అప్పుడెప్పుడో చిన్న పోరడి లెక్క ఉన్నప్పుడు… జయం అనే సినిమా వచ్చింది… 2002 కావచ్చు… దాదాపు ఇరవయ్యేళ్లు… ఒక హీరోకు ఎంత సుదీర్ఘమైన కెరీర్… ఎస్, ఇది నా సినిమా అని చెప్పుకునే ఒక్క సినిమా, ఒక్క పాత్ర లేకపోతే… ఆ హీరోను ఏమనాలి..? ఫీల్డులో అలాంటోళ్లు చాలామంది ఉన్నారు… కానీ ప్రస్తుతానికి నితిన్ రెడ్డి అనాలి…!! జయం సినిమాకూ ఇప్పటికీ తనేమైనా మారాడా..? లేదు… ఒక నటుడిగా అలాగే ఉన్నాడు… తను మారడు, మారే సవాలే లేదు… మరో ఇరవయ్యేళ్లు పోయినా అలాగే ఉంటాడు… ఆఫ్టరాల్ మారాల్సిన పనేముంది..? ఓ మంచి పాత్ర కోసం అన్వేషణో, తపనో, కాంక్షో తనకు ఉండాలని ఏముంది..? ఎవడో ఓ దిక్కుమాలిన నిర్మాత దొరుకుతూనే ఉంటాడు… పక్కన చిందులేయడానికి కీర్తి సురేష్ వంటి బకరీ కనిపిస్తూనే ఉంటుంది… ఎన్ని సినిమాలు ఫట్ అంటేనేం..? సినిమా తీశామా లేదా..? జనం పైకి వదిలామా లేదా..? అంతే… అదొక్కటే లెక్క…
ఇప్పుడు మరో సినిమా తీసి వదిలారు… ఓ హిందీ పేరు… రంగ్ దే… దానికి ఓ పిచ్చి ట్యాగ్ లైన్… గిమ్మీ సమ్ లవ్… తీసినవాళ్లకు దండాలురా బాబూ… వీసమెత్తు కొత్తదనం లేకుండా సినిమా తీయడం ఎలా అనేది మిమ్మల్ని చూసే నేర్చుకోవాలి… అసలు ఏముందీ సినిమాలో… ఎందుకు తీసినట్టు దీన్ని..? అసలు దీనికి రివ్యూలు కూడా అవసరమా..? పక్క పక్క ఇళ్లు… కలిసి పెరిగిన ఇద్దరు పిల్లలు… ఒకరంటే ఒకరికి పడదు… కానీ హీరోగాడి ప్లాన్ ఎదురుతన్ని తనే ఆమెను అనివార్యంగా పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది… ఇక ఇగోలు… కలిసి దుబాయ్ వెళ్తారు చదువు కోసం… సంసారం, అనుకోని స్థితిలోనే శృంగారం… ఇక విడాకుల కోసం, అబార్షన్ కోసం హీరో బతిమిలాట… చివరికి ఏమైంది..? ఏమవుతుంది..? సగటు తెలుగు సినిమాలో ఏం జరుగుతుందో అదే జరుగుతుంది… అలా శుభం కార్డు పడగానే బతుకు జీవుడా అని ప్రేక్షకుడు పరుగో పరుగు…
Ads
ఫాఫం, కీర్తి సురేష్… ఇలాంటి సినిమాలు మరో రెండుమూడు పడితే ఇక మటాషే… ఇంతటి మహానటి సైతం చిరాకు పుట్టిస్తుంది సినిమాలో… చివరకు ఆ మేకప్పు సరిగ్గా కుదరలేదో ఏం పాడో… నవ్వినా కృతకంగానే కనిపించింది… నితిన్ ఏముంది..? ఇలాంటి సినిమాలే తీస్తూ తీస్తూ మరో ఇరవయ్యేళ్లు కాలం గడిపేయగలడు… కానీ ఎటొచ్చీ కీర్తి సురేష్‌కే…!! అప్పట్లో కాస్త పుష్టిగా ముద్దుగా ఉండే ఆమె ఇందులో ఎండుకపోయి కనిపించింది… అసలు కొత్తదనం లేని సినిమాలో… రాసుకున్న సీన్లను కూడా పీకి పీకి, సాగదీసి, బోర్ కొట్టిస్తాడు దర్శకుడు ఎవరో గానీ… చివరకు ఈ సినిమాకు పనిచేయడం మిగతా విభాగాల వాళ్లకూ బోరింగే అన్నట్టుంది… దేవిశ్రీ ఎవరో తన జూనియర్లకు మ్యూజిక్ కంపోజింగ్ అప్పగించినట్టున్నాడు… మొత్తానికి ఏది చూసినా ఇదే తీరు… సర్లె, ఓటీటీలో వచ్చేదాకా ఆగుతాం అంటారా..? పర్లేదు… ఎప్పుడైనా టీవీల్లో వచ్చినప్పుడు అప్పుడు కాస్త అప్పుడు కాస్త చూసినా పర్లేదు… నిజం చెప్పాలా.,? సింగిల్ లైన్లో… అంత ఆగి ఆగి చూసేంత కూడా ఏమీ లేదు ఇందులో… లైట్ తీసుకొండి… ఓ పాతబడిన పిచ్చి సరుకుకు కొత్త రంగు పూసి ‘రంగ్ దే’ అని మనకు కొత్తగా అంటగట్టే ప్రయత్నం చేశాడు దర్శకుడు… రోజులు మారాయోయ్… నీలాంటోళ్లను చాలామందిని చూస్తున్నారులే కొత్తతరం ప్రేక్షకులు…!!
Share this Article