.
నిన్నామొన్నా జర్నలిజం సంగతులు చెప్పుకున్నాం కదా… ప్రమాణాలు, పతనాలు, ప్రస్థానాలు అంటూ… లేటుగా చెబుతున్నా.., మొన్నామధ్య నమస్తే తెలంగాణ సైటులో ఓ వార్త కనిపించింది… ఏమిటయ్యా అంటే..?
‘‘ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాల్లో అన్యమతస్థుల ప్రవేశంపై ‘బద్రీ-కేదార్ ఆలయ కమిటీ’ (BKTC) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది… బద్రీనాథ్, కేదార్‌నాథ్‌తో పాటు కమిటీ పరిధిలోని 47 ఆలయాల్లోకి ఇకపై సనాతన ధర్మంపై నమ్మకం లేని వారికి ప్రవేశం ఉండదని కమిటీ స్పష్టం చేసింది… అన్యమతస్థులు ఎవరైనా ఈ క్షేత్రాలను దర్శించుకోవాలంటే, తమకు సనాతన ధర్మంపై పూర్తి విశ్వాసం ఉందని తెలుపుతూ ఒక అఫిడవిట్ (Affidavit of Faith) సమర్పించాల్సి ఉంటుందని కమిటీ ప్రకటించినట్లు సమాచారం..’’ ఇదీ అసలు వార్త…
Ads
గుడ్, దేశంలోని చాలా ఆలయాల్లో ఈ నిబంధన ఉంది… మన తిరుమలలో కూడా ఉంది… అఫిడవిట్ ఇచ్చినా సరే అన్యమతస్తులకు ప్రవేశం లేని పూరీ వంటి ఆలయాలూ ఉన్నాయి… ఒక దశలో నియంత ఇందిరను కూడా అనుమతించలేదు అక్కడ అర్చకగణం… అంత కట్టుదిట్టంగా అమలు చేస్తారు…
సరే, ఇక్కడ మళ్లీ జగన్, తిరుమల, అన్యమతం, డిక్లరేషన్ వివాదం జోలికి వద్దు గానీ… నిజంగానే 47 ఆలయాల్లో గనుక అన్యమతస్తులకు వితవుట్ అఫిడవిట్ ఆర్ డిక్లరేషన్ నో ఎంట్రీ అనే నిర్ణయమే అయితే అది కొంత డిబేటబుల్… కరెక్టు అనేవాళ్లు ఉంటారు, ఆ దేవుళ్లను నమ్మేవాళ్లే వస్తారు కదా, వేరే డిక్లరేషన్ దేనికి అనేవాళ్లూ ఉంటారు…
దాన్నలా వదిలేస్తే… పైన వార్త కంటెంటు తరువాత హఠాత్తుగా అది సారా అలీ ఖాన్ వైపు మళ్లింది… ఎలా అంటే… ఇలా… ‘‘అయితే ఈ కొత్త రూల్ బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్‌కి సమస్య తెచ్చేలా కనిపిస్తుంది… సారా అలీ ఖాన్ తరచుగా కేదార్‌నాథ్‌ను సందర్శిస్తుందన్న సంగతి అందరికి తెలిసిందే. కేదార్‌నాథ్‌పై ఉన్న ఇష్టంతోనే కేదార్‌నాథ్ (సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా) అనే సినిమాలో కూడా నటించింది సారా. అయితే BKTCపెట్టిన తాజా నిబంధనలు ఆమెపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది…
కొన్ని కోట్ల మంది దర్శించే ఆలయాలు అవి… చార్‌దామ్ ప్రతి హిందువుకూ పుణ్యక్షేత్రాలు… అక్కడ పెట్టే నిబంధనలు ఆఫ్టరాల్ ఒక నటి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది వార్త… ప్చ్… నటి సారా అలీ ఖాన్ తరచుగా కేదార్‌నాథ్‌ను దర్శించుకుంటున్న నేపథ్యంలో, ఆమె ప్రవేశం గురించి మీడియా ప్రశ్నించగా BKTC చైర్మన్ హేమంత్ ద్వివేది స్పందిస్తూ… సారా అలీ ఖాన్‌కు సనాతన ధర్మంపై నమ్మకం ఉండి, ఆమె అఫిడవిట్ సమర్పిస్తే ఖచ్చితంగా దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు అట…
ఈ క్షేత్రాల ఆధ్యాత్మిక పవిత్రతను కాపాడటంతో పాటు ఆది శంకరాచార్యుల కాలం నాటి సంప్రదాయాలను అధికారికంగా అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిటీ పేర్కొంది. అలాగే భద్రతా కారణాల దృష్ట్యా భక్తుల వివరాల సేకరణకు కూడా ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు వెల్లడించింది… సరే, ఎందుకు ఈ నిర్ణయం అనే వరకూ వార్త వోకే… తరువాత చదవండి…
‘‘ఆలయ కమిటీ తీసుకున్న నిర్ణయం పట్ల నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు దేశంలో నిరుద్యోగం వేధిస్తోంది.. గ్యాస్ సిలిండర్ల ధరలు మండిపోతున్నాయి.. కనీసం పీల్చడానికి స్వచ్ఛమైన గాలి కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఇలా చెప్పుకుంటూ పోతే సమస్యల జాబితా అనంతంగా సాగుతోంది. కానీ ఇవేవి పట్టనట్లు ప్రజల ప్రాథమిక అవసరాలను పక్కనబెట్టి, అన్యమతస్థులు దేవుడిని దర్శించుకోవాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలని కొత్త నిబంధనలు తీసుకురావడం నవ్వు తెప్పించేలా ఉందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. దేశంలో అసలైన సమస్యలను గాలికొదిలేసి, ఇలాంటి అంశాలకే ప్రాధాన్యత ఇస్తున్న తీరు చూస్తుంటే.. భవిష్యత్తులో ఇంకెలాంటి వింతలు చూడాల్సి వస్తుందో అంటూనెటిజన్లు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు….’’
సదరు వెబ్ సైట్ నిర్వాహకులకు, రిపోర్టర్లకు, కంటెంట్ రైటర్లకు జోహార్… ఆ 47 ఆలయాల దేవుళ్లు వాళ్లను క్షమింతురు గాక… గ్యాస్ సిలిండర్ల ధరలకూ అన్యమతస్తుల డిక్లరేషన్లకు ముడిపెట్టడం ఏదైతే ఉందో… సదరు మీడియా ఓనర్ కేసీయార్ ‘‘కాలర్ ఎగరేసే రేంజ్’’..!! అంతేనా..? సారా అలీ ఖాన్ దర్శనాలకూ, కొత్త రూల్స్‌కూ, దేశంలో నిరుద్యోగానికీ, స్వచ్ఛమైన గాలికీ పెట్టిన లింకులు నభూతో నభవిష్యతి… లాంగ్ లివ్ నమస్తే తెలంగాణ..!!
Share this Article