థమన్… వెనకబడ్డావేమిటి..? కమాన్, గేరప్… డీఎస్పీతో పోటీ అంటే మాటలా మరి..? పాడాలి, ఎగరాలి, దూకాలి, షో చేయాలి,… నువ్వు కాపీ కొడతావా, సొంతంగా కంపోజ్ చేస్తావా మాకు అనవసరం… వాల్తేరు వీరయ్య సినిమాలో ఓ పాటలో జపాన్ టీంను దింపాడు డీఎస్పీ… మస్తు పెద్ద పెద్ద సంగీత వాయిద్యాలేవో కనిపిస్తున్నయ్… మా చిన్నప్పుడు మా పక్క టౌన్‌లో అన్నపూర్ణ బ్యాండ్ వాళ్లు కూడా ఇంత పెద్దవి వాడలేదు… నువ్వు మరింత పెద్ద వాయిద్యాలను తీసుకొచ్చి, మంగోలియా టీంతో వాయింపజేయాలె… సరేనా..?
అది వీరయ్య టైటిల్ పాటట… మొత్తం ఎటుచూసినా తుపాకీ గొట్టాలు, తుపాకులు, తూటాలు, గ్రెనేడ్లు మాత్రమే కనిపిస్తున్నయ్… భగభగ మండుతూ నడిచొచ్చే నిలువెత్తు తూటాలా చిరంజీవి కనిపిస్తున్నాడు… ట్రెండ్ కదా, త్రిశూలాల నీడలు కూడా ఉన్నయ్… మరి మెగ మెగ మెగ మెగాస్టార్ అంటే మామూలుగా ఉండొద్దు కదా… యాక్షన్‌కు పరాకాష్ట చూపించబోతున్నట్టున్నాడు… మిషన్ గన్లతో తాడోపేడో తేల్చేయబోతున్నట్టున్నాడు… మరి నంబర్ వన్ స్టార్ అంటే కాల్చేయడాలు, కూల్చేయడాలు, శవాలు, నెత్తురు, బాంబు పేలుళ్లు, తుపాకీ మోతలు కామనే కదా…
చంద్రబోస్ అయితే ఏకంగా అగాధ గాథల అనంత లోతుల సముద్రంలోకి తీసుకెళ్లి, తుపాను అంచున తపస్సు చేసే వశిష్టుడిని చూపించాడు… ఏమిటీ, అర్థం కాలేదా..? భలేవారే, చంద్రబోస్ రాసిన పాటల్లో అర్థాలు వెతుకుతారా..? విచిత్రం ఏమిటంటే… చిరంజీవి సినిమా అంటే ఖర్చు దగ్గర ఎవరూ రాజీపడరు… ప్రత్యేకించి పాటలు బాగా రావాలని కోరుకుంటాడు చిరంజీవి… చంద్రబోస్ అడిగిన దానికన్నా నాలుగు రూపాయలు ఎక్కువే ఇచ్చి ఉంటారు… మరి ఎందుకీ పారడాక్స్ పాట..? తెలుగు ప్రేక్షకుల్లో పాటల పదాల్ని వినేవాడు ఎవడు అనే ధీమాయే కదా..!! చిరంజీవి, నిర్మాత పెట్టుకున్న నమ్మకాన్ని వంచించడమే కదా…
Ads
డీఎస్పీ తోటి రచయిత కాబట్టి విమర్శించలేడు ఫాఫం… ఏం..? తనే రాసేయవచ్చుగా… శ్రీదేవి నేనైతే చిరంజీవి నేనంటా అని రాసుకున్నాడు కదా మరో పాటలో తనే… చంద్రబోస్‌కు లక్షలు తగలేయడం దేనికి..? పదీపదిహేను బరువైన పదాలు వెతికి ట్యూన్‌లో ఇరికిస్తే సరి… తమిళ డబ్బింగ్ పాటల్లో ఇరికించినట్టు..! ఫాఫం చంద్రబోస్‌కు ఏమైందో… గతంలో బాగానే రాసేవాడు…
నిజానికి ప్రతి వాక్యంలో పారడాక్స్ పండించడం అనేది మామూలు ప్రయోగం కాదు… అదీ శివుడిని మించిన ప్రసన్న విలయకారుడిగా చూపించడం… కానీ చంద్రబోస్ పారడాక్స్ రాయబోయి (తను ఈ ప్రయోగం చేస్తున్నట్టు తనకైనా తెలుసో లేదో) ఇంకేదో రాసి, ఓచోట శివుడిని గుడ్డికన్నోడా అని తిట్టేశాడు…
తిమిర నేత్రమై ఆవరించిన త్రినేత్రుడే అంటాడు పాటలో… తిమిరం అంటే చీకటి, అంటే గుడ్డికన్ను… ప్రపంచాన్ని దగ్ధం చేయగలిగినంత శక్తి ఉండే శివుడి మూడోకన్నును గుడ్డికన్ను అంటున్నాడు… ఏం రాశావు చంద్రబోసూ… శివుడిని ఇలా తిట్టినోడు ఇన్ని తరాల భారతీయ సాహిత్యంలో ఎవ్వడూ లేడు… జ్వలిత నేత్రమై అని రాస్తే సాధారణ రచయిత… తిమిర నేత్రమై అని రాస్తే అది చంద్రబోస్ అనే నవ కాళిదాసు… చిరంజీవిని శివుడికన్నా ఎక్కువ చేసి చూపాలంటే చివరకు శివుడినే గుడ్డికన్నోడిని చేయాలా..?!
భగభగ భ్భగభగ మండే మగాడురా వీడే
జగజగ ఝగజగ జగాన్ని చెండాడే
ధగధగ ద్ధగధగ జ్వలించు సూరీడే
అగాధ గాథల అనంత లోతుల
సముద్ర సోదరుడే వీడే
వినాశకారుల స్మశానమవుతాడే
తుపాను అంచున తపస్సు చేసే వశిష్టుడంటే అది వీడే
తలల్ని తీసే విశిష్టుడే వీడే
మృగ మృగ మృగాన్ని వేటాడే
పగ పగ పగ ప్ఫగ ప్రతిధ్వనించే శతాఘ్నిరా వీడే
భుగ భుగ భ్భుగ విషాన్ని మింగే
థెగ థెగ థెగ థెగించి వచ్చే త్రిశూలమయ్యాడే
ఎకా ఎకా ఎకి అకౌంటు రాసే కవిత్వమంటే అది వీడే
నవ శకాన ఎర్రని కపోతమే వీడే
తరాలు చూడని యుగాలు చూడని
సమర్థ శిఖరం అది వీడే
తనొంక తానే తలెత్తి చూస్తాడే
ఢం ఢం అగ్నివర్షమై అడుగులేస్తున్నా అసాధ్యుడే
బం బ్భం బడ బ్భడ మృత్యు జననమై ముంచుకొచ్చిన అనంతుడే
రం రం రగ రగ శౌర్య సంద్రమై ఆక్రమించిన అమర్త్యుడే
ధం ధం ధమ యుద్ధ శకటమై ఎగిరి దూకిన అబేధ్యుడే
థం థం తక తక తిమిర నేత్రమై ఆవరించిన త్రినేత్రుడే
గం గం ఘం గడ గడ మరణశంఖమై మారుమోగిన ప్రశాంతుడే
తుపాను అంచున తపస్సు చేసే వశిష్ఠుడు అట… అగాధ గాథల అనంతలోతుల సముద్ర సోదరుడే అట… వామ్మో… మరణశంఖమైన ప్రశాంతుడు, మృత్యుజననం, ఎర్రని కపోతం… ఇవన్నీ పారడాక్స్ పదాలు… పోనీ, అవైనా సమర్థంగా వాడుకున్నాడా…? లేదు… తనొంక తానే తలెత్తి చూస్తాడే అని మహా అత్యుక్తికి దిగుతాడు… ఇంతకీ తనవంక తనే చూసుకోవడం అనే ప్రయోగానికి అర్థమేమిటి మహాశయా… కవిహృదయం కాబట్టి చెప్పబడదు అంటావా..?
సరే, ఎవరో అనురాగ్ కులకర్ణి అట… భగ భ్భగగా, పగ ప్ఫగగా గడగడ ఘడఘడగా, తెగతెగ థెగథెగా రకరకాలుగా ధ్వనించాయి మాటలు… ఓచోట మరీ శతాఘ్ని అని పాడేశాడు… తను నిజానికి మంచి గాయకుడు… ఫైర్ ఉంది తనలో… హిందుస్థానీ క్లాసికల్ మాత్రమే కాదు, కిరాణఘరానా శైలిలోనూ శిక్షణ పొందాడు… బొచ్చెడు పాటలు పాడాడు ఇప్పటికే… తనతో కూడా ఈ దోష ఉచ్ఛరణల పాపం చేయించారు ఫాఫం…!! పగలో తీవ్రత ధ్వనించాలంటే ఫగ లేదా ప్ఫగగా పాడబడాలా..?! భాషపై ఇదేం పగ డీఎస్పీ..?!
Share this Article