వెళ్లినా జగన్ ఒంటరిగానే వెళ్తాడు మరేమిటో గానీ…
ఆమె అత్తగారు, ఆడపడుచుగారు క్రిస్టియానిటీని ప్రదర్శిస్తారు… కానీ ఆమె మాత్రం పెద్దగా ఏ ప్రోగ్రాంలోనూ కనిపించేది కాదు… భర్తలాగా ఆమె ప్రాక్టీసింగ్ క్రిస్టియనా కాదా కూడా తెలియదు… బట్, అది ఆమె వ్యక్తిగతం, నువ్వు ఇలా ఉండాలి, ఇలా నడుచుకోవాలని అని ఎవరూ నిర్దేశించలేరు… కానీ ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంటుంది… కారణం, ఆమె సీఎం భార్య కాబట్టి…
ఆమెను అలా వదిలేద్దాం… జగన్ ఇప్పుడు మాత్రమే హిందూ ముద్ర కోసం ప్రయత్నిస్తున్నాడా..? ఎన్నికల ఫాయిదా కోసం నాటకాలు వేస్తున్నాడా..? కాదు… గతంలో పుష్కర స్నానాలు చేశాడు… శారదాపీఠం నేతృత్వంలో రుషికేష్‌లో ఏదో యాగమో, హోమమో కూడా చేయించాడు… ఏటా పంచాంగ శ్రవణాలూ చేయిస్తుంటాడు… అన్నింటికీ ఫోటోలున్నయ్… అబద్ధాలు ఏమీ కావు…
నిజంగానే ఇప్పుడు తాడేపల్లిలో జరిగిన సంక్రాంతి సంబురాలు ఎన్నికల ఫాయిదా కోసమే అనుకుంటే… మరి గతంలో నిర్వహించిన పుష్కరస్నానాలు, పంచాంగ శ్రవణాలు, రుషికేష్ హోమాలు దేని కోసం..?! శఠగోపం పెట్టుకున్నాడు, నామం ధరించాడు అనేది కూడా అబ్సర్డ్ విమర్శ… ఏ సందర్భంలోనైనా తను సంప్రదాయ వస్త్రధారణతోనే ఉన్నాడు…
ఉండవచ్చు… తను పూర్తి క్రిస్టియన్‌గానే జనానికి కనిపిస్తే అది తనకు రాజకీయంగా ఇబ్బంది అనుకోవచ్చు… అప్పుడప్పుడూ హిందూ ముద్ర కోసం ప్రయత్నించవచ్చు… కానీ ఇదే తొలిసారి మాత్రం కాదు, కాకపోతే ఈసారి హంగామా ఎక్కువగా ఉంది… అయితే ఆ ఖర్చు ఎవరు భరించారో, ఖజానా నుంచి మారు పేర్లతో పెట్టి ఉంటారు అని మరో రంధ్రాన్వేషణ… హిందూ ఆలయాలపై వరుస దాడులు జరిగినప్పుడు, గ్రామీణ ప్రాంతాల్లో క్రిస్టియానిటీ మత మార్పిళ్లు పెరిగినప్పుడు గానీ జగన్ స్పందించలేదు అనే విమర్శ హిందూ సెక్షన్ నుంచి వినిపిస్తూ ఉంటుంది… దానికి జగన్ ఎప్పుడూ జవాబు చెప్పుకునే ప్రయత్నం కూడా చేయలేదు… అఫ్‌కోర్స్, ఆయన ఎప్పుడూ మీడియా ముందుకు రాడు కదా…
మరి ఇదేమిటి రాధాకృష్ణా… భోగి మంటల ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి, పవన్ కల్యాణ్‌ను వెంటేసుకుని, చంద్రబాబు చేసిందేమిటి..? అదేమైనా సంప్రదాయబద్ధమా..? చీకటి జీవోలు, జగన్ పాలన ప్రతుల పేరిట ఏవేవో కాగితాలను దహనం చేశారు… ఓ నిజమైన గ్రామీణ పండుగకు కూడా ఈ రాజకీయ మకిలి అంటించడం దేనికి..? వాళ్లు ఉద్దేశించింది పొలిటికల్ ఫాయిదా కాదా..? గతంలో నారావారిపల్లెలో పండుగ చేసుకుంటూ, ఇదేదో కొత్త సంప్రదాయం అన్నట్టుగా, తెలుగువారికి మార్గదర్శనం అన్నట్టుగా మస్తు బొంబాట్ చేశారు కదా… మరి దాన్నేమనాలి…?
సో, దొందూ దొందే… అసలు ఏ పార్టీ అయినా సరే, ఏ నాయకుడైనా సరే… ప్రతి సందర్భాన్ని తమకు మైలేజీ వచ్చేందుకు ఇలాగే ప్రయత్నిస్తారు… ఎదుటి వాళ్లు చేసేదాంట్లో రంధ్రాలు వెతికి, మీ క్యాంప్ చేసే నిర్వాకాల్లో మాత్రం ప్రజాక్షేమాన్ని వెతకడాన్ని పాత్రికేయం అనరు… నిజానికి దానికి ఏ పేరూ లేదు…!
Share this Article