మతం… మతం… దీని పేరిట హిందువులను సంఘటితం చేయడం ద్వారా మాత్రమే దేశమంతటా తన బలాన్ని సుస్థిరం సాధ్యం కాదనీ, దానికీ చాలా పరిమితులున్నాయనే స్పృహ బీజేపీలో కనిపిస్తోందా..? అందుకే ‘‘పరివార్వాద్’’ మంత్రాన్ని జపిస్తోందా..? అది ఫలిస్తుందా..? అసలు ఏమిటీ పరివార్వాద్..?
హైదరాబాదులో జరిగిన జాతీయ కార్యవర్గ భేటీల్లో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశాలు… 1) లుక్ సౌత్… అనగా టార్గెట్ సౌత్ ఇండియా… 2) పరివార్ వాద్… అంటే ఫ్యామిలిజం… అంటే కుటుంబ పాలన… వారసత్వ పాలన… రాచరికం… ఓరకమైన నియంతృత్వం… తన డిక్లరేషన్‌లో కూడా ఈ రెండు అంశాల్నే ప్రధానంగా పొందుపరిచింది… వాళ్ల అంతర్గత చర్చల్లో బలంగా ప్రస్తావనకు వచ్చినట్టు చెబుతున్నవి 8 కుటుంబాలు… వాటి పాలనను బ్రేక్ చేయాలి, టార్గెట్ చేయాలి, అది ప్రాంతీయ పార్టీలు, వాదాలను బలహీనం చేయడానికి, అంతిమంగా జాతీయతావాదానికి బలం చేకూర్చడానికి ఉపయోగపడుతుంది…
నిజానికి బీజేపీకి కొన్ని స్వల్పకాలిక లక్ష్యాలుంటయ్… మోడీ షాలు వచ్చిన తరువాత వీటిపై ధ్యాస పెరిగింది… తప్పో ఒప్పో, నయానో భయానో రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకోవడం..! కానీ బీజేపీ దృష్టి ప్రధానంగా దీర్ఘకాలిక, సుస్థిర లక్ష్యాలపై ఉంటుంది… కలిసివచ్చే శక్తులతో క్రమేపీ బలాన్ని పెంచుకుంటూ పోవడం… దానికి నార్త్ ఇండియాలో హిందుత్వ కలిసొస్తోంది… కానీ లాంగ్ టరమ్ పాలసీల మాటేమిటి..? బెంగాల్, ఒడిశా, ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడు ఎందుకు మింగుడుపడటం లేదు..?
Ads
మతం ప్రాతిపదికన గాకుండా… ఈ కుటుంబపాలన అనే పదాన్ని పట్టుకుని వెళ్తే బీజేపీకి ఆశించిన లక్ష్యాలు నెరవేరతాయా..? నిజానికి పలు రాష్ట్రాల్లో కుటుంబ పాలన అయినా సరే ప్రాంతీయ పార్టీలను ప్రజలు ఆదరిస్తున్నారు… కుటుంబ పాలన, వారసత్వాలు గట్రా వాళ్లకు ఎక్కవు… అసలు అవినీతే పెద్ద ఇష్యూ కావడం లేదు ప్రజల దృష్టిలో… పోనీ, జాతీయ పార్టీల్లో వారసత్వాల జాడలు లేవా..? సరే, ఈ ప్రశ్నలకు జవాబులు సంక్లిష్టం కాబట్టి… అది వదిలేసి… అసలు బీజేపీ చెప్పే ఆ ఎనిమిది కుటుంబాలు ఏవి అని ఆలోచిస్తుంటే ఓపట్టాన తెగడం లేదు…
బీజేపీ కాన్సంట్రేషన్ ప్రధానంగా రాబోయే రోజుల్లో బెంగాల్, ఒడిశా, ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడులపై కేంద్రకృతం కాబోతోంది… ఎక్కడి సమీకరణం అక్కడే… వాటిని ఒక్క గాటన కట్టలేం… కుటుంబపాలనే తీసుకుందాం… మమతకు అభిషేక్ బెనర్జీ ఉన్నాడు గానీ అంత సమర్థుడేమీ కాదు… మమత ఉన్నన్నిరోజులే హవా… తరువాత బీజేపీదే చాయిస్… ఒడిశాలో నవీన్‌కు రాజకీయ వారసుల్లేరు… వయస్సయిపోతోంది… ఇక్కడా బీజేపీ వేచి ఉండాల్సిందే… సేమ్, బిహార్… నితిశ్‌దీ అదే కథ… తనకూ రాజకీయ వారసుల్లేరు… యూపీలో మాయావతికీ అంతే… సరే, ఇంకాస్త వివరాల్లోకి వెళ్దాం…
నో డౌట్… ఈ ఫ్యామిలిజం నినాదానికి ప్రధాన, ప్రథమ లక్ష్యం సోనియా గాంధీ కుటుంబం… కాంగ్రెస్ పార్టీ ఉన్నా పర్లేదు, దాన్ని ఈ నెహ్రూ కుటుంబం నుంచి విముక్తం చేయాలనేదే బీజేపీ టార్గెట్… అదొక్కటీ సాధ్యమైతే ఇక కాంగ్రెస్ నామావశిష్టం అవుతుందనేది బీజేపీ భావన… మరి ప్రాంతీయ రాచకుటుంబాలు..? ఫస్ట్, బీజేపీ ఎత్తిచూపేది కేసీయార్ కుటుంబం… కేసీయార్ తరువాత కేటీయార్ ఉన్నాడు, హిమాంశ్ కూడా రెడీ అయిపోతాడు త్వరలో…
కానీ తెలంగాణలో ఈ నినాదంతో గెలుపును వర్కవుట్ చేయడం బీజేపీకి అంత ఈజీ కాదు… కేసీయార్ పాలన మీద ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నా సరే, ఎన్నికల సమయానికి ఏదో చేసి, మళ్లీ గెలుస్తాడనే నమ్మకమే ఆ పార్టీ శ్రేణులను అలా ఇంటాక్ట్‌గా ఉంచుతోంది… దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్, నాలుగు ఎంపీ స్థానాలు గెలిచినా సరే, బీజేపీకి నాయకత్వ సమస్య ప్రధానలోపం… బలమైన క్రౌడ్ పుల్లర్ లేడు… పార్టీలో బొచ్చెడు తగాదాలు… పైగా పలువురు కేసీయార్ మనుషులే అనే విమర్శలు, గుసగుసలు, రుసరుసలు సరేసరి…
తమిళనాడులో స్టాలిన్ మరో టార్గెట్… తన తరువాత ఉదయనిధి రెడీ… గతంలో తమిళనాడులో బీజేపీకి అడుగుపెట్టడమే దుస్సాధ్యం… కానీ ఇప్పుడు ఐపీఎస్ వదులుకుని రాజకీయాల్లోకి వచ్చిన అన్నామలై బీజేపీకి కొత్త దశను, ఊపును చూపిస్తున్నాడు… అన్నాడీఎంకే భ్రష్టుపట్టేకొద్దీ బీజేపీకి ఏమైనా చాయిస్ ఉండవచ్చునేమో… కేరళలో ఏళ్లుగా కష్టపడుతున్నా, త్యాగాలు చేస్తున్నా బీజేపీ పట్ల పెద్ద ఆదరణ లేదు, అక్కడా బలమైన నాయకత్వం దొరకడం లేదు, అక్కడ ఈ కుటుంబపాలన ఆరోపణలకు గురయ్యే ప్రత్యర్థులు కూడా లేరు…
మహారాష్ట్రలో ఠాక్రే… ఉద్ధవ్ తరువాత ఆదిత్య రెడీ… అలాగే శరద్ పవార్ కుటుంబం… సుప్రియకు అంత సీన్ లేదు కానీ అజిత్ పవార్ సమర్థుడే… జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్… ప్రస్తుతానికి బలమైన ఉనికి… ఇంకా పైకి వెళ్తే ఫరూక్ అబ్దుల్లా కుటుంబం, ముఫ్తి కుటుంబం… కానీ వాళ్లకూ బలమైన తదుపరి వారసత్వం ఏమీ లేదు… ములాయం కొడుకు అఖిలేష్… తను కొరకరాని కొయ్యే… కానీ తనకూ తదుపరి వారసత్వం లేదు… లాలూ కొడుకు తేజస్వికి కొంత సమర్థత ఉంది… గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో ఇలాంటి పెద్ద థ్రెట్స్ ఏమీ లేవు… పంజాబ్‌లో బాదల్…
అయితే ఈ మొత్తం కుటుంబాల్లో బీజేపీ ఏ ఎనిమిది కుటుంబాల్ని టార్గెట్ చేస్తుంది..? తద్వారా ఏయే రాష్ట్రాలపై కన్నేస్తోంది..? కాలం తెర మీద వేచిచూడటమే..!! ఫస్ట్ టార్గెట్ కేసీయార్ కుటుంబం… తద్వారా తెలంగాణలో అధికారం… జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కోణంలో ‘‘మా, బేటా, బేటీ పార్టీ’’ అని నినదించినట్టే… తెలంగాణ కోణంలో ‘‘బాప్, బేటా, బేటీ సర్కార్’’ అనేది నినాదం… మరి మతం..? భలేవారే… పార్టీకి ప్రాణవాయువే అది..!!
Share this Article