.
ఓటమిని, ప్రజల వ్యతిరేక తీర్పును ఈరోజుకూ జీర్ణించుకోలేని, ఆమోదించలేని అసహనం, ఫ్రస్ట్రేషన్… వెళ్లాల్సిన దారి ఏదో తెలియని అగమ్య ప్రయాణం… సొంతింటి ఆడబిడ్డ నుంచే తిరుగుబాటు, ధిక్కార ప్రకంపనలు… వెరసి బీఆర్ఎస్ పెద్ద తలలను ఏదో మనోచాంచల్యం లేదా వైకల్యం ఆవహించినట్టుంది…
- దీనికి మెడికల్, సైకలాజికల్ పరిభాషల్లో ఏం పదాలున్నాయో తెలియదు గానీ… సింపుల్‌గా ఒకటీరెండు ఉదాహరణలు చూద్దాం… ఈరోజు కొత్త జిల్లాల హేతుబద్ధీకరణపై బీఆర్ఎస్ క్యాంపు స్పందన… జిల్లాల జోలికొస్తే అగ్గిరాజేస్తాం, భూకంపం పుట్టిస్తాం అన్నట్టుగా కేటీయార్ బెదిరింపులు… సికింద్రాబాద్ పేరు లేకుండా చేస్తే మర్యాద దక్కదు అని పాత సమైక్యవాది తలసాని శ్రీనివాస్ హెచ్చరికలు…
అన్నింటికీ మించి ‘చంద్రబాబు కోసం హైదరాబాదును ఫ్రీజోన్ చేయాలనే రేవంత్ కుట్రలో భాగమే జిల్లాల పునర్వ్యవస్థీకరణ అని నమస్తే తెలంగాణ తేల్చిపారేయడం..! పదే పదే ఒక వ్యక్తిని బూచిగా చూపి, పబ్బం గడుపుకునే వికట ధోరణిని మానసికశాస్త్రంలో ఏమంటారో తెలియదు కానీ అదేదో ఫోబియా ఆ క్యాంపును బలంగా ఆవరించింది…
Ads
లేకపోతే చంద్రబాబు కోసం హైదరాబాదును ఫ్రీజోన్ చేయడం ఏమిటి..? ఇదే గాలిలో నుంచి బురద పుట్టించి, టన్నుల కొద్దీ గుమ్మరించడం..!! గాయిగత్తర రేపే ప్రయత్నాలు చేయడం..!! రేవంత్ రెడ్డి పలు ఊహాగానాలకు తెరదించుతూ నిన్న స్పష్టంగా చెప్పాడు…

- ‘‘జిల్లాలు, మండలాల సంఖ్య పెంచడమో, కుదించడమో కాదు… కేసీయార్ హయాంలో అశాస్త్రీయంగా, హేతురహితంగా సాగిన జిల్లాల ఏర్పాటును హేతుబద్ధీకరిస్తాం… పేర్లనూ మార్చబోం… అదీ మా పొలిటికల్ ఆలోచనలకు అనుగుణంగా కాదు, ఓ జుడిషియల్ కమిషన్ వేసి, జిల్లాలన్నీ తిరిగి వాళ్లిచ్చే రిపోర్టు ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటాం… సికింద్రాబాద్ పేరు మేమేమీ తీసేయలేదు… జిల్లాల్లో సరైన జనాభా సమతుల్యత ఉండేలా చూడటమే మా ఉద్దేశం’’
ఏదో ఒకటి గోకాలి కాబట్టి… కేటీయార్ గాయిగత్తర, అగ్గి అంటాడు… తన క్యాంపేమో ఫ్రీజోన్ అనే తిక్క జోస్యాలు, విశ్లేషణలకూ పూనుకుంటుంది… మొదటి నుంచీ తెలంగాణ వ్యతిరేకిగా ఉన్న శ్రీనివాస యాదవ్ మరి సికింద్రాబాద్ జిల్లా పేరు లేకపోతే కేసీయార్ మీద ఒక్క మాటా మాట్లాడలేదేం ఆనాడు..?

ఇంకెవరో ఊహాగానాలు రాస్తారు… లోకసభ నియోజకవర్గాలతో కోటర్మినస్ చేస్తారని..! అసలు సంఖ్యే తగ్గించం అని రేవంత్ రెడ్డే చెబుతున్నాడుగా… పైగా ఇప్పుడు లోకసభ నియోజకవర్గాలనే జిల్లాలు చేసే పక్షంలో… రాబోయే లోకసభ స్థానాల పునర్య్వవస్థీకరణ తరువాత ఏం చేయాలి మరి..? సో, ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు…
- కాకపోతే కేసీయార్ చేసింది మాత్రం పక్కా అశాస్త్రీయ జిల్లాల ఏర్పాటు… 17 లోకసభ స్థానాలుంటే ఏకంగా 33 జిల్లాలు… కొన్నయితే మరీ లోకసభ స్థానాల జనాభాకన్నా తక్కువ… ఓ రెవిన్యూ డివిజన్‌కన్నా తక్కువ… వీటిని కేంద్రం గుర్తించి, జోన్ల గుర్తింపు ఆలస్యమయ్యేదాకా జాబ్ నోటిఫికేషన్లు పడని దురవస్థ… దాన్ని హేతుబద్ధీకరిస్తామయ్యా మహానుభావా అంటే ఠాట్ కుదరదు, అశాస్త్రీయత అలాగే కొనసాగాలి అని హూంకరింపులు..!!

బనకచర్ల అలియాస్ నల్లమలసాగర్ మీద అదే ‘అబ్సర్డిజం’… కేంద్ర జలసంస్థల దగ్గరే కాదు, ఏకంగా సుప్రీంకోర్టులో కేసు వేసింది తెలంగాణ… సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వం ద్వారా లేదా సపరేట్ సూట్ ద్వారా రండి, మీ బేసిన్‌లో ఇతర రాష్ట్రాల వాదనలు కూడా వినాలి అని చెప్పింది… అది సుప్రీం, తన సూచన అది…
ఠాట్, నాన్సెన్స్, కావాలని చంద్రబాబు కోసం బలహీన వాదనలు వినిపించాడు రేవంత్ రెడ్డి అని హరీష్ రావు ఫ్రస్ట్రేషన్… వీల్లేదు, చంద్రబాబూ బహుపరాక్, నల్లమలసాగర్ జోలికి వెళ్లకు అని సుప్రీం చెప్పి ఉండాల్సిందా..? మరి ఆనాడు కేసీయార్ సుప్రీంకోర్టులో వేసిన నదీజలాల పునఃపంపిణీ కేసును ఎందుకు వెనక్కి తీసుకున్నట్టు..?

- జగన్‌తో కలిసి తెలంగాణ నీటి హక్కుల్ని ఏపీకి ధారబోయటానికి విశ్వప్రయత్నం, సహకారం ఎందుకు చేసినట్టు..? ఏమైనా అంటే చంద్రబాబు అనే బూచిని చూపడం..! ఎస్, డౌట్ లేదు, జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ పక్కాగా తెలంగాణ వ్యతిరేకులే… వాళ్ల రాజకీయ కార్యక్షేత్రం ఏపీ… ఆ కోణంలోనే ఆలోచిస్తారు…
రేవంత్ రెడ్డి కార్యక్షేత్రం తెలంగాణ… తన అడుగులు తెలంగాణ కోణంలో, తన రాజకీయ భవితవ్యం కోసమే ఉంటాయి… ఉండాలి… అంతేతప్ప తనేదో చంద్రబాబుకు ఊడిగం చేస్తున్నట్టు పదే పదే ఈ బీఆర్ఎస్ ముద్రలు పక్కా దురుద్దేశపూరితం… చంద్రబాబును చూపించినంత మాత్రాన మళ్లీ సెంటిమెంట్ మంటలు పెంచేయగలమనేది ఉత్త రాజకీయ భ్రమ మాత్రమే… రియాలిటీ ఇది…
వరుసగా వెల్లడవుతున్న పాత పదేళ్ల అక్రమాలు, వైఫల్యాల నుంచి జనం ఆలోచనల్ని దారిమళ్లించడం తప్ప ఇందులో బీఆర్ఎస్ ఆలోచిస్తున్న మర్మం మరొకటి లేదు..!!

Share this Article