బూట్‌కట్ బాలరాజు సినిమాకు సంబంధించి సోహెల్ చేసిన తప్పులేమిటి..? చాలా ఉన్నాయి… అందులో కొన్ని ముఖ్యమైనవి…
బిగ్‌బాస్ కంటెస్టెంటుగా పాపులరైన సోహెల్ ఆ షోకూ, రెగ్యులర్ సినిమాకు నడుమ తేడా తెలుసుకోకపోవడం… బిగ్‌బాస్ హౌజులో ఉన్నప్పుడు నాకు మస్తు సపోర్ట్ చేశారు, కామెంట్స్ పెట్టారు, ఇప్పుడేమైంది అని ఆశ్చర్యపోవడం విస్మయకరమే… బిగ్‌బాస్ వేరు, కమర్షియల్ సినిమా వేరు… బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్లుగా ఉన్న పదీపదిహేను మందిలో ఎవరు యాక్టివ్, టాస్కుల్లో ఎవరు బాగా చేస్తున్నారనే అత్యంత పరిమిత చట్రంలో కంటెస్టెంట్లను జడ్జ్ చేస్తారు… అంతే తప్ప అది సినిమాలకు పనికొచ్చే ‘ఆదరణ’ కాదు…
బిగ్‌బాస్ విజేతలుగా నిలిచి కూడా ఎందరు బయట నటులుగా, హీరోలుగా క్లిక్కయ్యారో ఓసారి సోహెల్ అధ్యయనం చేసి ఉండాల్సింది… ఎవరూ క్లిక్ కాలేదు… సినిమాలో కూడా బిగ్‌బాస్‌లో పాల్గొన్న రోహిణి, అవినాష్, సిరి హన్మంతు తదితరులే కనిపిస్తుంటారు సినిమాలో… ఆఖరికి గంగవ్వ కూడా ఉంది… సోహెల్ సరేసరి… ఆహా ఓటీటీలో కామెడీ ఎక్స్‌చేంజ్ అనే కామెడీ షో వస్తుంది… అందులో ఆరుగురు పార్టిసిపెంట్లు… వారిలో రోహిణి, సద్దాం, అవినాష్… ఆ ముగ్గురూ ఇందులో ఉన్నారు… వీళ్లకుతోడు జబర్దస్త్ కామెడీ షోలో జడ్జిగా చేసే ఇంద్రజ… మరో కమెడియన్ బాబు… సో, ఏదో టీవీ ప్రోగ్రాం చూస్తున్నట్టే అయిపోయింది…
Ads
మొన్నటి ఎన్నికల్లో నాకు వోటు వేయకపోతే మా కుటుంబం మొత్తం మూకుమ్మడి ఆత్మహత్య చేసుకుంటామని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసిన కౌశిక్ గెలిచాడు… కానీ సినిమాలకు సంబంధించి ఇదే తరహా వేడుకోళ్లు, కన్నీళ్లు పనిచేయవు… తన తండ్రి దాచుకున్న పెన్షన్ల డబ్బు, తను ఇల్లు కట్టుకోవడానికి దాచుకున్న డబ్బు మొత్తం పెట్టి సినిమా తీశానని సోహెల్ రిలీజుకు ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడు… ప్రేక్షకుడు సానుభూతితో థియేటర్‌కు వెళ్లడు… వాడు కంటెంట్ చూస్తాడు… వాడికి సినిమా కనెక్ట్ కావాలి, అలాగైతేనే మౌత్ టాక్ మంచిగా వచ్చి సినిమా పాసవుతుంది…
సోహెల్ నటుడిగా వోకే… కామెడీ టైమింగ్ ఉంది, ఎనర్జీ ఉంది, ఎమోషన్ కూడా బాగానే చేయగలడు… కానీ అదే సరిపోదుగా సినిమాకు… కథాకథనాలు రక్తికట్టాలి… ఏదైనా కొత్తదనం కావాలి… ఓ సర్పంచి, ఓ ప్రేమికుడు సవాల్ చేయడం, గెలవడం వరకూ వోకే… కానీ దాన్ని ప్రేక్షకుడికి కనెక్ట్ చేసే ప్రజెంటేషన్ అవసరం… అది సినిమాలో లేదు…
సునీల్, రోహిణి, సద్దాం, అవినాష్ స్వతహాగా మంచి టైమింగ్ ఉన్న టీవీ కమెడియన్లు… సునీల్ గురించి చెప్పనక్కర్లేదు… కానీ ఇంద్రజ, సునీల్ వంటి సీనియర్ల నుంచి మంచి ఎఫెక్టివ్ నటనను రాబట్టుకునే సీన్లు లేవు… అక్కడక్కడా కామెడీ కాస్త వర్కవుట్ అయింది గానీ స్థూలంగా ఏదో సాదాసీదా బిగ్‌బాస్ షో, జబర్దస్త్, కామెడీ ఎక్స్‌చేంజ్ షోలను చూస్తున్నట్టే అనిపించింది కానీ ఓ కమర్షియల్ రెగ్యులర్ సినిమా చూస్తున్నట్టు అనిపించలేదు… అవునూ, సోహెల్… బూట్ కట్ అని టైటిల్‌లో పెట్టుకున్న పదానికి సినిమాలో జస్టిఫికేషన్ ఏముంది..? (ఈ సినిమా కథారచనలో జబర్దస్త్ రాంప్రసాద్ కూడా పార్టనరా..?)
మెరిట్ ఉన్న సంగీత దర్శకుడు బీమ్స్ సిసిరిలియో, కాసర్ల శ్యాం ఎట్సెట్రా టీం నుంచి సరైన ఔట్ పుట్ తీసుకోలేకపోయారు… హీరోయిన్ సోసో… అన్నింటికీ మించి సినిమాకు పోయేముందు ఓసారి వికీలో ఈ సినిమా పేజీ ఓపెన్ చేస్తే నటీనటుల్లో అనన్య నాగళ్ల, సుమన్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ తదితరుల పేర్లు కనిపించాయి… అవునూ, ఇందులో రాజీవ్ కనకాల కూడా ఉన్నాడా..? ఎవరున్నారో, ఎవరొచ్చి పోతున్నరో కూడా సమజ్ కానంత గందరగోళం…
‘సింగరేణి ముద్దుబిడ్డ, కథ వేరుంటది’ అని బిగ్‌బాస్‌లో సోహెల్‌ను భిన్నంగా చూశాం… ప్చ్, ఈ సినిమాలో అలా జిగేలుమనే సరుకు లేదబ్బా సోహెల్… పైగా బిగ్‌బాస్ షో చివరలో డబ్బు సూట్‌కేసు తీసుకుని వెళ్లిపోవడమంత వీజీ కాదు ఓ సినిమాను రక్తికట్టించడం..!! అన్నట్టు… తెలంగాణ సినిమా అనగానే తాగుడు సీన్లు తప్పనిసరి అనే ఓ ధోరణి కనిపిస్తోంది కదా… ఇందులోనూ తక్కువేమీ లేదు..!! చివరి వాక్యం… సోహెల్ భాయ్… పిల్లి శాపాలకు ఉట్లు తెగవు, హీరో శోకాలకు టికెట్లు తెగవు…!!
Share this Article