నిన్నటి ఇండియా – బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్ మీద ‘ఈనాడు’ ఓ వార్త పబ్లిష్ చేసింది… హార్ధిక్ పాండ్యా మీద కథనం… గేలి చేసినోళ్లే… అని శీర్షిక… నిజంగానే పాండ్యా ఫామ్ కోల్పోయాక ఈమధ్య మళ్లీ గాడిలో పడ్డ తీరును, తన ఫెయిల్యూర్లను సమప్ చేసి రాశారు, బాగుంది…
అందులో ఈ మ్యాచ్‌లో పాండ్యా అర్ధశతకం గురించి కూడా ప్రస్తావించారు… పైన ఇచ్చిన మెయిన్ వార్తలో స్కోర్ కార్డులో కూడా పాండ్యా 50 పరుగులు చేసినట్టు రాశారు… కంటెంటులో కూడా 50 రన్స్ ప్రస్తావించారు… తీరా దిగువన ఇచ్చిన బాక్సుల్లో ‘‘టీ20 చరిత్రలో తమ టాప్-5 బ్యాటర్లలో ఒక్కరూ అర్థశతకం చేయకుండా ఇండియా చేసిన రెండో అత్యధిక స్కోర్ ఇది … 196… 2019లో న్యూజిలాండ్‌పై 208 పరుగులు సాధించింది’’ అని రాసుకొచ్చారు…
Ads
టాప్-5 బ్యాటర్లు అనే ప్రస్తావన దేనికి..? టాప్-5 అంటే మొదటి అయిదుగురా..? మిగతావాళ్లు వికెట్ కీపర్లు, బౌలర్లేనా..? టాప్-5 లో ఆల్ రౌండర్లు ఉండరా..? 5 కి దిగువన ఆల్ రౌండర్లు ఉండరా..? బ్యాటర్లు ఉండరా..? ఇదేం సూత్రీకరణో… ఓపెనర్లు, మిడిల్ ఆర్డర్, టెయిల్ ఎండర్లు అనే వర్గీకరణ చదివాం గానీ ఈ టాప్-5 బ్యాటర్లు ఏమిటో మరి…
నిజానికి ఈనాడులో ఛాంపియన్ పేజీ బాగుంటుంది… ఎందుకంటే..? అందులో తమ పొలిటికల్ లైన్‌ను బట్టి చిమ్మాల్సిన విషం గానీ, జల్లాల్సిన బురద గానీ ఉండదు… వార్త వార్తలాగే ఉంటుంది… వక్రీకరణలూ ఉండవు… తప్పులు కూడా చాలా తక్కువ… కానీ ఎందుకో ఈమధ్య ఈనాడు స్పోర్ట్స్ పేజీ కూడా మొన్నమొన్నటి హార్ధిక్ పాండ్యా ఫామ్‌లాగే తన ఫామ్ కోల్పోయినట్టుంది…
మరో ఉదాహరణ చెప్పుకుని ముగిద్దాం… నిన్నటి స్పోర్ట్స్ పేజీలో ‘‘టీ20 ప్రపంచకప్ సూపర్-8 దశలో వరుసగా రెండో విజయంతో దక్షిణాఫ్రికా సెమీస్‌కు చేరువైంది… శుక్రవారం గ్రూప్-2లో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచులో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది’’ అని రాసుకొచ్చారు… నిజానికి అది 7 పరుగుల తేడా… మొదట ఆడిన దక్షిణాఫ్రికా 163 పరుగులు చేస్తే, తరువాత ఆడిన ఇంగ్లండ్ కేవలం 156 పరుగులే చేసి, ఏడు పరుగుల తేడాతో ఓడిపోయింది…
రెండు జట్లలోనూ ఆరేసి వికెట్లు పడ్డాయి… ఐనా రెండోసారి బ్యాటింగు చేసిన జట్టు గెలిస్తే ఇదుగో ఇన్ని వికెట్ల తేడాతో గెలిచిందీ అని రాస్తాం కదా… ఇక్కడ ఎన్ని వికెట్లు పడ్డాయనేది ముఖ్యం కాదు… లేకపోతే ఇంకా ఇన్ని బంతులు మిగిలి ఉండగానే గెలిచింది అని కూడా ప్రస్తావిస్తాం… ఇక్కడ రెండు జట్లలోనూ 6 వికెట్లు పడ్డాయి… ప్చ్, ఈనాడు క్రీడావార్త రచన కూడా చివరకు… ఫాఫం..!! పాఠకుడు పరిహసిస్తాడు అనే సోయి కూడా లోపించినట్టుంది ఈ నడుమ..!!
Share this Article