ప్రాంక్… అంటే ఫేక్… నిజమైనవే అని భ్రమింపజేసే అబద్ధం… ప్రాంక్ కాల్స్, ప్రాంక్ మెసేజెస్ మోసం… కానీ వాటిల్లోనూ సరదా, కొందరు ప్రాంక్ వీడియోలు చేసి, యూట్యూబులో పెట్టి బతికేస్తుంటారు… వాటికీ విపరీతమైన వ్యూయర్‌షిప్… కాస్త చూడబుల్ కంటెంట్ కోసం కష్టపడండిరా అంటే మన సినిమా వీరులు, టీవీ తోపులు ఈ ప్రాంకులను తమ ప్రోగ్రాముల్లోకి కూడా తీసుకొచ్చి నడిపించేస్తున్నారు…
ఆమధ్య విష్వక్సేనుడు అనబడే ఓ హీరో తన సినిమా ప్రమోషన్ కోసం ప్రాంక్ వీడియో చేయించి, అభాసుపాలై, టీవీ స్టూడియోలోనూ రభసపాలైన తీరు మనం చూశాం… అఫ్‌కోర్స్ చాలామంది నిర్మాతలు సినిమా మొదటి రోజు మొదటి ఆట దగ్గర ఇలాంటి ప్రాంక్ వీడియోలు చేయించి యూట్యూబులో వదులుతూ ఉంటారు… అదొక ప్రచారపైత్యం… వాళ్ల నుంచే విష్వక్సేనుడికి స్ఫూర్తి…
ఆమధ్య శ్రీదేవి డ్రామా కంపెనీ అనబడే ఈటీవీ ప్రోగ్రాంలోనూ ఈ ప్రాంక్స్ స్టార్ట్ చేశారు… అదేమంటే, మా ప్రోగ్రాం పేరే డ్రామా కంపెనీ కదా అన్నట్టుగా… ప్రోమోల కోసం చేయకతప్పడం లేదు సార్ అని ఓ పిచ్చి సమర్థన చేసుకున్నారు… అంటే యూట్యూబుల థంబ్ నెయిల్స్‌కూ లోపల కంటెంటుకూ సంబంధం లేనట్టే… ఈ ప్రోమోల్లో చూపేది వేరు, అసలు జరిగేది వేరు అన్నమాట… సరే, ఈ చిత్తవికారం కొన్నిరోజులు ఉంటుందిలే అనుకుంటే ఇప్పుడు ఏకంగా టీవీ స్పెషల్ ప్రోగ్రామ్స్‌లోకి కూడా తీసుకొచ్చారు…
Ads
నిన్న జీతెలుగులో ఓ షో వచ్చింది… దాని పేరు ఫన్‌టాస్టిక్ అవార్డ్స్… నిజానికి ఫన్ క్రియేట్ చేసే అవార్డులకే షో పరిమితం చేస్తే బాగుండేది… టీవీ స్పెషల్ షో అనగానే కనిపించే పిచ్చి గెంతులు, తలతిక్క ఆటలు కూడా ఉన్నయ్… యాంకర్ రవి పర్లేదు, కానీ ఎవరూ దొరకనట్టుగా బిగ్‌బాస్ సిరిని తీసుకొచ్చి కోహోస్ట్‌ను చేశారు… ప్చ్, యాంకరింగ్ ఎలా ఉండకూడదో చెప్పింది…
ఏవేవో స్కిట్స్ మన్నూమశానం అయిపోయాయి… ఒక దశలో ప్రేక్షకుల్లో కూర్చున్న ఓ పెద్దమనిషిని పిలిచారు… నీకు వాగుడు వీరయ్య అవార్డు ఇస్తున్నాం అన్నారు… అంటే చిరంజీవి కొత్త సినిమా వాల్తేరు వీరయ్యలాగా వినిపించేట్టు ఆ అవార్డు పేరు పెట్టారన్నమాట… ఆయన కూడా యాంకరే… పేరు బాలాజీ… వేదిక ఎక్కి, నేను యాంకర్‌గా ఇంత సీనియర్‌ను, ఈ వాగుడు వీరయ్య అని పేరు పెట్టి, నన్ను వెకిలి చేస్తారా, ఛట్, నేను ఈ అవార్డును తిరస్కరిస్తున్నాను అని విసురుగా వెళ్లిపోయాడు…
అక్కడికి షో యాంకర్ రవి చెబుతూనే ఉన్నాడు, నచ్చకపోతే ఎడిటింగులో తీసేద్దాం సార్ అని…! ఈ బాలాజీ సెట్ అవతల ఉన్న క్యారవాన్ల వద్దకు వెళ్లి, తిరిగి వెనక్కి వచ్చి…. ఇహిహిహి, అంతా ప్రాంక్ అన్నాడు… ఈ చెత్త ప్రయోగం ఏమిట్రా అని ఎవరైనా అడిగితే మా ప్రోగ్రామే ఫన్‌టాస్టిక్ అవార్డులు కదా అంటారేమో… కానీ ఆ షో చూసేవాళ్లకు మాత్రం చిర్రెత్తుకొచ్చింది… ఇవి దేనికి ఉపయోగం..? నిజం చెప్పాలంటే శుద్ధదండుగ…
ఎందుకంటే..? సహజంగానే దీన్ని ప్రోమో కోసం వాడుకున్నారు… యూట్యూబులో ప్రచారాన్ని ఇరగదీశారు… కానీ ఏమాత్రం బుర్ర ఉన్న ప్రేక్షకుడైనా అర్థం చేసుకుంటాడు, ఏమనీ అంటే… నిజంగానే స్టూడియోలో గొడవ జరిగితే, ఎవరో అవార్డును తిరస్కరించి, ఛీత్కరించి వెళ్లిపోతే ఆ వీడియో బయటికి వస్తుందా..? దాన్ని ప్రోమోగా చూపించుకుంటాడా ఎవడైనా..? సో, ఇలాంటి ప్రోమోలు చూడగానే ప్రేక్షకుడు థూ అనేస్తాడు… మరి ఈ పిచ్చి ప్రాంక్స్ వల్ల టీవీ క్రియేటివ్ టీమ్స్ ఆశించే ఫాయిదా ఏంటి..?!
Share this Article