Nancharaiah Merugumala………… నరేంద్రమోదీ మంత్రివర్గంలో ముస్లిం మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఒక్కరే గాని, జాతీయ టీవీ న్యూజ్ చానల్స్ ప్రైమ్ టైమ్ చర్చల్లో బీజేపీ తరఫున పాల్గొంటున్న ముగ్గురు ముస్లింలు షాజియా ఇల్మీ, షెహజాద్ పూనావాలా, సయ్యద్ జాఫర్ ఇస్లాం చాలా వరకు పద్ధతిగా మాట్లాడతున్నారు. వారి పార్టీ సహచరులు గౌరవ్ భాటియా, సంబిత్ పాత్రా, నళిన్ కోహ్లీ వంటి ప్రవక్తలతో పోల్చితే ఈ ముగ్గురు ప్రతినిధులు ‘హిందుత్వ అతి’ లేకుండా కాస్త పాలిష్డ్‌గా నెట్టుకొస్తున్నారు. ఒక రాజకీయపక్షం తరఫున టీవీ డిబేట్లలో పాల్గొనే ప్రావీణ్యం ఉన్న ముస్లిం మేధావులకు ‘సెక్యులర్’ కాంగ్రెస్ అయినా, ‘కమ్యూనల్’ బీజేపీ అయినా పెద్ద తేడా ఉండదని గత నెల రోజులుగా జాతీయ హిందీ, ఇంగ్లిష్ న్యూజ్ చానల్స్ చూశాక అర్ధమైంది.
2013 దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ టికెట్‌పై పోటీచేసిన షాజియా ఇల్మీ అంతకుముందు జర్నలిస్టు. ఈ ఎన్నికల్లో ఓడిపోయాక ఆమ్‌ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ తో గొడవపడి ఆమె బీజేపీలో చేరి ప్రధాన ప్రవక్తల్లో ఒకరిగా మారిపోయారు. భారతీయ జనసంఘ్ 1977లో దుకాణం కట్టేసుకుని 1980లో బీజేపీగా అవతరించాక అందరికీ తెలిసిన ఈ పార్టీ ముస్లిం నేత సికిందర్ భక్త్. వాజ్‌పేయి కేబినెట్లో మొదట్లో మంత్రిగా పనిచేశారీయన. తర్వాత యువతరం ముస్లిం నేతల్లో ప్రముఖులు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, సయ్యద్ షా నవాజ్ హుస్సేన్. యూపీకి చెందిన షియా ముస్లిం నేత ముఖ్తార్ నఖ్వీ ముస్లిం గడ్డం కాకుండా మోదీ తరహా దాడీ ఉన్న మంచి వక్త.
సంస్కృత పదాలు ఎక్కువుండే శుద్ధ హిందీలో కూడా ఆయన బాగా మాట్లాడతాడు. అలహాబాద్ యూనివర్సిటీలో ఏబీవీపీ నేతగా ఆయన హిందూ కుటుంబంలో పుట్టిన సీమా అనే సహవిద్యార్థిని ఇష్టపడి మూడు పద్ధతుల్లో (కోర్టులో మొదటిసారి తర్వాత ముస్లిం, హిందూ సంప్రదాయాల ప్రకారం) పెళ్లిచేసుకున్నారు. చాలా మంది బీజేపీ ప్రముఖ ముస్లిం నేతల భార్యలు హిందూ కుటుంబాల్లో పుట్టినోళ్లేనని, ‘లవ్ జిహాద్’ ద్వారా ఎక్కువ బాగుపడింది ఈ కాషాయపక్ష ముస్లింలేననే ప్రచారం ఉంది. ఇంతకీ, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ హిందువుల అల్లుడిగా నిన్న బీజేపీ బ్రాహ్మణ నేతలకు నాయకత్వం వహించడం ఆసక్తికర పరిణామం.
Ads
పంజాబ్‌లో ‘నల్ల బ్రామ్మడు’ లొల్లి
––––––––––––––––––––––––––––
ఈ నెల 11న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్, కమెడియన్ నవజోత్ సింగూ సిద్ధూ ముద్దాల్ అనే గ్రామంలో ఓ రాజకీయ నాయకుడిని ఉద్దేశించి, ‘‘ నల్ల బ్రాహ్మణుడు ’’ అని దూషించాడని, ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా సిద్ధూను నిషేధించాలని భారత ఎన్నికల సంఘానికి సోమవారం ఫిర్యాదు చేసింది బీజేపీ. ఈ బీజేపీ ప్రతినిధిబృందంలో ప్రేమ్ శుక్లా, ఓమ్ పాఠక్ అనే బ్రాహ్మణ నేతలు ఉండగా దానికి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ నాయక్తం వహించారు.
‘సిద్దూ తన ప్రత్యర్థిని ‘నల్ల బ్రాహ్మణుడని నిందించడం ద్వారా సమస్త బ్రాహ్మణ జాతిని అవమానించాడు. అంతేగాదు, బ్రాహ్మణులకు ఇతర కులాలకు మధ్య అగాధం సృష్టించడానికి ప్రయత్నించాడు. బ్రాహ్మలపై ఇలాంటి వ్యాఖ్య చేసి, అన్నదమ్ముల్లా ఉన్న పంజాబీల మధ్య చిచ్చు పెట్టడమే సిద్ధూ లక్ష్యం. ఈ ఎన్నికల ప్రచారంలో అంతకు ముందు, ముస్లింలందరూ కాంగ్రెస్ కు ఓటేయాలని, అలా చేస్తే ముస్లింల ఓట్లు చీలిపోవని కూడా సిద్ధూ కోరారు..,’ అంటూ నఖ్వీ నేతృత్వంలో దిల్లీలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది బీజేపీ బృందం.
హరియాణలో పెద్ద బూతేనంట!
–––––––––––––––––––––––––––
1966 నవంబర్ ఒకటి వరకూ ఒకే రాష్ట్రంగా వందేళ్లకు పైగా ఉన్న పంజాబ్, హరియాణాలో మూడు మతాలవారు (ముస్లింలు, హిందువులు, సిక్కులు) ఉన్నా ఒకే జీవనశైలి వారిని పంజాబియాత్ లో నిలిపి ఉంచింది. పంజాబీల సంపద, కష్టపడేతత్వం చూసి అసూయపడే కొందరు మాత్రం పంజాబీలకు అగ్రికల్చరే గాని, కల్చర్ లేదని ఎగతాళి చేస్తూనే ఉన్నారు. కానీ, గొప్ప సంస్కృతి పంజాబీలది. ఇండియాలో పంజాబీ మూలాలున్న హిందువులు, సిక్కులు, ముస్లింల ఉమ్మడి సంఖ్య నాలుగు కోట్లు కూడా ఉండదు.
అయితే, ఇప్పటి పాకిసాన్ పరిధిలోకి వచ్చిన పంజాబ్ ప్రావిన్స్ ప్రాంతాల్లో పుట్టిన ముగ్గురు నేతలు స్వతంత్ర భారతంలో ఇండియాకు ప్రధానులయ్యారు. వారు– గుల్జారీలాల్ నందా, ఇందర్ కుమార్ గుజ్రాల్, మన్మోహన్ సింగ్ కోహ్లీ. ఇంతకీ అసలు విషయానికి వస్తే ఈ నెల 11న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా తనకు గిట్టని పంజాబీ బ్రాహ్మణ నేత గురించి ప్రస్తావించిన సిద్ధూ, ఆయనను, ‘నల్ల బ్రాహ్మణుడు’ అంటూ ఆయన వ్యక్తిత్వాన్ని ‘కించపరిచే’ రీతిలో దూషించడం నిజంగా తప్పే. ఏ వ్యక్తినీ మనం అతని లేదా ఆమె ఒంటి రంగును సాకుగా చూపించి ఎగతాళి చేయడం, శరీర ఛాయకు కొన్ని వ్యతిరేక గుణాలు ఆపాదించడం అనాగరికమనే అంటారు.
సిద్ధూ ఓపెనింగ్ బ్యాటరేగాక, అప్పటికప్పుడు హాస్యాన్ని పండించే జాట్ సిక్కు. పంజాబ్ సిక్కుల్లో మెజారిటీ (35 శాతం) జాట్ సిక్కులే. వీళ్ల నుంచే 1966 నుంచి ఇప్పటి వరకూ మొత్తం 12 మందిలో 9 మంది ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. హరియాణాలోనూ హిందువుల్లో మూడో వంతు జాట్లే ఉన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ (పంజాబీ ఖత్రీ) కాదు గాని హరియాలో కూడా 60 శాతానికి పైగా (పది మందిలో ఆరుగురు) సీఎంలు జాట్లే. ఖట్టర్ బీజేపీ తరఫున మొదటి సీఎంగా 2015లో అధికారంలోకి వచ్చారు. ఆయన హయాంలో 2018 మేనెలలో జరిగిన స్టాప్ సెలెక్షన్ కమిషన్ (ఎచ్చెసెస్‌సీ) పోటీ పరీక్షలో బ్రాహ్మణులను కించపరిచే ప్రశ్న ఇవ్వడం తీవ్ర వివాదానికి దారితీసింది.
నాలుగు ఆన్సర్లిచ్చి, వాటిలో సరైజన జవాబు గుర్తించమని కోరే ఓ ప్రశ్నలో కూడా ‘నల్ల బ్రాహ్మణుడి’ ప్రస్తావన ‘అన్యాయంగా’ తెచ్చారు. పంజాబ్, హరియాణాలో బ్రాహ్మణ నేతలు గతంలో ఎప్పుడో కాంగ్రెస్ వెలిగిపోతున్న రోజుల్లో ముఖ్యమంత్రి పదవి చేపట్టినా గానీ వారి జనాభా ఇక్కడ బాగా తక్కువ. అయినా, ఇక్కడి హిందూ సమాజంలో బ్రాహ్మణులకు గౌరవమర్యాదలు కనీస స్థాయిలో ఇంకా దక్కుతున్నాయి. దక్షిణాది బ్రామ్మలతో పోల్చితే అందరి హితం కోరే భూసురులు ఎక్కువ ఈ రెండు వాయువ్య రాష్ట్రాల్లో. అయినా, నల్ల బ్రాహ్మణుడు అనే మాట ఎందరో మంచి బ్రామ్మల మనసుల్ని క్షోభ పెట్టింది.
బ్రాహ్మణులు నొచ్చుకునే ప్రశ్న!
––––––––––––––––––
హరియాణా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హుడా) జూనియర్ ఇంజనీర్ల భర్తీకి పెట్టిన ఎచ్చెసెస్‌సీ పోటీ పరీక్షలో అడిగిన మల్టిపుల్ చాయిస్ ప్రశ్న: కింది చెప్పిన వాటిలో ఏది కనిపిస్తే అశుభానికి సంకేతం?
1) ఖాళీ కుండ 2) నూనె డబ్బా 3) నల్ల బ్రాహ్మణుడితో భేటీ 4) బ్రాహ్మణ పిల్ల కంటపడడం
ఈ నాలుగు జవాబుల్లో చివరిదైన బ్రాహ్మణ యువతి దర్శనంపై హరియాణా అసెంబ్లీ మాజీ స్పీకర్ కులదీప్ శర్మ (కాంగ్రెస్)కు అప్పట్లో అభ్యంతరం చెప్పాలనిపించలేదు కానీ, నల్ల బ్రాహ్మణుడితో ముచ్చట పెట్టుకోవడం కీడుకు చిహ్నమని ఈ పరీక్ష ప్రశ్నకు ఇచ్చిన జవాబుల్లో ఒకటి కావడం చాలా తప్పనిపించింది. పరీక్ష ముగిసిన వెంటనే అలజడి రేగింది.
ఎచ్చెసెస్‌సీ ఈ ప్రశ్నను ఉపసంహరించుకుని, విచారం ప్రకటించింది. అయినా సంతృప్తి చెందని కాంగ్రెస్ బ్రాహ్మణ నేత కులదీప్ శర్మగారు ఈ ప్రశ్నను మొదట అనుమతించిన అధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని, ముఖ్యమంత్రి ఖట్టర్‌ను సహ నిందితుడిని చేయాలని డిమాండ్ చేశారు. ఈ గొడవపై మౌనంగా ఉన్న ఖట్టర్ కావాలనే బ్రాహ్మణులను అవమానించారని, వారంలోగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోతే తానే స్వయంగా పాంచ్‌కులా పోలీసులకు ఫిర్యాదు చేస్తానని శర్మ హెచ్చరించారు.
‘‘ నరేంద్రమోదీ పాలనలో బ్రాహ్మణులకు విలువలేదు. ఈ ప్రశ్న బీజేపీ మైండ్ సెట్ కు అద్దం పడుతోంది. రాష్ట్ర సర్కారు ఈ దుర్మార్గపు ప్రశ్నను పరీక్ష పత్రంలో చేర్చడానికి బాధ్యులైన అధికారులపై చర్యలకు ఉపక్రమించకపోతే, బ్రాహ్మణ సంఘాలతో సంప్రదించి 101 మంది నల్ల బ్రాహ్మణులతో ముఖ్యమంత్రి నివాసం ముందు నిరసన ప్రదర్శన జరిపిస్తా,’’ అంటూ విలేఖరుల సమావేశంలో కోపంతో ఊగిపోయారు కులదీప్ శర్మ. తర్వాత 101 మంది నల్ల బ్రాహ్మణుల నిరసన లేకుండానే శర్మగారిని బీజేపీ సర్కారు బుజ్జగించింది.
ఒక్క బ్రాహ్మణుడు ఎదురొస్తేనే కీడు శంకించే ఆర్యావర్తంలో– పదవిలో ఉన్న ఓ క్షత్రియ (ఖత్రీ) ముఖ్యమంత్రి ఇంటి ముందుకు నూటొక్క మంది నల్ల బ్రాహ్మణులు వచ్చి నిలబడితే, హరియాణా ఏమైపోతుందనే భయమే సమస్యను పరిష్కరించింది. 2018 మే నెలలో హరియాణాలో నల్ల బ్రాహ్మణుడి ప్రస్తావన వస్తే, నాలుగేళ్ల తర్వాత పొరుగున ఉన్న సోదర రాష్ట్రం పంజాబ్ లో సాధారణ బ్రాహ్మణ అమ్మాయి దర్శనం ప్రస్తావన లేకున్నా నల్ల బ్రాహ్మణుడు అంటూ తగవులమారి జాట్ సిక్కు రైతు బిడ్డ సిద్ధూ– ఓ పల్లెటూరులో మాట్లాడడం బీజేపీ బ్రాహ్మణులకు ఆగ్రహం తెప్చించింది.
నేను పుట్టి పెరిగిన ప్రాంతంలో 1960ల చివరి నుంచి 1980ల మధ్య కాలం వరకూ కృష్ణా జిల్లా పంచాయతీ రాజ్ రాజకీయాలను చాకచక్యంగా నడిపిన దివంగత కాంగ్రెస్ నేత, జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు, ముదినేపల్లి మాజీ ఎమ్మెల్యే పిన్నమనేని కోటేశ్వరరావుగారు కారు నలుపు రంగులో ఉండేవారు. ఓటర్లను కులాలు, మతాలవారీగా చీల్చడం కాకుండా అన్నదమ్ములనే చీల్చిపారేసే సామర్ధ్యం ఆయనకు ఉందని పేరు.
హింస లేకుండానే అన్ని చోట్లా తనవైపునకు ఎన్నికల్లో మెజారిటీ ఓటర్లను సమీకరించుకోవడం ఆయనకు 1987 జిల్లా పరిషత్ ఎన్నికల వరకూ చేతనైంది. అయితే, ఆయన పద్ధతులు, రాజకీయాలు నచ్చని నా కమ్మ స్నేహితులు మాత్రం కోపం వచ్చినప్పుడు తమ కులంలో ఆయన పొరపాటున పుట్టాడని తిడుతూ, కోటేశ్వరరావు గారిని–‘ అదేరా, మా కర్రి కోటయ్య రాజకీయం ఇది,’ అని మాట్లాడిన సందర్భాలు ఇంకా నాకు గుర్తున్నాయి. మనకు ఏదైనా సామాజికవర్గంపైగాని, వ్వక్తిపై గానీ మితిమీరిన కోపం వస్తే మొదటి బలి అయ్యేది– ఒంటి రంగే.
Share this Article