అరుణ్ గోయల్ జస్ట్, ఒక నటుడు మాత్రమే… టీవీ రామాయణంలో రాముడి పాత్ర వేశాడు… అది తన వృత్తి… అంతకుమించి మరేమీ ఉండదు… కొందరు తను కనిపించినప్పుడు మొక్కేవాళ్లు అంటే, ఏదో రాముడి విగ్రహానికి మొక్కినట్టే తప్ప అది అరుణ్ గోయల్‌కు వందనం కాదు…
సేమ్, దీపిక చికిలియా అంటే… జస్ట్ ఓ సాదాసీదా నటి మాత్రమే… టీవీ రామాయణంలో సీత… ఆమె అప్పట్లో బయట ఎక్కడ కనిపించినా సరే భక్తజనం కాళ్లు మొక్కేవాళ్లట… శ్రీకృష్ణుడి పాత్ర వేశాడు నితిశ్ భరధ్వాజ్… తనూ అంతే పాపులారిటీ వచ్చింది… అంతెందుకు ఎన్టీయార్‌లో ఎన్ని మానవ అవలక్షణాలు లేవు… ఐతేనేం, ఆయన వేసిన కృష్ణుడు, రాముడు పాత్రలతో ఆయన ఎక్కడికో వెళ్లిపోయాడు… చివరకు ఆ వేషాల్లోనే ఆయన విగ్రహాలు బోలెడు…
ఇదంతా ఎందుకు గుర్తొచ్చిందీ అంటే… దీపిక చికిలియా దైనిక్ భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పింది… అప్పట్లో రాజ్‌కపూర్ 36 ఏళ్ల క్రితం తీసిన రామ్‌తెరీ గంగా మెయిలీ అనే సినిమా తెలుసు కదా… పాటలు, సినిమా హిట్… అందులో మందాకిని అనే పిల్ల (ఆమె కథే రెండు వెబ్ సీరీస్‌లకు సరిపోతుంది, అది వేరే కథ) రాజ్‌కపూర్ చెప్పినట్టు అందాల్ని ఆరబోసింది…
Ads
ఉండీలేనట్టుండే ఓ తెల్లటి పల్చటి వోణీతో జలపాతంలో స్నానం చేస్తుంటే యువత పిచ్చెత్తిపోయింది… పిల్లకు పాలిచ్చేటప్పుడు కూడా దర్శకుడు ఆమెలోని అందాల్ని చూపడానికే ప్రయత్నించాడు… వల్గారిటీయా, క్రియేటివ్ వల్గారిటీయా, కవర్డ్ వల్గారిటీయా… విమర్శలు బోలెడు వచ్చాయి కానీ అవన్నీ సినిమాకు మరిన్ని వసూళ్లు తెచ్చిపెట్టాయి…
అవేతరహా సీన్లను ఇతర భాషాచిత్రాలు కాపీ కొట్టుకున్నాయి… అదుగో ఆ పాత్ర కోసం సరైన అమ్మాయి ఎంపిక కోసం దర్శకుడు ప్రయత్నిస్తున్న రోజులు… రాజ్‌కపూర్ బిడ్డ పేరు రీమా, రీమా బెస్ట్ ఫ్రెండ్ తండ్రి ఈ దీపిక చికిలియాకు ఫ్రెండ్… అప్పటికే దీపిక చిన్న సినిమాల్లో పెద్ద పాత్రలు, పెద్ద సినిమాల్లో చిన్న పాత్రలు వేస్తూ ఏదో కాలం నెట్టుకొస్తోంది… ఆదాయం తక్కువ, గుర్తింపూ తక్కువ…
ఆయన దీపికను రాజ్‌కపూర్ వద్దకు పంపించాడు… ‘చెప్పినట్టు చేస్తుంది’ అని హింట్ కూడా ఇచ్చాడు… తీరా రాజ్‌కపూర్ ఆమెను చూసి నీ వయస్సెంత అన్నాడు, ఈమె 17 అని చెప్పింది… నువ్వు మరీ యంగ్‌గా, అంటే చిన్నపిల్లలా కనిపిస్తున్నావు, తరువాత చూద్దాంలే అన్నాడు రాజ్‌కపూర్…
(17 ఏళ్లకు పిల్లలా కనిపించకపోతే నడివయసు దానిలా కనిపిస్తారా..? అదొక సాకు, తనకు నచ్చలేదు, మందాకిని పిల్లికళ్లు, లేత వయ్యారంలో తనకు ఆకర్షణ కనిపించింది… మరి ఆమె కూడా అప్పుడు అదే వయస్సు కదా… దీపికకన్నా చిన్నపిల్లలా కనిపించేది కదా…)
ఇంత సూపర్ హిట్ సినిమాలో హీరోయిన్ పాత్ర, అదీ రాజ్‌కపూర్ సినిమాలో అవకాశం రాలేదే అని బాధపడిందట మొదట దీపిక… తరువాత తల్లితోపాటు ఆ సినిమా చూశాక షాక్‌కు గురై, ఈ పాత్ర తనే గనుక చేసి ఉంటే, రాజ్‌కపూర్ చెబితే కాదనలేక, ఇలాగే చేయాల్సి వచ్చేది కదా అనుకుందట… Blessing in Disguise… నాడు ఆ పాత్ర రాకపోవడమే మంచిగైంది… లేకపోతే రామాయణంలో సీత పాత్ర వచ్చేది కాదు, రామ్ తెరీ గంగా మెయిలీ పాత్ర చూశాక సహజంగానే ఎవరూ సీత పాత్ర ఆఫర్ చేయరు కదా, పాత్ర ఉదాత్తత దెబ్బతింటుందని అనుకుంటారు…
సీత పాత్రతో ఆమె జీవితమే మారిపోయింది… నిజానికి ఆమెకు టీవీల్లో నటించడానికి ఇష్టం లేదు… కానీ తప్పలేదు, తప్పదు అనుకుంది, కానీ అదే పెద్ద టర్నింగ్ పాయింట్… అదే డెస్టినీ… ఈ ఇంటర్వ్యూ చదువుతుంటే పైపైన కొంత నిజమే అనిపించినా రియాలిటీ ఆలోచిస్తే మాత్రం తన ఆలోచన విధానమే కరెక్టు కాదనిపించింది…
ఒక ఉదాహరణ గుర్తొచ్చింది… బాపు తీసిన శ్రీరామరాజ్యం సినిమా… 2011లో తీసిన ఈ సినిమా నిజానికి పాత లవకుశ సినిమాకు బాపు టైప్ రీమేక్… అక్కినేని వాల్మీకిగా, రాముడిగా బాలకృష్ణ నటించాారు… బాలకృష్ణకు దట్టంగా పులిమిన నీలిరంగు, అప్పటికే మీదపడ్డ వయస్సు ఛాయలు… సరే, అదంతా వేరే కథ… కానీ అప్పటిదాకా వ్యాంప్ తరహా చిల్లర పాత్రలు వేసుకుంటూ మందాకిని చెల్లెలులాగే నటించే నయనతారను బాపు సీత పాత్రకు ఎంచుకున్నాడు…
అందరూ ఇదేం ఎంపిక అనుకున్నారు… కానీ సీతగా నయనతార చాలా బాగా చేసింది… ఆ పాత్రలో ఒదిగిపోయింది… ఈమె ఆ నయనతారేనా అనుకున్నారు, ప్రేక్షకులు కూడా ఆమోదించారు… అదే సినిమాతో తన కెరీర్ ఎండ్ చేద్దామనుకుంది, షూటింగ్ చివరి రోజు అందరికీ వీడ్కోలు పలికింది ఆమె కన్నీళ్లతో… కానీ తరువాత బోలెడు పిచ్చి గ్లామర్ పాత్రలు గట్రా చేసింది, ఈరోజుకూ టాప్ రేటెడ్, హైలీ పెయిడ్ హీరోయిన్ ఆమె… సో, మందాకిని పాత్ర చేసి ఉంటే తనను సీతగా యాక్సెప్ట్ చేసేవారు కాదేమో అనే దీపిక భావనకు అర్థం లేదు…!!
Share this Article