తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ మాటకు వీసమెత్తు విలువ లేదా..? బండిని పట్టాలు తప్పించి మరీ కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ తదితరులు సొంతంగానే వ్యవహారాలు చక్కబెడుతున్నారా..? తెలంగాణ ఇస్తే పదకొండు రోజులపాటు నిద్రాహారాలు మాని బాధపడ్డానని చెప్పిన పవన్ కల్యాణ్ ఎదుట, కేడర్ మనోభావాలకు వ్యతిరేకంగా పార్టీ నాయకత్వం సాగిలబడాల్సిన దురవస్థ ఉందా.,.? ఈ చర్చ ఇప్పుడు గ్రేటర్ బీజేపీ సర్కిళ్లలో కలకలం రేపుతోంది…
ఒంటరిగానే పోటీచేస్తాం, ఎవరితోనూ పొత్తులేదు, జనసేనతో పొత్తు చర్చలు జరగలేదు అని బండి సంజయ్ విస్పష్టంగా ప్రకటించాడు… మరోవైపు మేం రంగంలోకి దిగుతున్నామని జనసేన ప్రకటించింది… ఏపీలో పొత్తు ఏమిటి, తెలంగాణలో చిత్తు ఏమిటి అనే గుసగుసలు వినిపించాయి… కట్ చేస్తే… ఒకవైపు బండి సంజయ్ మాటకు భిన్నంగా గ్రేటర్ బీజేపీ కేడర్‌పై గ్రిప్ ఉన్న కిషన్‌రెడ్డి, లక్ష్మణ్… తామే పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి మరీ చర్చలు జరిపారు…
Ads
బండి సంజయ్ చేసిన ప్రకటనపై పవన్ కల్యాణ్ కస్సుమన్నాడనీ, ఈ ఇద్దరు బీజేపీ నేతలు ఏదో బుజ్జగించి, నానా తిప్పలూ పడి, శాంతింపచేశారని వాట్సప్ వార్తలు ఘోషిస్తున్నాయి… ఫోటోల్లో పవన్ కల్యాణ్‌తోపాటు నాదెండ్ల మనోహర్, కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ కనిపిస్తున్నారు… వోట్లు చీలిపోవద్దని, బీజేపీ గెలిచే పరిస్థితి ఏర్పడాలనే భావనతో జనసేనను గ్రేటర్ బరి నుంచి తప్పిస్తున్నామని పవన్ కల్యాణ్ ప్రకటించాడు… సరే, కథ సుఖాంతం…
నిజానికి బీజేపీ పవన్ కల్యాణ్ నెత్తిన పాలు పోసినట్టే… సెటిలర్స్ వోట్లు అధికంగా ఉన్న హైదరాబాదులో నిజంగా జనసేన బలం ఎంతో తేలిపోయేది కదా… మరెందుకు పవన్ కల్యాణ్‌ను బతిమాలి పోటీ నుంచి తప్పించడం దేనికి..? ఇప్పుడు బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చినా సరే, చూశారా, నా మద్దతు మిమ్మల్ని ఎలా గెలిపించిందో గమనించారా అంటాడు తను… దుబ్బాక జోష్ మీద ఉన్న బీజేపీ గ్రేటర్‌లోనూ దూకుడు కనబరిచి, సొంతంగానే బలాన్ని విస్తరించుకోవాలి అనుకుంటే ఏ పొత్తుల వాసనా అక్కర్లేదు తనకు…
కానీ దానికి భిన్నంగా వెళ్తోంది పార్టీ… అదీ తెలంగాణ పట్ల విముఖుడిగా పేరున్న పవన్ కల్యాణ్‌తో జతచేరి…! పవన్ కల్యాణ్‌కు వీసమెత్తు నష్టం లేదు, తన రాజకీయ కార్యక్షేత్రం హైదరాబాద్ కాదు, తెలంగాణ కాదు… ఏపీ…! ‘‘బీజేపికి జనసేన తోడుంటే ప్రజల కలలు నెరవేరుతాయి’’ అని కిషన్‌రెడ్డి వ్యాఖ్య ఏమిటో… ‘‘భవిష్యత్తు ఎన్నికల్లోనూ బీజేపీతో కలిసి ముందుకెళ్తాం’’ అని పవన్‌కల్యాణ్ ప్రకటన ఏమిటో… అసలేం జరుగుతున్నదో… సార్, మోడీ గారూ… హైదరాబాదు బీజేపీలో ఏం జరుగుతోంది సార్…?
చివరగా ఓ మిత్రుడు వ్యాఖ్యానించినట్టుగా… :: పొత్తులో భాగంగా బీజేపికి మొత్తం 150 సీట్లు కేటాయించింది జనసేన…!!
Share this Article