ఒక్క చంద్రబాబును, తెలుగుదేశం పార్టీ దాస్యాన్ని పక్కన పెడితే… ఆంధ్రజ్యోతి చాలా అంశాలపై కుండబద్ధలు కొడుతుంది… ఇదీ అలాంటి వార్తే… కేసీయార్ ప్రతిపాదిత జాతీయ పార్టీకి బ్రేకులు పడ్డట్టేననీ, అటక మీదకు పారేసినట్టేనని, ఇక దేశంలో గాయిగత్తర ఏమీ ఉండదనీ ఫస్ట్ పేజీలో ఓ వార్త కుమ్మేసింది… అయ్యో, కొన్ని వందల కోట్ల తెలంగాణ ప్రజాధనం అడ్డగోలు యాడ్స్ మీద వృథా అయినట్టేనా అని బాధపడకండి… నిజానికి ఇదేమీ ఊహించనిది కాదు…
కేసీయార్ తనేమైనా చెప్పాడా..? నా జాతీయ పార్టీ ఇలా ఉంటుంది అని… మీ తీటకొద్దీ మీరు రాసుకున్నారు… అప్పుడెప్పుడో గత పార్లమెంటు ఎన్నికల ముందు ఘీంకరించాడు ఇక జాతీయ రాజకీయాల్లో దుమ్మురేపుతాను అని, గాయిగత్తర లేపుతాను అని… ఎందుకు జరగలేదు..? కేసీయార్ పదే పదే ఒక అంశాన్ని గట్టిగా లీకులు ఇచ్చి రాయించుకుంటున్నాడు అంటే… అది జరగదని లెక్క… అయ్యో, అయ్యో, మా కేసీయార్ ప్రధాని కాడా ఇక..? అంతా ఉత్తముచ్చటేనా అని నిరాశపడనక్కర్లేదు…
ఇదే విషయాన్ని ఇంకా పదే పదే ప్రచారంలోకి తీసుకురావడానికి కేసీయార్ రెడీ… ఎటొచ్చీ మధ్యలో ప్రశాంత్ కిషోర్‌ను పిచ్చోడిని చేస్తాడు తను… ఒక రాకేష్ టికాయిత్, ఒక ప్రకాష్ రాజ్, ఒక ప్రశాంత్ కిషోర్… వస్తుంటారు, పోతుంటారు… పిచ్చోళ్లయి ఏం జరుగుతోందో అర్థం గాక ఎడ్డి మొహాలు వేస్తారు… అసలు కేసీయార్ ఢిల్లీలో రైతు దీక్ష చేపట్టినప్పుడు ఒక్కడంటే ఒక్క పార్టీ ప్రతినిధి వచ్చి సంఘీభావం ప్రకటించలేదు అంటేనే అర్థం కావాలి కదా… అసలు ఇన్నిరోజులుగా జాతీయ పార్టీ అని ఓసారి, ఫ్రంట్ అని మరోసారి మాట్లాడుతున్నప్పుడే అర్థం కావాలి కదా…
Ads
తను తెలంగాణలో ప్రబల ప్రత్యర్థిగా పరిగణిస్తున్న బీజేపీ హైదరాబాదులో జాతీయ కార్యవర్గ భేటీలు పెట్టి, హడావుడి చేస్తుంటే… శుష్క స్థాయి ఉల్టా ప్రచారాలతో కౌంటర్ చేయడానికి ప్రయత్నించడమే తప్ప… ఓ ప్రతిపాదిత జాతీయ పార్టీ హోదాలో ఏమైనా స్పందించిందా..? ఇన్నేళ్లుగా తెలుగు కిరాయి మీడియాలో పలు లీకు వార్తలు మినహా ఒక్కటైనా కాంక్రీట్ సమర్థన కథనం జాతీయ మీడియాలో కనిపించిందా..? అసలు కేసీయార్ జాతీయ పార్టీకి ఉండబోయే సాంకేతిక ఇబ్బందుల మీద చర్చ జరుగుతోందా..?
బీఆర్ఎస్ అని పార్టీ పెడితే, తెలంగాణలో ఏ పార్టీ పేరుతో పోటీచేస్తారు..? ఈ ప్రశ్నకే టీఆర్ఎస్ క్యాంపులో సమాధానం లేదు… అసలే జనంలో పెరుగుతున్న వ్యతిరేకత… కేసీయార్ నమ్ముకున్న అహోబిలం బ్యాచ్ నాయకులతో నానాటికీ ప్రభుత్వ, పార్టీ ప్రతిష్ట కొడిగుడుతున్నవేళ రిస్క్ తీసుకోవడానికి కేసీయార్ సిద్ధపడతాడా..? అంతా ఉత్తదే… జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ జరిగేది ఉంటే అదెప్పుడో జరిగి ఉండేది… అదీ నిజం…
కానీ కేసీయార్ బీఆర్ఎస్‌ను అటక మీదకు విసిరేయడంతో తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ బీజేపీ తీవ్రంగా నిరాశపడ్డట్టే…! వోటర్లలో గందరగోళం నెలకొని, తమకు ఫాయిదా వస్తాయని ఆశపడ్డాయి… నిజంగానే కేసీయార్ జాతీయ పార్టీ పెడితే ప్రశాంత్ కిషోర్ ఫోటోలకు ఊరూరా పాలాభిషేకాలు చేయడానికి ఆ రెండు పార్టీలు రెడీ అయ్యాయి కూడా… ప్చ్, మళ్లీ వాటిపై కేసీయార్ నీళ్లు గుమ్మరించాడు… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసిందే జరగాలని ఏమీ లేదు… హఠాత్తుగా కేసీయార్ జాతీయ తెర మీద ప్రత్యక్షమై ప్రధాని కావొద్దనీ ఏమీ లేదు… ఇప్పుడున్న స్థితిని విశ్లేషించుకోవడమే కరెక్టు… కానీ బీఆర్ఎస్ ఏర్పాటుకు సాంకేతిక, రాజకీయ అడ్డంకుల మీద సమగ్ర విశ్లేషణ ఏదైనా రాస్తే బాగుండేది… ఏమోలే… వచ్చే ఆదివారం కొత్త పలుకులో ఆ అమూల్య విశ్లేషణ కూడా వస్తుందేమో…!!
Share this Article