ఆశ్చర్యం వేసింది… అసలు ఈ సినిమా ఎప్పుడు విడుదలైంది..? మామూలు సోది, సొల్లు చిత్రాలకే బోలెడంత ప్రమోషన్ యాక్టివిటీ ఉంటుంది కదా… ఈ సినిమాను చడీచప్పుడు లేకుండా ఎందుకు రిలీజ్ చేశారు..? సినిమా బాగుంటే జనం చూస్తారు కదా అనే ధీమాయా..? కానీ కనీస స్థాయి పబ్లిసిటీ అయినా అవసరం కదా… నిజమే, ఈమధ్య మీడియా మీట్లు, స్పెషల్ ఇంటర్వ్యూల ‘‘ఖర్చు’’ విపరీతంగా పెరిగింది సరే.., పోనీ, సోషల్ మీడియాను వాడుకోవచ్చు కదా… థియేటర్ల నుంచి ఎప్పుడు వెళ్లిపోయిందో తెలియదు, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో పెట్టారు… సోషల్ మీడియాలో రివ్యూలు కనిపిస్తున్నయ్… కొందరి నుంచి ప్రశంస… మరికొందరి నుంచి భిన్నంగా… సినిమా పేరు Ad Inifinitum… అవును, అలాగే ఇంగ్లిషులో పెట్టారు పేరు… అనంతం అనీ, పదే పదే, నిరంతరం, ఎల్లప్పుడూ అని దానికి పలు అర్థాలున్నా… అనంతం అనే అర్థమే ఈ సినిమా కథకు ఆప్ట్… సినిమాకు పెద్ద మైనస్ ఆ పేరే… ఏదో ఇంగ్లిషు సినిమా అనుకుని ఎవరూ దాని వైపు కన్నెత్తి చూడలేదు…
ఈ ఫోటో ఏమిటి రివర్స్‌లో ఉంది అర్థం గాకుండా… అనిపిస్తోందా..? చాలామందికి సినిమా కథ అర్థం కాదు… అక్కడికీ దర్శకుడు ‘దీన్నెలా వివరించాలి’ అంటూ ప్రధానపాత్రధారితో వివరంగా చెప్పించే ప్రయత్నం చేశాడు… ఐనా సరే… కొంత కాంప్లెక్స్ సబ్జెక్టు… ఇది థ్రిల్లర్, మంచి సస్పెన్స్ మెయింటెయిన్ చేశాడు దర్శకుడు… సైన్స్ ఉంది, క్రైమ్ ఉంది, కాస్త పీరియాడిక్ డ్రామాను కూడా కలిపాడు… ఒకందుకు దర్శకుడిని మెచ్చుకోవాలి… ఒక్కటంటే ఒక్క సీనూ దారితప్పకుండా చూశాడు… ఒక్క పొల్లు డైలాగూ ఉండదు… వల్గారిటీ ముచ్చటే లేదు… నటుల నుంచి ఓవరాక్షన్ లేదు, తక్కువ చేసింది లేదు… కావాలని కృత్రిమంగా కామెడీని గానీ, ఐటమ్ సాంగ్‌ను గానీ ఇరికించే కక్కుర్తి కూడా కనిపించలేదు… నేపథ్యసంగీతం, సినిమాటోగ్రఫీ గట్రా ఎంతకావాలో అంత… అతి లేదు, అసలు లేకుండా లేదు…
Ads
హీరోయిన్ ప్రీతి అస్రానీ ముద్దుగా బాగుంది… త్రిపాత్రాభినయం చేసిన హీరో నితిన్ ప్రసన్న కూడా బాగా చేశాడు… ఎటొచ్చీ కథలో సంక్లిష్టత, స్లో కథనమే కాస్త చికాకు పెడతయ్ సినిమాలో… సరే, ఎలాగూ కథ ఓ కల్పన, ఓ ఇమాజినరీ కంటెంట్ కాబట్టి దాంట్లో లాజిక్కులు వెతకొద్దు… సినిమా ఫస్ట్ నుంచీ ఓ మంచి క్రైం పుస్తకాన్ని చదువుతున్నట్టుగా సాగిపోతుంది… కానీ సగటు ప్రేక్షకుడికి అది సరిపోతుందా..? చివరి వరకూ మంచి సస్పెన్స్ కూడా దర్శకుడు మెయింటెయిన్ చేశాడు గానీ… ప్రేక్షకుడు ఆశించే థ్రిల్ ఏదో మిస్సయిన ఫీలింగ్… అన్నింటికీ మించి థ్రిల్లర్, సైకో పాత్రలు అనగానే పిల్లల్ని బాధితులుగా చూపే సినిమాలే ఎక్కువగా వస్తున్నయ్… పిల్లల్ని హింసించే కథతో ప్రేక్షకుడు కనెక్ట్ కావడం కష్టం… మరీ అసాధారణ ట్రీట్‌మెంట్ ఉంటే తప్ప… ఇక్కడా అదే… (అఫ్ కోర్స్, ఇందులో సైకో పాత్ర లేదు…) ఇంకా కథ లోపలకు వెళ్తే సస్పెన్స్ పోతుంది కాబట్టి ఇక్కడే వదిలేద్దాం… ఎలాగూ థియేటర్ల వైపు వెళ్లడం రిస్క్, కొత్తగా వచ్చిన సినిమాల్లో మరీ చూడదగినవి కూడా ఏమీ లేవు… ఎలాగూ అమెజాన్‌లోనే కదా ఉంది… ఓసారి చూడొచ్చు… సగటు తెలుగు సినిమా అవలక్షణాలకు దూరంగా ఉంటుంది… మీరు అలాంటి సినిమాలకే బాగా అలవాటు పడి… తినగ తినగ వేము బ్యాచ్ ప్రేక్షకులైతే మీకు సినిమా నచ్చకపోవచ్చు… భిన్నమైన కథల్ని కోరుకునే వాళ్లకు బాగానే నచ్చొచ్చు…!!
Share this Article